మహిళల ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి | You will women samajabhivrddhi | Sakshi
Sakshi News home page

మహిళల ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి

Published Sat, Jul 12 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

You will women samajabhivrddhi

  • అంతర్జాతీయ మహిళా వైద్య సదస్సులో టీటీడీ ఈవో
  •  తిరుపతి అర్బన్ :  మహిళల సంపూర్ణ ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ అభిప్రాయపడ్డారు. ఎస్వీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఉమెన్ హెల్త్’పై నిర్వహిస్తున్న 3 రోజుల సదస్సు తొలిరోజు కార్యక్రమాన్ని ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యాధికారి అరవింద్ మాథ్యూ, సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. ఈవో మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక సమాజంలో మహిళల ఆరోగ్యం, అభివృద్ధికి వైద్య సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

    టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న స్విమ్స్, మెడికల్ కాలేజీల నుంచి మహిళల వ్యాధులపై పరిశోధనలు చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఆందోళనకరంగా తయారైన సర్వైకల్ క్యాన్సర్, ఇతర రుగ్మతలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ, దళిత, గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలు లేవన్న సాకుతో నిపుణులైన వైద్య సిబ్బంది, వైద్యాధికారులు పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.

    ఇందుకు ఆయా ప్రాంతాల్లోని స్థానికులను వైద్యవిద్య వైపు చైతన్యం చేసి ఏఎన్‌ఎంలుగా, వైద్యాధికారులుగా అభివృద్ధి చేయాలని సూచించారు. మహిళలకు సురక్షిత తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు మరింత మెరుగ్గా అందించాలన్నారు. అప్పుడే ఆరోగ్య సమాజం ఏర్పడి అందరూ అభివృద్ధి సాధిస్తారన్నారు. విశిష్ట అతిథులు డాక్టర్ అరవింద్, మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధితోనే బలమైన, ఉన్నతమైన దేశం తయారౌతుందన్నారు.

    స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ సదస్సులో ప్రసంగించారు. చివరగా వైద్యవిద్యార్థినులు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను అలరించారు. వివిధ పోటీల్లో విజేతలైన వారికి టీటీడీ ఈవో సతీమణి జానకి గోపాల్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. సదస్సులో ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బద్దెల సుకుమార్, సదస్సు ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ జయభాస్కర్, సెక్రటరీ డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement