కాకినాడ క్రైం :అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడమే కాక, దుర్భాషలాడడంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు రుణదాత ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ జగన్నాథపురం శివారు మహాలక్ష్మినగర్‌కు చెందిన పెరుమాళ్ల కోవెల సూర్యప్రకాష్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం అతడు సమీపంలోని నాగరాజు అనే వ్యాపారి వద్ద చేసిన రుణానికి సంబంధించి వడ్డీతో పాటు చెల్లించినప్పటికీ కొద్దిగా బాకీ ఉండిపోయింది. అది తీర్చాలని ప్రకాష్‌పై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ నెల 24న నాగరాజు అతని ఇంటికి వచ్చి ఘర్షణకు దిగాడు.
ఆ సమయంలో ఇంటి వద్దే ఉన్న ప్రకాష్ రెండో కుమారుడు ప్రసాద్ (23) సర్దిచెప్పబోగా అతనిపై నాగరాజు విరుచుకుపడి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ అక్కడికి సమీపంలో ఉన్న జిమ్‌లో అతని సేహితుల వద్దకు వచ్చి తాను తాను చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగాడు. దీంతో స్నేహితులు ప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అతన్ని జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతడు శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నాగరాజు ఇంటివద్ద ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ నాగరాజును వెంటనే అరెస్టు చేయాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నాగరాజు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉసురు తీసిన అప్పు
Published Sat, Mar 28 2015 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM
Advertisement
Advertisement