దీపిక, చక్రవర్తి వివాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు
ప్రొద్దుటూరు టౌన్ : వారు ఇరువురు చదువుకున్నారు. గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే అబ్బాయి తరపున తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. పట్టణానికి చెందిన యువతి దీపిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వద్దకు వెళ్లి తాను ప్రేమించిన చక్రవర్తితో వివాహం చేయించాలని అభ్యర్థించారు. స్పందించిన ఎమ్మెల్యే దీపికను, ఆమె తల్లిదండ్రులను పిలుచుకుని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడలో నివాసం ఉంటున్న సిద్ధవటం చక్రవర్తి ఇంటికి బుధవారం వెళ్లారు. చక్రవర్తి దీపికను ప్రేమించిన విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పారు. ఇరువురి కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం వారిద్దరికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.
ప్రొద్దుటూరు మండల పరిధిలోని దొరసానిపల్లె రామాలయంలో వీరికి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మెల్యే వివాహం చేయించారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. దీపిక, చక్రవర్తిలను ఆశీర్వదించి ఎలాంటి కలహాలు లేకుండా వైవాహిక జీవితాన్ని కొనసాగించి పది మందికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే చెప్పారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించిన ఎమ్మెల్యేకు దీపిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ దేవీప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, షమీమ్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఓబయ్య యాదవ్, వరికూటి ఓబుళరెడ్డి, గోపవరం ఒకటో వార్డు ఎంపీటీసీ దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment