ఇంజినీరింగ్ విద్యాభ్యాసం పూర్తయ్యింది. ఏడాదైనా ఎటువంటి ఉద్యోగ అవకాశం రాలేదు. ఉద్యోగ వేటలో నిరాశకు గురైన ఆ యువకుడు జీవితంపైనే విరక్తి పెంచుకున్నాడు. క్షణికావేశంలో చచ్చిపోవాలని నిర్ణయించాడు..ఆలోచన వచ్చిందే మొదలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీర కొంగుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే...
కొత్తవలస: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి కొత్తవలస హెచ్‌సీ ఎ.రహిమాన్ అందించిన వివరాలు...రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన జి.వెంకటచిరంజీవి(22) తన సొంత ఇంట్లో ఫ్యాన్‌కు చీరకొంగుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిరంజీవి బీటెక్ విద్యాభ్యాసం పూర్తి చేసి ఏడాదిగా ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం రాలేదనే నిరుత్సాహంతో ఆత్మహత్యకు పాల్ప డినట్టు భావిస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఆత్మన్యూన్యత భావంతో ఏడాదిగా ఉన్న చిరంజీవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఇంట్లో వారికి తెలిసినా పోలీసులకు మాత్రం సాయంత్రం వరకు సమాచారం అందలేదు. మృతుని తండ్రి భాస్కరరావు ఫిర్యాదు మేరకు హెచ్‌సీ రహిమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
ఎవరూ బాధ్యులు కారు...
మృతుడు చిరంజీవి ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తన మృతికి ఎవరూ కారకులు కాదని, తానే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన దస్తూరితో రాసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్యోగం చేసి తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి మృతితో గ్రామంలో విషాదం అలముకొంది.
Comments
Please login to add a commentAdd a comment