పెనమలూరు : విజయవాడ – అవనిగడ్డ కరకట్టపై యనమలకుదురు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మరో యువకుడు ప్రాణాలు వదిలాడు. అయితే కారులో ఉన్న ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతున్న యువతులు కూడా గాయపడి కానూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు సరదాగా షికారుకు వెళ్లి కరకట్టపై ప్రమాదానికి గురయ్యారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట తోటవారి వీధికి చెందిన రేసపు జీవన్‌రెడ్డి (21) అదే ప్రాంతానికి చెందిన అతని మిత్రుడు నెక్కల ప్రశాంత్ (22) గత ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
వీరికి సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కానూరుకు చెందిన ఈదా స్నేహ (19), ముదిగొండ సుప్రజ (19) తో పరిచయం ఉంది. కాగా శుక్రవారం సాయంత్రం స్నేహ, సుప్రజ ఎసైన్‌మెంట్ ఉందని పటమటలో జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ జీవన్‌రెడ్డి, ప్రశాంత్ కారులో ఉండటంతో వారిని కూడా ఎక్కమని కోరారు. దీంతో నలుగురూ కారులో షికారుకు బయలుదేరారు. వీరి కారు రాత్రి యనమలకుదురు కరకట్ట చింతల్ వద్దకు రాగా ఎదురుగా వచ్చిన ఇసుక లోడు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న జీవన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వెనుక సీట్‌లో కుడి పక్కన కూర్చున్న ప్రశాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో ఉన్న స్నేహ, సుప్రజలకు కూడా గాయాలు అవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు.
కోలుకుంటున్న విద్యార్థినులు..
కాగా, కారులో ఉన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులు కానూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ట్రాక్టర్, కారును కుడిపక్క ఢీకొట్టడంతో కారులో ఆ వైపుగా కూర్చున్న ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. కారులో ఎడమ వైపున కూర్చున్న యువతులు ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రి సమయంలో వీరు కరకట్టపై కారులో షికారు చేయటం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. అందులోనూ కారు వేగంగా వెళ్లటం వలన ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. సరదాగా షికారుకు వెళ్లిన వీరిలో యువకులు ప్రాణాలు వదటం విషాదం మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment