గల్లంతైన వారి కోసం పడిగాపులు కాసిన బంధువులు,స్నేహితులు,కుటుంబ సభ్యులు
క్షణాలు నిమిషాలయ్యాయి.. నిమిషాలు గంటలుగా మారాయి.. గంటలు కాస్త రోజుగా.. రోజున్నరగా.. ఇలా కాలం కరిగిపోతోంది. దాంతోపాటే వారి ఆశలు కరిగిపోతున్నాయి.. అయినా నిరీక్షణ మానలేదు..
ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశతో తీరానికే అతుక్కుపోయారు. నిద్ర, తిండి ఇవేవీ పట్టడంలేదు.. కన్నీటి సుడులను ఆపుకొంటూ తీరంపై రెప్పలార్చకుండా కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.
నేవీ, కోస్టుగార్డు షిప్పులు, హెలికాప్టర్లు, గత ఈతగాళ్లు.. ఇలా అన్ని రకాలుగా సాగరాన్ని మధిస్తున్నా.. వారి అన్వేషణ పూర్తిగా ఫలించలేదు.ఆదివారం సాయంత్రం సముద్రంలో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఇప్పటివరకు ఇద్దరి ఆచూకీ మాత్రమే లభించింది.అది కూడా సోమవారం సాయంత్రం గంగవరం పోర్టు సమీపంలో వేర్వేరు ప్రాంతాల్లో దుర్గా, గణేష్‌లు విగత జీవులుగానే లభించడంతో.. వారి కుటుంబాల అన్వేషణ, నిరీక్షణ విషాదాంతమైంది.మిగిలిన నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నాయి.ఎక్కడో.. ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశ.. ఆ ఆశతోనే తీరంలో రెండు రోజులుగా తిండీతిప్పలు మాని అలాగే ఉండిపోయారు. ఏ క్షణంలోనైనా గాలింపు బృందాలు శుభవార్త చెబుతాయేమనని ఆతృతగా గాలింపు చర్యలను గమనిస్తూ ఉండిపోయారు.వారి రోదనలు సాగర ఘోషను మించిపోయాయి.. తుపాను ప్రభావంతో సాగర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా.. అంతకుమించి బాధిత కుటుంబాలు, స్నేహితుల కన్నీటి కెరటాలు పోటెత్తుతున్నాయి.ఆదివారం సాయంత్రం నుంచీ ఇక్కడే ఉండిపోయిన బాధితులకు ఆపన్నహస్తం అందిస్తూ యారాడ గ్రామస్తులు మానవత చాటుకుంటున్నారు.
మల్కాపురం(విశాఖ పశ్చిమ): యారాడ సముద్రతీరానికి ఆదివారం విహారానికి వచ్చిన 12 మంది యువకుల్లో ఆరుగురు గల్లంతవడంతో అంతటా విషాదం అలుముకుంది. సోమవారం సాయంత్రం వరకు వారి కోసం తీరంలో గాలించినా ఆచూకీ లభ్యం కావడంతో అందరిలో ఉత్కంఠ రేగింది. అయితే వారిలో హెచ్‌బీకాలనీ చాకలిపేటకు చెందిన దుర్గా(20),అదే ప్రాంతం భానునగర్ ప్రాంతానికి చెందిన నక్క గణేష్ (17)లు మృతి చెందారు. వారి మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం గంగవరం సముద్ర తీరం వద్దకు కొట్టుకువచ్చాయి. వీరిని గుర్తించిన అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బోట్ల సాయంతో యారాడ తీరానికి తీసుకువచ్చి గల్లంతైన యువకుల బంధువులు, కుటుంబ సభ్యులకు చూపించారు. తొలుత వచ్చిన మృతదేహం దుర్గాదిగా, అనంతరం వచ్చిన మృతదేహాం గణేష్‌దిగా వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారి భౌతిక కాయాలను శవపంచనామా నిమిత్తం కేజీహెచ్‌కు న్యూపోర్టు పోలీసులు తరలించారు.
ఆదివారం నుంచి తీరంలోనే
కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి గల్లంతైన ఆరుగురి యువకుల తల్లిదండ్రులు,కుటుంబ సుభ్యలు,స్నేహితులు తిండి, నిద్ర మాని ఆశగా తీరం వైపు ఎదురుచూస్తూ అక్కడే ఉండి పోయారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోనేందుకు నేవీ,కోస్టుగార్డు,మెరైన్, న్యూపోర్టు పోలీసులు,గజ ఈత గాళ్లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి రెండు హెలికాఫ్టర్ల సాయంతో తీరం పై నుంచి బైనోక్లాక్,కెమెరాలు,జూమ్ కెమెరాల సాయంతో పరిశీలించారు. మూడు బోట్లు సాయంతో ఇతర సిబ్బంది గాలింపు చర్యలు చేట్టారు.బంధువులు,స్నేహితులు, కుటుంబ సభ్యులు తిండి,నిద్ర లేకుండా బాధతో తీరంలో ఉండడంతో యారాడ గ్రామ ప్రజలు చలించిపోయారు. వీరందరికీ భోజనాలు సమకూర్చారు.
మిన్నంటిన రోదనలు
గల్లంతైన వారి బంధువులు,కుటుంబ సభ్యుల రోదనలతో యారాడ సముద్ర తీరం శోకసంద్రంగా మారింది. ఎన్నో ఆశలతో పెంచుకున్న కన్న బిడ్డలు యవ్వనంలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారని మృతులు గణేష్,దుర్గా తల్లిదండ్రులు రోదన అక్కడ వారిని కంటతడి పెట్టించింది. చేతికి అందివస్తారన్న తమ కుమారులు ఇంతలోనే వెళ్లిపోయారని.. తమకు ఇంకెవరు దిక్కు అంటూ మృతుల తల్లిదండ్రులు అక్కడ గంగమ్మవైపు ఆక్రోశంగా చూస్తూ రోదించారు. కంటికి రెప్పలా చూసుకున్న తమ బిడ్డలను పొట్టన పెట్టుకుని మా ఆశలు చిదిమేశావంటూ విలపించారు.
మిత్రులను మరవలేకున్నాం
ఎంతటి ఒత్తిడిలో ఉన్న నిత్యం మేమంతా ఒక్కసారైనా,లేదా ఫోన్లోనైనా కుసల ప్రశ్నలు వేసుకోనే వారిమి. ఇప్పుడు మా తో ఎవరు కబుర్లు చెబుతారు. మా బాధలు ఎవరు పంచుకుంటారు అంటూ మృతులు,గల్లంతైన యువకుల స్నేహితులు రోదించారు.
రూ.200 అడిగితే రూ. 300 ఇచ్చా
స్నేహితులతో సరదాగా విహారానికి వెళ్తున్నా రూ.200 ఇవ్వు అమ్మా అని ముద్దుగా అడిగితే రెండు వందలు ఏమి సరిపోతాయి.. రూ.300 తీసుకో నాన్నా అని ఇచ్చానని మృతుడు దుర్గా తల్లి గుర్తుచేసుకున్నారు. సాయంత్రం వచ్చినప్పుడు ఏమైనా తెస్తానని చెప్పి వెళ్లిన కొడుకు మాటను గర్తుచేస్తుకుంటూ విలపించింది. బిడ్డా నాకు ఏమీతీసుకురాకుండానే పరలోకానికి పో యావా అంటూ ఆ తల్లి రోదన చూసిన వారు తల్లడిల్లిపోయారు.
మాకు నవ్వులు ఎవరు పంచుతారు నాయనా
విధులు ముగించుకుని ఇంటికి వచ్చే గణేష్(మృతుడు)ఇంట్లో టీవీ చూçస్తూ ఆ కార్యక్రమాలను అనుకరిస్తూ మమ్మల్ని నవ్వించేవాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నవ్విస్తారంటూ గణేష్ కుటుం బ సభ్యులు రోదించారు. నవ్వులు పంచుతానని చెప్పి ఇలా ఏడిపిస్తావా అంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment