తిరుపతి మృతదేహాన్ని తీరానికి తీసుకొస్తున్న ఈతగాళ్లు, పోలీసులు
యారాడ బీచ్‌లో మూడోరోజూ కన్నీటి కెరటాలు పోటెత్తాయి. గల్లంతైన ఆరుగురు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. అయితే కుటుంబ సభ్యులు, బంధువుల ఆశలు కరిగిపోతున్నాయి. సోమవారం ఇద్దరి మృతదేహాలు లభించగా.. మంగళవారం మరో ముగ్గురు విగత జీవులుగానే లభించారు. మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నా.. ఆశలు మాత్రం ఆవిరవుతున్నాయి.
మల్కాపురం(విశాఖ పశ్చిమ): సరదాగా యారాడ తీరంలో గడుపుదామని వెళ్లి రాకాసి అలలకు చిక్కిన వారిలో మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గంగవరం పోర్టు తీరంలో మంగళవారం ఉదయం ఒకరిది, సాయంత్రం మరొకరి మృతదేహం లభ్యమయ్యాయి. వీరిని దేవర వాసు(21), పేరిడి తిరపతి (21)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో రాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడి మృతదేహాన్ని న్యూపోర్టు పోలీసులు వెలికితీశారు. హెచ్‌బీ కాలనీ సమీప చాకలిపేట పరిధి భానునగర్‌కు చెందిన కోనా శ్రీనివాస్(21) మృతదేహంగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఇప్పటికే సోమవారం సాయంత్రం గంగవరం పోర్టు సమీపంలో వేర్వేరు ప్రాంతాల్లో నక్కా గణేష్(17), సోమిరెడ్డి దుర్గ(21) విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే. మిగిలిన దౌలపల్లి రాజేష్(21)ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నేవీ, కోస్టుగార్డు, మెరైన్ సిబ్బంది, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. భీమిలి, ఆర్‌కే బీచ్, గంగవరం పోర్టు తీరం, అప్పికొండ తీరంలో గాలిస్తున్నారు. బుధవారం ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
కోటి ఆశలతో ఎదురు చూపులు
గల్లంతైన వారిలో ఇప్పటికి ఐదుగురి ఆచూకీ లభ్యం కావడంతో మిగిలిని రాజేష్ కోసం వారి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్కడిని అయినా సురక్షితంగా ఒడ్డుకు చేర్చు తల్లీ అని యారా డ తీరంలో గంగమ్మను వేడుకుంటున్నారు. తిండి, నిద్ర మానుకుని యారాడ తీరంలో మూడు రోజుల నుంచి విలపిస్తుండడంతో వారి ని ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. కంటికి రెప్పలా పెంచుకున్న కుమారులు ఇలా తమ ఆశలు ఆవిరి చేసి వెళ్లిపోయారంటూ మృతులు దేవర వాసు, తిరుపతి తల్లులు విలపిస్తున్నారు. తండ్రి మరణానంతరం ఆటో నడుపుతూ తల్లికి అండగా ఉన్న దేవర వాసు, తండ్రి చనిపోయాక తల్లి రెక్కల కష్టంతో ఐటీఐ చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్న పేరిడి తిరుపతి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంక మాకు దిక్కెవరు అంటూ ఆ తల్లులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
బాధిత కుటుంబాలకు వంశీకృష్ణ పరామర్శ
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): యారాడ బీచ్‌లో గల్లంతై మృతి చెందిన యువకుల కు టుంబాలను వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త వంశీ కృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ మా ర్చురీ వద్ద మంగళవారం ప రామర్శించారు. పోలీసు అధి కారులతో మాట్లాడుతూ పం చనామా త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. అనంతరం హెచ్‌బీ కాలనీకి చెందిన నక్క గణేష్, దుర్గ, దుర్గానగర్‌కు చెందిన వాసు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులు పేద కుటుంబాలకు చెందినవారని, కుటుంబాలకు ఆసరాగా ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించడంతో నమ్ముకున్న వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం త్వరగా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కో రారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటా నని, అవసరమైన సహాయాన్ని అందిస్తానని చెప్పారు. ఆయనతోపాటు మాజీ కార్పొరేటర్ మొల్లి అప్పారావు, వైఎస్సార్ సీపీ 9వ వార్డు అధ్యక్షుడు అప్పారి గిరిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment