ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందోననే మనస్తాపంతో ఓ యువతి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్సీ బాలయ్య కాలనీలో గురువారం జరిగింది.
నెల్లూరు (క్రైమ్): ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందోననే మనస్తాపంతో ఓ యువతి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్సీ బాలయ్య కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రివాడకు చెందిన గంటా కృష్ణయ్య కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చారు. నవాబుపేట ఎన్నీ బాలయ్య కాలనీలో నివాసముంటున్నారు.
ఆయన కుమార్తె రుక్మిణి (19) నవాబుపేటలోని ఓ ప్రైవేటు (హాస్పిటల్) క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గురువారం ఓ యువకుడు హాస్పిటల్‌కు వచ్చి తాను రుక్మిణి ప్రేమించుకుంటున్నామని, ఆమెకు ఎలా ఉద్యోగం ఇస్తారని డాక్టర్‌ను నిలదీశారు. దీంతో డాక్టర్ రుక్మిణిని పిలిచి అడుగగా తనకు అతను ఎవరో తెలియదని చెప్పింది. దీంతో డాక్టర్ ఇంటికి వెళ్లి తండ్రిని తీసుకుని హాస్పిటల్‌కు రావాలని చెప్పాడు.
ఈ వ్యవహారం ఎక్కడ తల్లిదండ్రులకు తెలుస్తుందోనని మనస్థాపం చెందిన రుక్మిణి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపుకు లోపల నుంచి గడియపెట్టుకుని ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదు. దీంతో అతికష్టంపై తలుపులు తెరచి చూడగా రుక్మిణి ఆత్మహత్య చేసుకుని ఉంది. ఆత్మహత్య విషయంపై రెండోనగర పోలీసులకు సమాచారం అందించారు.
ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ వి. శ్రీహరిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీశారు. హాస్పిటల్‌కు వచ్చి డాక్టర్‌ను నిలదీసిన ఆ యువకుడు ఎవరనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.