మేకలు మేపే యువతిపై అత్యాచారం, హత్య
స్థానికులే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానం
తెల్లవారితే మహిళా దినోత్సవ సంబరాలు.. ఇదే సమయంలో అభం శుభం తెలియని యువతి బతుకు తెల్లారిపోయింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు.. అంతటితో ఆగకుండా గొంతునులిమి చంపేశారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చారు. -పెనుమూరు
తండ్రి లేడు.. తల్లికి మతిస్థిమితం లేదు. ఆసరా లేని ఆడపిల్ల పిన్ని ఇంట్లో పెరిగింది. మేకలు కాసేందుకు వెళ్లి కామాంధుల అకృత్యానికి బలైంది. కలవగుంట పంచాయతీ దిగువపూనేపల్లెలో అంతులేని విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, గిలిజ దంపతులకు నలుగురు ఆడ సంతానం. సుబ్రమణ్యం పిల్లలు చిన్నతనంలో చనిపోయాడు. దీంతో బాలికలు తండ్రి లేనివారయ్యారు. భర్త మృతితో గిలిజకు మతిస్థిమితం లేకుం డాపోయింది. దీంతో బాలికలు పిన్నమ్మ కుట్టెమ్మ, చిన్నాన్న జగన్నాథం వద్ద పెరిగారు. మొదటి ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపారు. చివరి అమ్మాయి రీటా (18) చదువుకోలేదు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మేకలు తోలుకుని ఊరి పొలిమేరకు వెళ్లింది. ఇదే సమయంలో కొందరు కామాంధులు ఆమెపై కన్నేశారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రీటాను వివస్త్రను చేసి ఆత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిపి చంపేశారు. నాలుగు గంటల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియ లేదు.
ఆ వైపుగా వెళ్తున్న కొందరు పొదల మధ్య పడి ఉన్న మృతదేహం చూసి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాగిలాలను రప్పించి తీవ్ర స్థాయిలో పరిశోధన ప్రారంభించారు. రాత్రి 10 గంటల వరకు ఎస్పీ స్థానికులను విచారించి నిందితుల సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు జాగిలాలు ఘటన జరిగిన మొత్తం ప్రాంతాన్ని తనిఖీచేసి అనుమానం ఉన్న చోట ఆగిపోయాయి. తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితులను త్వరలో పట్టుకుంటాం
ఎస్పీ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురు, నలుగురు కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉం డవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. సంఘటన స్థలం నుంచి జాగిలాలు ప్రధాన రహదారి వరకు వచ్చి ఆగిపోవడంతో నిందితులు అక్కడి వరకు మాత్రమే ద్విచక్రవాహనంలో వచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు.
మాయని మచ్చ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడానికి తయారవుతున్నాం. ఇంతలో పెనుమూరు మండలంలో ఘటన తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. చట్టాలు చేయడం తేలిక అయితే వాటి అమలు చేసి మహిళల ప్రాణాలు కాపాడాల్సినబాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. నిందితులను వెంటనే పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
-గాయత్రీదేవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
అమానుషం
Published Sun, Mar 8 2015 1:08 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement