సాక్షి, అనంతపురం : ఆదాయ మార్గాలను దక్కించుకునే విషయంలో ‘తెలుగు తమ్ముళ్ల’ మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. టీడీపీ ఇలా అధికారంలోకి వచ్చిందో, లేదో అప్పుడే ఎవరికి వారు ఆదాయ వనరుల అన్వేషణలో నిమగ్నమైపోయారు. ఇన్నాళ్లూ ఇతర పార్టీల వారి ఆధీనంలో ఉన్న వాటిని లాగేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ వారి నుంచే తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. పుట్లూరు మండల పరిధిలోని గాలిమరల వద్ద భద్రతకు సెక్యురిటీ గార్డులను సరఫరా చేసే ఏజెన్సీల కోసం టీడీపీ నాయకుల మధ్య వార్ మొదలైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకుల అజమాయిషీలో ఉన్న ఈ ఏజెన్సీలను దక్కించుకోవడానికి ‘తమ్ముళ్లు’ పోటీ పడుతున్నారు. ఇందుకోసం గాలిమరల యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కరెంటు ఉత్పత్తి చేయడానికి పుట్లూరు మండల పరిధిలోని కోమటికుంట్ల, చాలవేముల, గరుగుచింతపల్లి, పుట్లూరు కొండలపై పలు కంపెనీలు గాలిమరలను ఏర్పాటు చేశాయి.
ఇక్కడ భారత్ విండ్ ఫాం కంపెనీకి 97, లైట్ విండ్‌కు 37, వెస్టాస్‌కు ఆరు, పైనీర్‌కు ఆరు, ఎన్‌ఈపీసీకి ఆరు, గమేషా కంపెనీకి ఆరు గాలిమరలు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం సెక్యురిటీ గార్డులను నియమించారు. ఐదు ఏజెన్సీల పరిధిలో 120 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. ఈ ఏజెన్సీలను పదేళ్లుగా తాడిపత్రికి చెందిన కాంగ్రెస్ నాయకులే నిర్వహిస్తున్నారు. గాలిమరల యాజమాన్యం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.5 వేల చొప్పున వేతనాన్ని ఏజెన్సీల ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక్కొక్కరిపై రూ.1,500 చొప్పున ఏజెన్సీ నిర్వాహకులు కమీషన్ తీసుకుంటూ.. రూ.3,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. దీంతో వారికి ప్రతినెలా 120 మందిపై రూ. 1.80 లక్షల ఆదాయం సమకూరుతోంది.
ఆ కాంట్రాక్టు మాకే ఇవ్వండి
పుట్లూరు మండల పరిధిలోని గాలిమరల వద్ద సెక్యురిటీ సిబ్బంది ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు తమకే కట్టబెట్టాలని గాలిమరల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుభవించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీ బాధ్యతలు తమకే ఇవ్వాలని, లేని పక్షంలో గాలిమరలను తిరగనివ్వమని యాజమాన్యాలపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. కంపెనీ ఉద్యోగులను గాలిమరల నుంచి స్వగ్రామాలకు తరలించడానికి ఏర్పాటు చేసే వాహనాల టెండర్‌ను, తాగునీటి సరఫరా బాధ్యతలు తమకే అప్పగించాలని మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.
రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారు ఏజెన్సీ బాధ్యతలను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు విషయాన్ని రెండు రోజుల క్రితం జేసీ బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఇరు వర్గాల వారు జేసీ బ్రదర్స్‌కు కావాల్సిన వారు కావడంతో.. ఇది వారికి ఇబ్బందికరంగా మారినట్లు తెలిసింది. గాలిమరలకు సంబంధించిన భద్రత ఏజెన్సీ ఎవరికి ఇమ్మంటే ఎవరు దూరమౌతారో.. ఎవర్ని కాదంటే ఎవరు అలుగుతారోనని వారు సైతం మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ నాయకుల వత్తిళ్లతో గాలిమరల యాజమాన్యాలు మాత్రం హడలెత్తిపోతున్నాయి.
తమ్ముళ్ల మధ్య గాలి దుమారం
Published Wed, Jun 18 2014 2:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement