Current Product
-
మనకు కరువు.. వాళ్లకు కరెంట్!
కృష్ణా బేసిన్లో తెలంగాణ, ఏపీలకు నీటి కటకట * ఎగువన మహారాష్ట్రలో మాత్రం కరెంట్ ఉత్పత్తి * 100 టీఎంసీల మేర నీటిని విద్యుదుత్పత్తికి వాడేసుకున్న మహారాష్ట్ర * కోయినా ప్రాజెక్టు నుంచి 25 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి.. * ఈ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకువెళ్లనున్న తెలంగాణ, ఏపీ. సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ ఖాళీ అయి తెలంగాణ, ఏపీలు కొట్టుమిట్టాడుతుంటే.. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు వాటాలు అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా నీటిని వాడేసుకుంటున్నాయి. సొంత ప్రయోజనాలే లక్ష్యంగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృథా చేస్తున్నాయి. ఆల్మట్టి ద్వారా కర్ణాటక ఎడాపెడా నీటిని వినియోగిస్తున్న మాదిరే కృష్ణా బేసిన్లో మహారాష్ట్ర కోయినా ప్రాజెక్టులో ఇప్పటికే 100 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తికి వాడేసింది. 30 టీఎంసీల మేర నీటిని వృథాగా అరేబియా సముద్రం పాలు చేసింది. ఇక్కడ తాగునీటికే దిక్కులేదు.. వర్షాభావం కారణంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయి. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో వాడుకునేందుకు వీలున్న నీరు 20 టీఎంసీలు కూడా లేదు. ఈ నీటినే కృష్ణా బేసిన్‌లోని 3 కోట్ల మంది ప్రజలకు సరఫరా చేయాలి. ఇక్కడ ఇంత గడ్డు పరిస్థితి ఉండగా.. ఎగువన మహారాష్ట్ర తనకు లభించిన లభ్యత జలాలను విద్యుదుత్పత్తి కోసం వాడేసుకుంటోంది. జూలై నుంచి కురిసిన వర్షాలతో అక్కడి ప్రాజెక్టుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. ఆ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న 38 (కృష్ణా నదిపై 13, భీమా నదిపై 25) ప్రాజెక్టులు 65 నుంచి 80 శాతం నీటి నిల్వతో కళకళలాడుతున్నాయి. బేసిన్ ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న కోయినా రిజర్వాయర్‌లో జూలైలో 8.5 టీఎంసీల మేర నీరు ఉంది. తర్వాత విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాజెక్టులోకి నీరు రావడంతో.. 2 నెలలుగా విద్యుదుత్పత్తి చేస్తూనే ఉన్నారు. అలా ఇప్పటివరకు 100 టీఎంసీల నీటిని వాడేసుకున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుదుత్పత్తి చేయగా దిగువకు వెళ్లే నీటిని కొంతమేర సాగు అవసరాలకు మళ్లించగా.. దాదాపు 25 టీఎంసీల నీరు వృథాగా అరేబియా సముద్రంలో వెళ్లిందని అంచనా. ప్రస్తుతం కోయినా డ్యామ్‌లో 83 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇంకా విద్యుదుత్పత్తి చేస్తే.. మరింత నీరు సముద్రం పాలవక తప్పదు. వీటితోపాటు 27 టీఎంసీల సామర్థ్యమున్న వర్ణా ప్రాజెక్టు పరిధిలోనూ మహారాష్ట్ర విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 585 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ తనకుందన్న భావనతోనే ఇష్టారీతిన నీటిని వాడుకుంటోందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా నీటి పంపిణీలో అన్ని రాష్ట్రాలకు న్యాయం చేకూర్చే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. సుప్రీం ముందుకు తెలంగాణ, ఏపీ కృష్ణా నీటి కష్టాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ, ఏపీలు నిర్ణయించాయి. ఈ నెల 26, 27 తేదీల్లో కృష్ణా జలాల పంపిణీపై జరిగే తుది విచారణలో ఇవే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు నీరు తక్కువ ఉన్న సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్న నిర్దేశాలను బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్లు చెప్పలేదని కోర్టుకు తెలిపాయి. తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నీటిని తెలంగాణకు విడుదల చేయాలని... దిగువ రాష్ట్రం ఏపీకి మూడు రాష్ట్రాలూ నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని తెలంగాణ వివరించింది. ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు అన్న అంశంపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని... కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని పిటిషన్లో కోరింది. -
తమ్ముళ్ల మధ్య గాలి దుమారం
సాక్షి, అనంతపురం : ఆదాయ మార్గాలను దక్కించుకునే విషయంలో ‘తెలుగు తమ్ముళ్ల’ మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. టీడీపీ ఇలా అధికారంలోకి వచ్చిందో, లేదో అప్పుడే ఎవరికి వారు ఆదాయ వనరుల అన్వేషణలో నిమగ్నమైపోయారు. ఇన్నాళ్లూ ఇతర పార్టీల వారి ఆధీనంలో ఉన్న వాటిని లాగేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ వారి నుంచే తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. పుట్లూరు మండల పరిధిలోని గాలిమరల వద్ద భద్రతకు సెక్యురిటీ గార్డులను సరఫరా చేసే ఏజెన్సీల కోసం టీడీపీ నాయకుల మధ్య వార్ మొదలైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకుల అజమాయిషీలో ఉన్న ఈ ఏజెన్సీలను దక్కించుకోవడానికి ‘తమ్ముళ్లు’ పోటీ పడుతున్నారు. ఇందుకోసం గాలిమరల యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కరెంటు ఉత్పత్తి చేయడానికి పుట్లూరు మండల పరిధిలోని కోమటికుంట్ల, చాలవేముల, గరుగుచింతపల్లి, పుట్లూరు కొండలపై పలు కంపెనీలు గాలిమరలను ఏర్పాటు చేశాయి. ఇక్కడ భారత్ విండ్ ఫాం కంపెనీకి 97, లైట్ విండ్‌కు 37, వెస్టాస్‌కు ఆరు, పైనీర్కు ఆరు, ఎన్ఈపీసీకి ఆరు, గమేషా కంపెనీకి ఆరు గాలిమరలు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం సెక్యురిటీ గార్డులను నియమించారు. ఐదు ఏజెన్సీల పరిధిలో 120 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. ఈ ఏజెన్సీలను పదేళ్లుగా తాడిపత్రికి చెందిన కాంగ్రెస్ నాయకులే నిర్వహిస్తున్నారు. గాలిమరల యాజమాన్యం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.5 వేల చొప్పున వేతనాన్ని ఏజెన్సీల ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక్కొక్కరిపై రూ.1,500 చొప్పున ఏజెన్సీ నిర్వాహకులు కమీషన్ తీసుకుంటూ.. రూ.3,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. దీంతో వారికి ప్రతినెలా 120 మందిపై రూ. 1.80 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఆ కాంట్రాక్టు మాకే ఇవ్వండి పుట్లూరు మండల పరిధిలోని గాలిమరల వద్ద సెక్యురిటీ సిబ్బంది ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు తమకే కట్టబెట్టాలని గాలిమరల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుభవించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీ బాధ్యతలు తమకే ఇవ్వాలని, లేని పక్షంలో గాలిమరలను తిరగనివ్వమని యాజమాన్యాలపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. కంపెనీ ఉద్యోగులను గాలిమరల నుంచి స్వగ్రామాలకు తరలించడానికి ఏర్పాటు చేసే వాహనాల టెండర్‌ను, తాగునీటి సరఫరా బాధ్యతలు తమకే అప్పగించాలని మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు ఎవరికి వారు ఏజెన్సీ బాధ్యతలను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు విషయాన్ని రెండు రోజుల క్రితం జేసీ బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఇరు వర్గాల వారు జేసీ బ్రదర్స్‌కు కావాల్సిన వారు కావడంతో.. ఇది వారికి ఇబ్బందికరంగా మారినట్లు తెలిసింది. గాలిమరలకు సంబంధించిన భద్రత ఏజెన్సీ ఎవరికి ఇమ్మంటే ఎవరు దూరమౌతారో.. ఎవర్ని కాదంటే ఎవరు అలుగుతారోనని వారు సైతం మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ నాయకుల వత్తిళ్లతో గాలిమరల యాజమాన్యాలు మాత్రం హడలెత్తిపోతున్నాయి.