మనకు కరువు.. వాళ్లకు కరెంట్! | Krishna basin In Telangana, AP Water problems | Sakshi
Sakshi News home page

మనకు కరువు.. వాళ్లకు కరెంట్!

Published Thu, Aug 20 2015 2:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మనకు కరువు.. వాళ్లకు కరెంట్! - Sakshi

మనకు కరువు.. వాళ్లకు కరెంట్!

కృష్ణా బేసిన్‌లో తెలంగాణ, ఏపీలకు నీటి కటక
* ఎగువన మహారాష్ట్రలో మాత్రం కరెంట్ ఉత్పత్తి
* 100 టీఎంసీల మేర నీటిని విద్యుదుత్పత్తికి వాడేసుకున్న మహారాష్ట్ర
* కోయినా ప్రాజెక్టు నుంచి 25 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి..
* ఈ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకువెళ్లనున్న తెలంగాణ, ఏపీ.
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ ఖాళీ అయి తెలంగాణ, ఏపీలు కొట్టుమిట్టాడుతుంటే.. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు వాటాలు అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా నీటిని వాడేసుకుంటున్నాయి.

సొంత ప్రయోజనాలే లక్ష్యంగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృథా చేస్తున్నాయి. ఆల్మట్టి ద్వారా కర్ణాటక ఎడాపెడా నీటిని వినియోగిస్తున్న మాదిరే కృష్ణా బేసిన్‌లో మహారాష్ట్ర కోయినా ప్రాజెక్టులో ఇప్పటికే 100 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తికి వాడేసింది. 30 టీఎంసీల మేర నీటిని వృథాగా అరేబియా సముద్రం పాలు చేసింది.
 
ఇక్కడ తాగునీటికే దిక్కులేదు..
వర్షాభావం కారణంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయి. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో వాడుకునేందుకు వీలున్న నీరు 20 టీఎంసీలు కూడా లేదు. ఈ నీటినే కృష్ణా బేసిన్‌లోని 3 కోట్ల మంది ప్రజలకు సరఫరా చేయాలి. ఇక్కడ ఇంత గడ్డు పరిస్థితి ఉండగా.. ఎగువన మహారాష్ట్ర తనకు లభించిన లభ్యత జలాలను విద్యుదుత్పత్తి కోసం వాడేసుకుంటోంది.

జూలై నుంచి కురిసిన వర్షాలతో అక్కడి ప్రాజెక్టుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. ఆ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న 38 (కృష్ణా నదిపై 13, భీమా నదిపై 25) ప్రాజెక్టులు 65 నుంచి 80 శాతం నీటి నిల్వతో కళకళలాడుతున్నాయి. బేసిన్ ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న కోయినా రిజర్వాయర్‌లో జూలైలో 8.5 టీఎంసీల మేర నీరు ఉంది. తర్వాత విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాజెక్టులోకి నీరు రావడంతో.. 2 నెలలుగా విద్యుదుత్పత్తి చేస్తూనే ఉన్నారు. అలా ఇప్పటివరకు 100 టీఎంసీల నీటిని వాడేసుకున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

విద్యుదుత్పత్తి చేయగా దిగువకు వెళ్లే నీటిని కొంతమేర సాగు అవసరాలకు మళ్లించగా.. దాదాపు 25 టీఎంసీల నీరు వృథాగా అరేబియా సముద్రంలో వెళ్లిందని అంచనా. ప్రస్తుతం కోయినా డ్యామ్‌లో 83 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇంకా విద్యుదుత్పత్తి చేస్తే.. మరింత నీరు సముద్రం పాలవక తప్పదు. వీటితోపాటు 27 టీఎంసీల సామర్థ్యమున్న వర్ణా ప్రాజెక్టు పరిధిలోనూ మహారాష్ట్ర విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 585 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ తనకుందన్న భావనతోనే ఇష్టారీతిన నీటిని వాడుకుంటోందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా నీటి పంపిణీలో అన్ని రాష్ట్రాలకు న్యాయం చేకూర్చే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు.
 
సుప్రీం ముందుకు తెలంగాణ, ఏపీ
కృష్ణా నీటి కష్టాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ, ఏపీలు నిర్ణయించాయి. ఈ నెల 26, 27 తేదీల్లో కృష్ణా జలాల పంపిణీపై జరిగే తుది విచారణలో ఇవే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు నీరు తక్కువ ఉన్న సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్న నిర్దేశాలను బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్‌లు చెప్పలేదని కోర్టుకు తెలిపాయి.

తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నీటిని తెలంగాణకు విడుదల చేయాలని... దిగువ రాష్ట్రం ఏపీకి మూడు రాష్ట్రాలూ నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని తెలంగాణ వివరించింది. ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు అన్న అంశంపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని... కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని పిటిషన్‌లో కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement