- ప్రజలకు తెలుగులోనే సమాధానాలివ్వడం
- ఇంగ్లీష్‌లో చెబితే సామాన్యులకెలా అర్ధమవుతుంది
- అధికారులను సున్నితంగా మందలించిన కలెక్టర్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్‌కు 29 ఫోన్ కాల్స్ వచ్చాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదని పరవాడ నుంచి వచ్చిన ఫిర్యాదు రాగా ఆర్డీఓ పరిశీలించి తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్‌ృ కార్యక్రమం నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే సమాచారం లేదని నాతవరం నుంచి ఒక ఫిర్యాదు చేయగా, బీసీ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ నిధులు రాగానే సమాచారమిస్తామని చెప్పారు.
ఎస్.రాయవరం మండలంలో రాత్రి పూట అక్రమంగా ఇసుక రావాణా జరుగుతోందని ఫోన్‌రాగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదని మూడు ఫోన్ కాల్స్ రాగా డీఆర్వో స్పందిస్తూ వారం రోజులలోగా వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. హుకుంపేట మండలం నుంచి ఒకరు ఫోన్ చేసి ఎంపీపీ స్కూల్‌లో సుమారు 170 మంది వరకు విద్యార్థులున్నారని, నెల రోజుల నుంచి ఉన్న ఒక్క టీచర్ కూడా రావడం లేదని చెప్పగా, కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసి, వేరొక టీచర్‌ను నియమించాలని డీఈఓను ఆదేశించారు. వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చోడవరం మండలం నుంచి ఫోన్ రాగా ఆర్డీఓ వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 105 దరఖాస్తులు : జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావులకు విన్నవించుకున్నారు. గృహాలు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయి. వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో అదనపు సంయుక్త కలెక్టర్ వై. నరసింహారావు, వికలాంగ సంక్షేమ శాఖ ఏడీ నర్సింహమూర్తి వికలాంగుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు.
తెలుగు పలకరే..!
‘ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నేనే తెలుగు నేర్చుకున్నాను. తెలుగులో మాట్లాడుతున్నా. మీరు తెలుగులో సమాధానాలు చెప్పలేరా?. తమ సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజలు వస్తుంటారు. వారితో ఇంగ్లిషులో మాట్లాడడం కాదు. తెలుగులో వారికి అర్థమయ్యేలా చెప్పాలి’..అని అధికారులను కలెక్టర్ ఆరోఖ్యరాజ్ సున్నితంగా మందలించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కె.జీవన్‌బాబుకు హితబోధ చేశారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కనిపించాలని, రికార్డుల్లో కాదని చెప్పారు.