Dial Your Collector
-
భూమి ఆన్‌లైన్‌కి లంచం అడుగుతున్నారు
ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్‌కుమార్ నిర్వహించారు. పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్‌ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్‌ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డయల్ యువర్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్చార్జి డీఆర్ఓ సరళా వందనం పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్
ఆగస్టు 1 నుంచి ప్రతి సోమవారం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2499 నెల్లూరు(పొగతోట): జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఆగస్ట్ 1 నుంచి ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం కోసం 1800 425 2499 టోల్‌ఫ్రీ నంబర్‌ను సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే డయల్ యువర్ ప్రోగ్రామ్‌కు ప్రజలు ఫోన్ చేయగానే కాల్సెంటర్లోని సిబ్బంది ముందుగా సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం ఫోన్‌ను కలెక్టర్‌కు లింక్ చేస్తారు. కలెక్టర్ స్వయంగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. ఈ సంభాషణ మొత్తాన్ని రికార్డు చేయనున్నారు. అనంతరం సమస్యలను శాఖల వారీగా విభజించి సంబంధిత జిల్లా అధికారులకు మెయిల్ ద్వారా పంపుతారు. ఫోన్లో తికమకగా సమాధానం చెప్పిన, సమస్యలను సక్రమంగా వివరించకపోయిన ఫోన్‌కట్ చేస్తారు. కలెక్టర్ గ్రీవెన్స్‌డేకు హాజరయ్యే అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఫోన్లో మాట్లాడతారు. భూ సమస్యలు, రేషన్‌కార్డులు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, పాఠశాలల్లో మౌళిక వసతులు, తదితర సమస్యలను కలెక్టర్‌కు విన్నవించవచ్చు. జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం భూములు, నివేశన స్థలాల హద్దుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మాజీ సైనికులు, నిరుపేదలకు కేటాయించిన భూములకు హద్దులు చూపకపోవడంతో సాగు చేసుకోలేకపోతున్నారు. చేతిలో పట్టాలు పెట్టుకుని భూములు చూపించండి అంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లబ్ధిదారులు భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తే వెంటనే హద్దులు చూపేలా అధికారులు చర్యలు చేపడుతారు. చౌకదుకాణాల డీలర్లు రేషన్ సక్రమంగా ఇవ్వకపోయిన డయల్ యువర్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చు. నిరుపేదలు నగదు ఖర్చు పెట్టుకుని, సమయం వథా చేసుకుని కలెక్టర్ కార్యాలయానికి రాకుండా గ్రామం నుంచే కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేయవచ్చు. -
‘డయల్ యువర్ కలెక్టర్’కు 17 ఫోన్‌కాల్స్
విశాఖ రూరల్: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 17 ఫోన్‌కాల్స్ వచ్చాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ వై.నరసింహారావు ఫోన్‌కాల్స్‌కు సమాధానమిచ్చారు. చింతపల్లి మండ లం తాజంగి గ్రామంలో వ్యవసాయశాఖకు చెందిన భూమి అన్యాక్రాంతమైందని, కొంతమంది వ్యక్తులు అక్రమంగా అనుభవిస్తున్నారని చింతపల్లి నుంచి ఒక ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. అనంతగిరిలో హరిత రిసార్ట్స్‌లో బార్ పెడుతున్నట్లు తెలిసిందని, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒకరు ఫోన్లో చెప్పగా పర్యాటక శాఖకు ఈ విషయం తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడు, డీఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
బిజీ బిజీ ...కలెక్టర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కూల్ కలెక్టర్‌ని, మీరు కూడా కూల్‌గా పనిచేయండి. అయితే విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించను. ఏది అత్యవసరమో దానిని వెంటనే పరిష్కరించండి. ప్రజలు మనపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి అవస్థలు పడి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారిని ఆదరించండి. సమస్యను శ్రద్ధతో వినండి. వెంటనే పరిష్కారం అవుతుందంటే దానిపై దృష్టి పెట్టండి. మిగిలిన సమస్యలకు సమయం తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయండి. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్.. కార్యక్రమాలపై ప్రజలకు నమ్మకాన్ని కల్గించేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి.’ అని అధికారులకు సూచించారు. ఆ తర్వాత ప్రజాదర్బార్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సుమారు రెండున్నర గంటల పాటు జనం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డితో చర్చించారు. సాయంత్రం తాగునీటి సమస్యపైనా, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపైనా అధికారులతో సమీక్షించారు. తొలి రోజు ఇలా ఉదయం 10.15 - కలెక్టరే ట్లో వినాయకునికి పూజలు 10.25 - జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ 10.35 - మీడియా, ప్రతికా ప్రతినిధులతో పరిచయ కార్యక్రమం 10.45 - అధికారులతో పరిచయ కార్యక్రమం. 11.15 - కలెక్టర్ చాంబర్లో జేసీ, ఇతర అధికారులతో సమీక్ష 11.30 నుంచి 2 గంటల వరకు- సునయనలో ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ సాయంత్రం 3 నుంచి 4.15 వరకు - స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమీక్ష 4.30 నుంచి 5.45 వరకు - తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు ఎవరైనా నేరుగా నన్ను కలవవొచ్చు. స్లిప్‌లు పంపి బయట నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా సిబ్బంది తలుపు తీసి లోపలికి పంపుతారు. ఈ విధానాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తాను. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలి. అధికారులు ప్రజల్ని తమ చుట్టూ తిప్పుకోరాదు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే వాటిని వెంటనే సూటిగా చెప్పాలి. సమస్యలతో వచ్చే వారిని ఆదరించాలి. జిల్లా అధికారైనా, మండల అధికారైనా సమన్వయంతో పనిచేయాలి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణే తన తొలి ప్రాధాన్యత అని కొత్త కలెక్టర్ విజయమోహన్ వెల్లడించారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, తాగునీటి సరఫరాకు కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు. సోమవారం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సాక్షి’తో మాట్లాడారు. జిల్లా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా అగ్రగామిగా ఉండేలా కృషి చేస్తామని వెల్లడించారు. సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఆదరించేలా.. అధికారుల పనితీరులో మార్పులు తీసుకొస్తానని అన్నారు. సాక్షి : కలెక్టర్‌గా మీ ప్రాధాన్యతలు ఏమిటి? కలెక్టర్ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం. జిల్లాలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అయితే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? వాటి సర్వే నంబర్లు ఏమిటి? విస్తీర్ణం ఎంత? వాటి అనుకూలతలు ఏంటి? అన్నది ఓ స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించి నివేదిక సిద్ధం చేస్తాం. ప్రణాళిక తయారు చేయడం వరకే కాకుండా కచ్చితంగా దాన్ని అమలు చేయడానికి కలెక్టర్‌గా మొదటి ప్రాధాన్యత ఇస్తాను. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహకారంతో జిల్లాలో మంచి ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేస్తాను. సాక్షి : జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది? కలెక్టర్ : నిజమే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఒకటి. 6 నెలల్లో ఈ పథకాన్ని జిల్లాలో 100 శాతం అమలు చేసి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలపేందుకు కృషి చేస్తాను. మరో వారంలో దీనికి సమగ్ర ప్రణాళిక ను సిద్ధం చేస్తాం. తాగునీటి సమస్య ఉన్న మండలాలను గుర్తించి, ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఒక మ్యాప్ తయారు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. సాక్షి: పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యానికి ఎలాంటి చర్యలు చేపడతారు? కలెక్టర్ : వైద్యానికి వెన్నుదైన పీహెచ్‌సీల్లో రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతాను. 104, 108 పనితీరు, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయా? నిపుణులైన వైద్యులు పనిచేస్తున్నారా? అన్న అంశాలను పరిశీలించి వాటిని గాడిన పెడతాను. ముఖ్యంగా పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. ప్రజలకు వైద్యసేవలు అందించాలి అన్న చైతన్యం వారిలో రావాలి. మొదట వారి బాధ్యతలు గుర్తెరిగేలా వివరిస్తాం. అప్పటికీ వినకపోతే.. చర్యలు ఉంటాయి. ఐసీడీఎస్‌ల పనితీరు ఎలా ఉందో పరిశీలిస్తాను. సాక్షి : సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారా? కలెక్టర్ : ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, వాటి ప్రయోజనాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ 18 గంటలు పనిచేస్తాను. అలాగే జిల్లాలో వారంలో ఐదు రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాను. పీహెచ్‌సీలు, హాస్టళ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెడతాను. హాస్టళ్లలో పిల్లలతో కలిసి భోజనం చేస్తాను. దీంతో ఆ విభాగాల్లో పనితీరు మెరుగవుతుంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తాగునీటి, మరుగుదొడ్లు తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. సాక్షి : పాఠశాలల పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తారా? కలెక్టర్ : ప్రాథమిక విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. గతంలోని కార్యక్రమాలను కొనసాగించి, మరికొన్ని కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సామ్యర్థాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తాను. ఇక గతంలో ఉన్న కలెక్టర్ చేపట్టిన మంచి పనులన్నీ కొనసాగిస్తాను. వాటితో పాటు కొత్తగా ఏయే పనులు చేపట్టాలన్న దానిపై రెండు మూడు వారాల్లో అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటాను. మూడు నెలల్లో పాలనను గాడిలో పెడుతాను. సాక్షి : శాంతి భద్రతలు.. ధరల నియంత్రణపై కామెంట్? కలెక్టర్ : ఎస్పీతో సంప్రదించి శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఈవ్‌టీజింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ ప్రభుత్వ ప్రాధాన్యత. ఇందుకోసం సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల సమన్వయంతో కృషి చేస్తాను. ముఖ్యంగా నిత్యావసరాలను నిల్వ చేసి, కృత్రిమ ధరల పెరుగుదలకు పాల్పడే వారిపై, నకిలీ విత్తన వ్యాపారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం. -
ఎరువుల అమ్మకాలపై విచారణ
విశాఖ రూరల్ : జిల్లాలో ఎరువుల అమ్మకాలపై నిఘా పెడతామని, తూకాలు సక్రమంగా లేని వాటిపై విచారణ జరిపిస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి మొత్తం 14 ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇందులో చోడవరం నుంచి వచ్చిన కాల్లో పసుపర్తి ఆదినారాయణ అండ్సన్స్ షాపులో తక్కువ తూకానికి ఎరువులు అమ్ముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా దీనిపై విచారణ చేస్తామన్నారు. విశాఖ మర్రిపాలెం నుంచి వచ్చిన కాల్లో గ్రూప్-4లో పీహెచ్సీ కోటా కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నామని, కాని ఉద్యోగం రాలేదని, ఇంకోసారి పరిశీలించాలని కోరారు. కశింకోటలో మద్రాసు సిమెంట్ ఫ్యాక్టరీవారి పొలాలకు నీరుపారే కాలువగట్టును ఆక్రమించుకొని రోడ్డు వేయ డం వల్ల కాలువ వెడల్పు తగ్గిపోయిందని, రైతులకు ఇబ్బంది కలుగుతుందని, చర్యలు తీసుకోవాలని కోరగా పరిశీలిస్తామని జేసీ చెప్పారు. తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన తదితర సమస్యలపై ఫోన్‌కాల్స్ వచ్చా యి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి 127 దరఖాస్తులు కలెక్టరేట్ సమావేశ మంది రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో వెంకటేశ్వరరావు స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గృహాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, భూ వివాదాలు, భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ వై.నరసింహారావు, వికలాంగ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నర్సింహమూర్తి వికలాంగుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. -
నేటి నుంచి యథావిధిగా ‘డయల్ యువర్ కలెక్టర్’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు సోమవారం నుంచి యథావిధిగా నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల సమయం కావడంతో జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించలేకపోయింది. అయితే ఈనెల 2వ తేదీ నుంచి డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్లు యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామని, ఫోన్ ద్వారా నేరుగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. 08518-277100 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే కలెక్టర్ వెంటనే స్పందిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజాదర్బార్ కూడా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ప్రజాదర్బార్‌ను మరిచారు!
కర్నూలు(అగ్రికల్చర్),న్యూస్‌లైన్ : జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అధికారులు విస్మరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు ముందు ప్రతి సోమవారమూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండేవారు. అయితే ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు అవి నిలిచిపోయాయి. డయల్ యువర్‌కలెక్టర్ ప్రారంభం కాకపోయినా సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తిరిగి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు అదనపు జేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. కొన్ని శాఖల నుంచి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కలెక్టర్ తదితరులు ప్రజల నుంచి వినతులు తీసుకుని ఎండార్స్మెంట్ రాసి ఫలానా అధికారిని కలువాలని సూచించి పంపారు. -
ఇక ప్రజా‘వాణి’ విందాం
- అధికారులకు కలెక్టర్ ఆదేశాలు - నేటి నుంచి వారం వారం విజ్ఞప్తుల స్వీకరణ - రెండు నెలల అనంతరం తిరిగి ప్రారంభం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల పాటు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతి సోమవారం నిర్వహించనున్నారు. దీంతోపాటు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కూడా యథాతథంగా కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రకటించారు. జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ,సార్వత్రిక ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రతి వారం కలెక్టరేట్‌తో పాటు ఆయా డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు రెండు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో ప్రతి వారం అర్జిదారుల రాకతో నిండిపోయే కలెక్టరేట్.. ఎన్నికల సమీక్షలతో అధికారులతో నిండిపోయింది. మూడు ఎన్నికలు ఏకకాలంలో రావడంతో జిల్లాలో దాదాపు అన్ని శాఖల అధికారులు విధుల్లో పాల్గొన్నారు. ప్రజావాణి సిబ్బందికి సైతం ఎన్నికల విధులు అప్పగించారు. పేరుకుపోయిన సమస్యలు ప్రజావాణి ఉన్న రోజుల్లో ప్రజలు చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశముండేది. పింఛన్లు, కాలనీల్లో నెలకొన్న సమస్యలు మొదలైన వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. కార్యక్రమం రెండు నెలలుగా వాయిదా పడడంతో భూవివాదాలు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు తదితర సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. -డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 0878-2262301కు ఫోన్ చేసి కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకోవచ్చు. - ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. -
డయల్ యువర్ కలెక్టర్‌కు 29 కాల్స్
ప్రజలకు తెలుగులోనే సమాధానాలివ్వడం ఇంగ్లీష్‌లో చెబితే సామాన్యులకెలా అర్ధమవుతుంది అధికారులను సున్నితంగా మందలించిన కలెక్టర్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్‌కు 29 ఫోన్ కాల్స్ వచ్చాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదని పరవాడ నుంచి వచ్చిన ఫిర్యాదు రాగా ఆర్డీఓ పరిశీలించి తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ృ కార్యక్రమం నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే సమాచారం లేదని నాతవరం నుంచి ఒక ఫిర్యాదు చేయగా, బీసీ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ నిధులు రాగానే సమాచారమిస్తామని చెప్పారు. ఎస్.రాయవరం మండలంలో రాత్రి పూట అక్రమంగా ఇసుక రావాణా జరుగుతోందని ఫోన్‌రాగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదని మూడు ఫోన్ కాల్స్ రాగా డీఆర్వో స్పందిస్తూ వారం రోజులలోగా వెబ్సైట్లో పెడతామన్నారు. హుకుంపేట మండలం నుంచి ఒకరు ఫోన్ చేసి ఎంపీపీ స్కూల్లో సుమారు 170 మంది వరకు విద్యార్థులున్నారని, నెల రోజుల నుంచి ఉన్న ఒక్క టీచర్ కూడా రావడం లేదని చెప్పగా, కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసి, వేరొక టీచర్‌ను నియమించాలని డీఈఓను ఆదేశించారు. వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని చోడవరం మండలం నుంచి ఫోన్ రాగా ఆర్డీఓ వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి 105 దరఖాస్తులు : జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావులకు విన్నవించుకున్నారు. గృహాలు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయి. వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ వై. నరసింహారావు, వికలాంగ సంక్షేమ శాఖ ఏడీ నర్సింహమూర్తి వికలాంగుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. తెలుగు పలకరే..! ‘ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నేనే తెలుగు నేర్చుకున్నాను. తెలుగులో మాట్లాడుతున్నా. మీరు తెలుగులో సమాధానాలు చెప్పలేరా?. తమ సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజలు వస్తుంటారు. వారితో ఇంగ్లిషులో మాట్లాడడం కాదు. తెలుగులో వారికి అర్థమయ్యేలా చెప్పాలి’..అని అధికారులను కలెక్టర్ ఆరోఖ్యరాజ్ సున్నితంగా మందలించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కె.జీవన్‌బాబుకు హితబోధ చేశారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కనిపించాలని, రికార్డుల్లో కాదని చెప్పారు. -
పాపం బాధరాజు!
=అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు =డయల్ యువర్ కలెక్టర్‌కు ఫోన్ =రచ్చబండకు అధికారులను పంపిన కలెక్టర్ విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి తనను పట్టించుకోలేదంటూ బహిరంగంగా బాధ పడుతున్న మంత్రి బాలరాజుకు మరో కష్టం వచ్చింది. ఇప్పుడు తనను అధికారులూ పట్టించుకోవడం లేదంటూ సాక్షాత్తూ కలెక్టరుకే మొరపెట్టుకోవలసిన దుస్థితి దాపురించింది. ప్రజలు తమ సమస్యలు మంత్రులకు చెప్పుకోవడం సాధారణమే.. రాష్ట్ర మంత్రే తన దుస్థితిని కలెక్టర్‌కు ఫోన్లో చెప్పుకుంటే? ఇప్పుడు బాలరాజు అలాగే చె ప్పుకోవలసి వచ్చింది. మంత్రి హోదాలో తాను నిర్వహిస్తున్న రచ్చబండకు జిల్లా అధికారులు రావడం లేదని సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఒక పౌరుడిలా ల్యాండ్ ఫోన్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయడం తన పరిస్థితికి దర్పణం పడుతోంది. అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లాలోని కాంగ్రెస్ వర్గ రాజకీయాల నేపథ్యంలో మంత్రి బాలరాజుకు కొంతకాలంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో విబేధాలేర్పడ్డాయి. ఈ వ్యవహారం బహిరంగ రహస్యం కావడంతో జిల్లా అధికారులు సైతం మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చినంత ప్రాధాన్యత బాలరాజుకు ఇవ్వడం లేదు. దీనిపై బాలరాజు అనేక సార్లు అధికారులపై బహిరంగంగానే తన అసంతృప్తి వె ళ్లగక్కారు. ఇటీవల చోడవరంలో నిర్వహించిన రచ్చబండ సభలో తన శాఖ అంశాలున్నా సీఎం కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం అందలేదని బాలరాజు బహిరంగ విమర్శలు చేశారు. సీఎం డెరైక్షన్ మేరకే జిల్లా అధికారులు సైతం తనను పెద్దగా లెక్కచేయలేదని ఆయన లోలోన మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలరాజు తన నియోజకవర్గం పాడేరులో నిర్వహిస్తున్న రచ్చబండ సభలకు జిల్లాస్థాయి అధికారులెవరూ హాజరు కావడం లేదనే ప్రచారం జరుగుతోంది. సోమవారం కొయ్యూరు మండలం రేవళ్ల పంచాయతీలో రచ్చబండ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సంబంధిత జిల్లా అధికారులందరికీ సమాచారం పంపించారు. ఉదయం ఆయన రచ్చబండ సభకు వెళ్లేటప్పటికి తాను పిలిచిన అధికారులు లేకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మొబైల్‌కు ఫోన్ చేశారు. అప్పటికే ఆయన ప్రజాసమస్యలు వినేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఉండటంతో మొబైల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మంత్రి బాలరాజు ల్యాండ్ ఫోన్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేశారు. కలెక్టర్ హలో అనగానే అవతలి నుంచి ‘ కలెక్టర్ గారూ నేను మంత్రి బాలరాజును మాట్లాడుతున్నాను’ అనే మాట వినగానే కలెక్టర్ ఆశ్చర్య పోయారు. తాను నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కాలేదని, తాను ముందుగా సమాచారం అందించినా రాక పోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలని బాలరాజు ఆవేదన చెందారు. అధికారులు తనను కావాలని అవమానిస్తున్నట్లుందని మంత్రి నిష్టూరపోవడంతో కలెక్టర్ కలుగచేసుకుని అలాంటిదేమీ లేదని వెంటనే జిల్లా అధికారులను పంపుతానని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కోరిన జిల్లా అధికారులను రచ్చబండ సభకు పంపారు. స్వయానా మంత్రే కలెక్టర్‌కు ఫోన్ చేసి అధికారులు తన మాట వినడం లేదని చెప్పుకోవడం అధికార వర్గాల్లోను, రాజకీయ పార్టీల్లోను చర్చనీయాంశమైంది. కొందరైతే పాపం బాలరాజు అని జోకులేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందువల్లే ముఖ్యమైన జిల్లా అధికారులు ఉండిపోయారనీ, మంత్రి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వారిని రచ్చబండకు పంపానని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ‘సాక్షి ప్రతినిధికి’ చెప్పారు.