బిజీ బిజీ ...కలెక్టర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కూల్ కలెక్టర్‌ని, మీరు కూడా కూల్‌గా పనిచేయండి. అయితే విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించను. ఏది అత్యవసరమో దానిని వెంటనే పరిష్కరించండి. ప్రజలు మనపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి అవస్థలు పడి ఇక్కడికి వస్తుంటారు.
అలాంటి వారిని ఆదరించండి. సమస్యను శ్రద్ధతో వినండి. వెంటనే పరిష్కారం అవుతుందంటే దానిపై దృష్టి పెట్టండి. మిగిలిన సమస్యలకు సమయం తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయండి. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్.. కార్యక్రమాలపై ప్రజలకు నమ్మకాన్ని కల్గించేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి.’ అని అధికారులకు సూచించారు.
ఆ తర్వాత ప్రజాదర్బార్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సుమారు రెండున్నర గంటల పాటు జనం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డితో చర్చించారు. సాయంత్రం తాగునీటి సమస్యపైనా, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపైనా అధికారులతో సమీక్షించారు.
తొలి రోజు ఇలా
ఉదయం 10.15 - కలెక్టరే ట్‌లో వినాయకునికి పూజలు
10.25 - జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
10.35 - మీడియా, ప్రతికా ప్రతినిధులతో పరిచయ కార్యక్రమం
10.45 - అధికారులతో పరిచయ కార్యక్రమం.
11.15 - కలెక్టర్ చాంబర్‌లో జేసీ, ఇతర అధికారులతో సమీక్ష
11.30 నుంచి 2 గంటల వరకు- సునయనలో ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ
సాయంత్రం 3 నుంచి 4.15 వరకు - స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమీక్ష
4.30 నుంచి 5.45 వరకు - తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష
సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు ఎవరైనా నేరుగా నన్ను కలవవొచ్చు. స్లిప్‌లు పంపి బయట నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా సిబ్బంది తలుపు తీసి లోపలికి పంపుతారు. ఈ విధానాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తాను. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలి. అధికారులు ప్రజల్ని తమ చుట్టూ తిప్పుకోరాదు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే వాటిని వెంటనే సూటిగా చెప్పాలి. సమస్యలతో వచ్చే వారిని ఆదరించాలి. జిల్లా అధికారైనా, మండల అధికారైనా సమన్వయంతో పనిచేయాలి.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణే తన తొలి ప్రాధాన్యత అని కొత్త కలెక్టర్ విజయమోహన్ వెల్లడించారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, తాగునీటి సరఫరాకు కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు. సోమవారం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సాక్షి’తో మాట్లాడారు. జిల్లా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా అగ్రగామిగా ఉండేలా కృషి చేస్తామని వెల్లడించారు. సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఆదరించేలా.. అధికారుల పనితీరులో మార్పులు తీసుకొస్తానని అన్నారు.
సాక్షి : కలెక్టర్‌గా మీ ప్రాధాన్యతలు ఏమిటి?
కలెక్టర్ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం. జిల్లాలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అయితే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? వాటి సర్వే నంబర్లు ఏమిటి? విస్తీర్ణం ఎంత? వాటి అనుకూలతలు ఏంటి? అన్నది ఓ స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించి నివేదిక సిద్ధం చేస్తాం. ప్రణాళిక తయారు చేయడం వరకే కాకుండా కచ్చితంగా దాన్ని అమలు చేయడానికి కలెక్టర్‌గా మొదటి ప్రాధాన్యత ఇస్తాను. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహకారంతో జిల్లాలో మంచి ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేస్తాను.
సాక్షి : జిల్లాలో అనేక గ్రామాల్లో
తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది?
కలెక్టర్ : నిజమే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఒకటి. 6 నెలల్లో ఈ పథకాన్ని జిల్లాలో 100 శాతం అమలు చేసి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలపేందుకు కృషి చేస్తాను. మరో వారంలో దీనికి సమగ్ర ప్రణాళిక ను సిద్ధం చేస్తాం. తాగునీటి సమస్య ఉన్న మండలాలను గుర్తించి, ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఒక మ్యాప్ తయారు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
సాక్షి: పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యానికి
ఎలాంటి చర్యలు చేపడతారు?
కలెక్టర్ : వైద్యానికి వెన్నుదైన పీహెచ్‌సీల్లో రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతాను. 104, 108 పనితీరు, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయా? నిపుణులైన వైద్యులు పనిచేస్తున్నారా? అన్న అంశాలను పరిశీలించి వాటిని గాడిన పెడతాను. ముఖ్యంగా పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. ప్రజలకు వైద్యసేవలు అందించాలి అన్న చైతన్యం వారిలో రావాలి. మొదట వారి బాధ్యతలు గుర్తెరిగేలా వివరిస్తాం. అప్పటికీ వినకపోతే.. చర్యలు ఉంటాయి. ఐసీడీఎస్‌ల పనితీరు ఎలా ఉందో పరిశీలిస్తాను.
సాక్షి : సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో
పర్యటిస్తారా?
కలెక్టర్ : ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, వాటి ప్రయోజనాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ 18 గంటలు పనిచేస్తాను. అలాగే జిల్లాలో వారంలో ఐదు రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాను. పీహెచ్‌సీలు, హాస్టళ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెడతాను. హాస్టళ్లలో పిల్లలతో కలిసి భోజనం చేస్తాను. దీంతో ఆ విభాగాల్లో పనితీరు మెరుగవుతుంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తాగునీటి, మరుగుదొడ్లు తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.
సాక్షి : పాఠశాలల పరిస్థితుల్లో మార్పులు
తీసుకొస్తారా?
కలెక్టర్ : ప్రాథమిక విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. గతంలోని కార్యక్రమాలను కొనసాగించి, మరికొన్ని కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సామ్యర్థాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తాను. ఇక గతంలో ఉన్న కలెక్టర్ చేపట్టిన మంచి పనులన్నీ కొనసాగిస్తాను. వాటితో పాటు కొత్తగా ఏయే పనులు చేపట్టాలన్న దానిపై రెండు మూడు వారాల్లో అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటాను. మూడు నెలల్లో పాలనను గాడిలో పెడుతాను.
సాక్షి : శాంతి భద్రతలు..
ధరల నియంత్రణపై కామెంట్?
కలెక్టర్ : ఎస్పీతో సంప్రదించి శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఈవ్‌టీజింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ ప్రభుత్వ ప్రాధాన్యత. ఇందుకోసం సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల సమన్వయంతో కృషి చేస్తాను. ముఖ్యంగా నిత్యావసరాలను నిల్వ చేసి, కృత్రిమ ధరల పెరుగుదలకు పాల్పడే వారిపై, నకిలీ విత్తన వ్యాపారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.