ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘భారత సైన్యంలో పనిచేసినందుకు ప్రభుత్వం నాకు భూమి ఇచ్చింది. సాగు చేసుకునేందుకు ఆ భూమిలోకి వెళ్తే ప్రభుత్వ మాజీ ఉద్యోగి ఒకరు తనదంటున్నాడు. అదేంటని అడిగితే రెవెన్యూ అధికారులు ఇచ్చారంటూ నకిలీ ఆధారాలు చూపిస్తున్నాడు. నాకు ఇచ్చిన భూమి వివరాలు తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే వారినుంచి సమాధానం లేదు. నా భూమిని నాకు ఇప్పించండి’ అంటూ త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కొమ్ముల ప్రకాశరావు కలెక్టర్ విజయకుమార్‌ను వేడుకున్నారు. స్థానిక ప్రకాశం భవన్ ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. 1986లో వెల్లంపల్లిలో ప్రభుత్వం తనకు 2.52 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఆ భూమిని ఓ మాజీ ఉద్యోగికి రెవెన్యూ అధికారులు కట్టబెట్టారన్నారు. న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.
రచ్చబండలో రేషన్‌కార్డులు రాలేదు...
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డులు రాలేదని సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని క్రాంతినగర్‌కు చెందిన పలువురు మత్స్యకారులు వాపోయారు. రెండు విడతలు జరిగిన రచ్చబండలో అర్జీలిస్తే రేషన్‌కార్డులు ఇవ్వలేదన్నారు. దానివల్ల అనేక పథకాలకు దూరమవుతున్నామని, కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రమోషన్ ఇవ్వడం లేదు...
ఇరవైనాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న తనకు ప్రమోషన్ ఇవ్వడంలేదని చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ రికార్డు అసిస్టెంట్ జీవీఎస్ ప్రసాదరావు వాపోయారు. న్యాయం కోసం గత ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజాదర్బార్‌లో అర్జీ ఇస్తున్నట్లు చెప్పారు.
మంచినీరు సరఫరా చేయాలి...
ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టలో సర్వే నంబర్ 80లో నివసిస్తున్న తమకు మంచినీరు సరఫరా చేయాలని సుమారు 250 కుటుంబాల వారు కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. అక్కడుంటున్న వారందరికీ వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మిని ఆదేశించారు.
1/బీ అడంగల్‌లో పేరు చేర్చడం లేదు...
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని 1/బీ అడంగల్‌లో చేర్చకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన పాటిబండ్ల చంద్రమౌలి వాపోయాడు. సర్వే నంబర్ 193లో 3.50 ఎకరాల భూమిలో తన వాటా భూమి పంపకం జరిగిందని, కానీ, తహసీల్దార్ కార్యాలయంలో 1/బీ అడంగల్‌లో పేర్చు మార్చడం లేదని ఫిర్యాదు చేశాడు.
హమాలీ కూలి రేట్లు పెంచాలి...
హమాలీ కూలి రేట్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ హమాలీల యూనియన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ మజుందార్ కోరారు. హమాలీ కూలి రేట్లు 6 నుంచి 16 రూపాయలకు పెంచాలని, ఎఫ్‌సీఐలో అమలవుతున్న విధంగా డీపీఎస్ పద్ధతి వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
బ్యాంకు లింకేజీ మినహాయింపు ఇవ్వాలి
బీసీ ఫెడరేషన్ సొసైటీలకు సంబంధించి లబ్ధిదారుల వయో పరిమితి, బ్యాంకు లింకేజీల్లో మినహాయింపు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. 15 మంది సభ్యులు కలిగిన ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు పెంచాలన్నారు.
హెచ్చరిక బోర్డు తొలగించి సాగు చేస్తున్నారు..
కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి మరీ సాగుచేస్తున్నారని ఐదుగురు వీఆర్వోలు కలెక్టర్ ఎదుట వాపోయారు. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో తమకు 5 సెంట్ల చొప్పున భూమి కేటాయించారన్నారు. నీటివసతి లేకపోవడంతో ఆ భూమిని రైతులకు లీజుకిస్తే కొంతమంది ఆక్రమించుకున్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ తొలగించి మరీ సాగు చేస్తున్నారని వివరించారు.
తాతల పేరు చెప్పుకుని పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారు..
టంగుటూరు మండలం వెలగపూడిలోని ప్రభుత్వ భూమికి తాతల పేర్లు చెప్పుకుని అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారని అనంతవరం సర్పంచ్ కే సుందరరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 33/5లో 9.46 ఎకరాల ప్రభుత్వ భూమికి గ్రామానికి చెందిన కసుకుర్తి బాలకోటయ్య, విజయవాడకు చెందిన కాజా ఉమాదేవి పాస్ పుస్తకాలు పొందారన్నారు.1402 నుంచి 1421 పసలీల వరకు వారి ముత్తాతలు, తండ్రుల పేర్లు అడంగల్‌లో లేవన్నారు.
నా భూమిని కాజేశారు
Published Tue, Jan 7 2014 3:27 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement