ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్‌లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్‌కుమార్ నిర్వహించారు.
- పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్‌లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్‌ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
- టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్‌ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు.
- కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్‌ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
డయల్ యువర్‌లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళా వందనం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment