=అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు
=డయల్ యువర్ కలెక్టర్‌కు ఫోన్
=రచ్చబండకు అధికారులను పంపిన కలెక్టర్
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి తనను పట్టించుకోలేదంటూ బహిరంగంగా బాధ పడుతున్న మంత్రి బాలరాజుకు మరో కష్టం వచ్చింది. ఇప్పుడు తనను అధికారులూ పట్టించుకోవడం లేదంటూ సాక్షాత్తూ కలెక్టరుకే మొరపెట్టుకోవలసిన దుస్థితి దాపురించింది. ప్రజలు తమ సమస్యలు మంత్రులకు చెప్పుకోవడం సాధారణమే.. రాష్ట్ర మంత్రే తన దుస్థితిని కలెక్టర్‌కు ఫోన్‌లో చెప్పుకుంటే? ఇప్పుడు బాలరాజు అలాగే చె ప్పుకోవలసి వచ్చింది.
మంత్రి హోదాలో తాను నిర్వహిస్తున్న రచ్చబండకు జిల్లా అధికారులు రావడం లేదని సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఒక పౌరుడిలా ల్యాండ్ ఫోన్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయడం తన పరిస్థితికి దర్పణం పడుతోంది. అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లాలోని కాంగ్రెస్ వర్గ రాజకీయాల నేపథ్యంలో మంత్రి బాలరాజుకు కొంతకాలంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో విబేధాలేర్పడ్డాయి.
ఈ వ్యవహారం బహిరంగ రహస్యం కావడంతో జిల్లా అధికారులు సైతం మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చినంత ప్రాధాన్యత బాలరాజుకు ఇవ్వడం లేదు. దీనిపై బాలరాజు అనేక సార్లు అధికారులపై బహిరంగంగానే తన అసంతృప్తి వె ళ్లగక్కారు. ఇటీవల చోడవరంలో నిర్వహించిన రచ్చబండ సభలో తన శాఖ అంశాలున్నా సీఎం కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం అందలేదని బాలరాజు బహిరంగ విమర్శలు చేశారు. సీఎం డెరైక్షన్ మేరకే జిల్లా అధికారులు సైతం తనను పెద్దగా లెక్కచేయలేదని ఆయన లోలోన మధన పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి బాలరాజు తన నియోజకవర్గం పాడేరులో నిర్వహిస్తున్న రచ్చబండ సభలకు జిల్లాస్థాయి అధికారులెవరూ హాజరు కావడం లేదనే ప్రచారం జరుగుతోంది. సోమవారం కొయ్యూరు మండలం రేవళ్ల పంచాయతీలో రచ్చబండ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సంబంధిత జిల్లా అధికారులందరికీ సమాచారం పంపించారు. ఉదయం ఆయన రచ్చబండ సభకు వెళ్లేటప్పటికి తాను పిలిచిన అధికారులు లేకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మొబైల్‌కు ఫోన్ చేశారు. అప్పటికే ఆయన ప్రజాసమస్యలు వినేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఉండటంతో మొబైల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మంత్రి బాలరాజు ల్యాండ్ ఫోన్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేశారు. కలెక్టర్ హలో అనగానే అవతలి నుంచి ‘ కలెక్టర్ గారూ నేను మంత్రి బాలరాజును మాట్లాడుతున్నాను’ అనే మాట వినగానే కలెక్టర్ ఆశ్చర్య పోయారు. తాను నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కాలేదని, తాను ముందుగా సమాచారం అందించినా రాక పోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలని బాలరాజు ఆవేదన చెందారు.
అధికారులు తనను కావాలని అవమానిస్తున్నట్లుందని మంత్రి నిష్టూరపోవడంతో కలెక్టర్ కలుగచేసుకుని అలాంటిదేమీ లేదని వెంటనే జిల్లా అధికారులను పంపుతానని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కోరిన జిల్లా అధికారులను రచ్చబండ సభకు పంపారు. స్వయానా మంత్రే కలెక్టర్‌కు ఫోన్ చేసి అధికారులు తన మాట వినడం లేదని చెప్పుకోవడం అధికార వర్గాల్లోను, రాజకీయ పార్టీల్లోను చర్చనీయాంశమైంది. కొందరైతే పాపం బాలరాజు అని జోకులేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందువల్లే ముఖ్యమైన జిల్లా అధికారులు ఉండిపోయారనీ, మంత్రి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వారిని రచ్చబండకు పంపానని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ‘సాక్షి ప్రతినిధికి’ చెప్పారు.
పాపం బాధరాజు!
Published Tue, Nov 26 2013 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement