గుంతకల్లు, న్యూస్‌లైన్:‘రైతుల పట్ల మీరు చూపించిన అభిమానం, శ్రద్ధ వల్లే హంద్రీ నీవా కాలువ నుంచి తమ చెరువులకు కృష్ణా జలాలు చేరాయని వైటీ చెరువు, పాత కొత్తచెరువు గ్రామాల రైతులు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డిని అభినందించారు. మంగళవారం దాదాపు 200 మంది రైతులు తరలి వచ్చి ఆయన స్వగృహంలో కలిశారు. హంద్రీ నీవా కాలువ నుంచి జలాలు పాత కొత్తచెరువు, వైటీ చెరువు, గుత్తి చెరువులకు నీరు చేరాలంటే కసాపురం గ్రామ రైతుల పట్టా భూముల మీదుగా పారాల్సి ఉంటుంది.
దీంతో వారు తమ పొలాల మీదుగా నీటిని మళ్లిస్తున్నందున తీవ్రంగా నష్ట పోతున్నామని, నీటిని వదలరాదంటూ అభ్యంతర పెట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా వెళ్లి నీటి విడుదలకు సహకరించాల్సిందిగా సదరు రైతులను అభ్యర్థించారు. తమకు గత ఏడాది ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇప్పిస్తామని చెప్పినా, ఇంతవరకు మంజూరు చేయించలేదని, ఇపుడు ఎలా అడుగుతారని నిర్ద్వందంగా తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో వైవీఆర్ చొరవ తీసుకుని కసాపురం రైతులను ఒప్పించారు. తద్వారా పాత కొత్తచెరువు కింద 1,600 ఎకరాలు, వైటీ చెరువు కింద 900 ఎకరాలు మేరకు సాగుకు అవకాశం ఏర్పడింది. ఇదంతా మీ చలువ వల్లనే సాధ్యమైందంటూ వైవీఆర్‌ను రైతులు కొనియాడారు. ఈ రెండు చెరువుల కింద వందల సంఖ్యలో చేపలు పట్టి జీవనాన్ని గడిపే బెస్త వారు కూడా ఉన్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఇదే విధంగా సహాయ, సహకారాలు అందించాలని రైతులు వైవీఆర్ కోరారు.