బహుదూరపు బాటసారి అమెరికాయానం... | Ys jagan America Trip Preparations Were In Full Swing In Dallas | Sakshi
Sakshi News home page

బహుదూరపు బాటసారి అమెరికాయానం...

Published Sun, Aug 11 2019 1:35 PM | Last Updated on Sun, Aug 11 2019 1:48 PM

Ys jagan America Trip Preparations Were In Full Swing In Dallas - Sakshi

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికా పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆగస్ట్‌ 17న డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైనా, ప్రభుత్వ కార్యక్రమం కాకున్నా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్) లో ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

చదవండిప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

ఇక తండ్రి మరణంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం చేయాలనుకొన్న ఆ ఒక్క ‘ఓదార్పు’ మాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, కోరి కష్టాలను కౌగిలించుకుని, సమస్యల వలయంలో, కుట్ర కుతంత్రాలను అధిగమించిన పోరాట పటిమకు ప్రతిరూపమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ రంగంలోకి ప్రవేశించి పదేళ్లు అయింది. ఈ పదేళ్ల ఆయన ప్రస్థానం, మరో వందేళ్ల వరకు పాఠాలు చెబుతుంది. ఈ పదేళ్లలో వైఎస్‌ జగన్‌ తనను తాను మలుచుకున్న తీరు, ఒక సమర్థమైన నాయకుడిగా ఎదిగిన విధానం యువతకు ఎంతో మార్గదర్శకం.

చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా, చివరకు ప్రాణం మీదకు వచ్చినా, మాట తప్పని తీరునూ, మడమతిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. రాజకుమారుడిలాగా జీవించే అవకాశాలున్నా తృణప్రాయంగా కాలదన్ని కష్టాల కొలిమిలో తనను తాను కాల్చుకున్నారు. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలారు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ, వాళ్ల బాధలు, గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారబోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హృదయాల్లో ఆయన నిర్మించుకున్నారు. ఆయన పదేళ్ల కఠోర శ్రమకు, ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ఒక గొప్ప తపస్సుకు ప్రజలు ప్రసాదించిన వరమే ఈ విజయం. అందుకే ఈ విజయం అత్యంత విలువైనది. ఈ విజయం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ విజయం ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

ఆయన చిత్తశుద్ధి ప్రజల మనసులని సూటిగా హత్తుకుంది. ప్రతి దీవెనా స్వాతి చినుకులా కురిసి, ఓటుగా ప్రతిఫలించింది. జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా రాష్ట్ర ప్రజల సమస్యలు చూశారు. వారి దుఃఖం చూశారు. విలయ తాండవం చేస్తున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లారా చూశారు. పాలకుల ఎద్దేవాలు, ఎగతాళి కూతలు, నిందలు, నిరాధార ఆరోపణలు, హత్యా ప్రయత్నాలు, కుటిల యత్నాలు ఇలాంటివి ఎన్నో మరెన్నో మదిలో దిగమింగుకొని, రాష్ట్రం సరిహద్దుల్లో ఒక కొసనించి అటు కొసదాకా నడిచి ప్రజానీకానికి చిరునవ్వుతో అభయం ఇస్తూ ముందుకు సాగారు. 

23 మంది పార్టీని వీడితే మే 23న తిరిగి ఆ 23మందిని మిగిల్చి... మిగతా అన్ని సీట్లు గెలిచి , తెలుగు రాష్ట్రాల్లో కనీ వినీ ఎరగని రీతిలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటి రోజు నుంచే ఆ ప్రమాణ స్వీకారానికి ఉన్న ప్రమాణాలు పెంచి, తన బహుదూరపు పాదయాత్రలో చూసిన, విన్న సాధక సమస్యల పరిష్కారానికై ఆవిష్కరించిన నవరత్నాల అమలులో నిరంతరం పాటుపడుతున్నారు. అలాంటి ఘనవిజయం వెనుక ప్రవాసాంధ్రుల కృషి ఎంతో ఉంది. పగలంతా కార్యాలయాల్లో పని , రాత్రివేళ (ఇండియాలో పగలు) తన బంధుమిత్రులతో మాట్లాడి, పార్టీ విజయానికి తోడ్పడాలని కోరి, తమ వంతు సహాయం చేశారు. ఎంతోమంది ఎన్నికల సమయంలో పని మానుకొని ఏపీలో ఎన్‌ఆర్‌ఐ బస్సు బస్ యాత్ర, ఎన్నారై ఎన్నికల ప్రచారం వంటి వినూత్న మైన పద్ధతులలో ప్రచారం చేసి విజయంలో భాగస్వామిలైనారు.

అభివృద్ధిలో గానీ, మనలాంటి రాష్ట్రాలను ఆదుకోవడంలో గానీ మనకు ఆసరాగా ఉంటున్న అమెరికా దేశానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా విచ్చేస్తున్నారు. మతం, కులం, పార్టీ బేధాలు లేకుండా అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఉన్న వేలకు వేల తెలుగు వారు, తెలుగు సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైనా, ప్రభుత్వ కార్యక్రమం కాకున్నా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ఆగష్టు 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్) లో ప్రసంగించనున్నారు. 

ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. కే బెయిలీ హచీసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ సెక్యూరిటీ అధికారి జోనాథన్‌ చెప్పిన ప్రకారం ‘జాన్‌ యఫ్‌ కెన్నడీ’  అమెరికా అధ్యక్షుడివగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచార సభ ఇదే స్టేడియంలో జరిగింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జరగబోయే పొలిటికల్‌ ఈవెంట్‌ ఇదే కావడం గమనార్హం. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభ విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రికి తెలుగు కమ్యూనిటీ నార్త్‌ అమెరికా సాదర స్వాగతం పలుకుతోంది. అలాగే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నందున అమెరికాలో తెలుగు వారి కోసం పనిచేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీసీఎన్ఏ పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement