
మంచి రోజులు రావాలి
సాక్షి, కడప : పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్ష చేస్తున్నారు. అలా్‌లహ అందరినీ చల్లంగా చూడాలి. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం.. అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కడప నగరంలోని అమీన్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే అంజాద్‌బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంతకు ముందు కడపకు చేరుకున్న జననేతకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చుతూ పూలతో కడపకు ఆహ్వానించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కడప కార్పొరేటర్లు మర్యాద పూర్వకంగా వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు. ప్రతిపక్ష నేత కూడా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ పనిచేయాలని సూచించారు. అనంతరం వైఎస్ జగన్ కొద్దిసేపు ప్రజలతో సమస్యలు తెలుసుకుంటూ మమేకమయ్యారు.
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
కడప ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ అధ్యక్షుడు అంజాద్‌బాష ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి నేరుగా పెద్దదర్గా చేరుకుని అక్కడ ప్రార్థనలు నిర్వహించి ఆ తర్వాత అమీన్ ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ రంజాన్ మాసం విశిష్టతను వివరిస్తూ ముస్లింలకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యేలు అంజద్‌బాష, చాంద్‌బాషలు వైఎస్ జగన్‌కు పండ్లు తినిపించారు. వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ముస్లిం నాయకుడు ముక్తియార్, కడప నాయకులు పాల్గొన్నారు.
బ్రహ్మరథం పట్టిన ముస్లిం సోదరులు
ఇఫ్తార్ విందు ముగించుకున్న తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇడుపులపాయకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ప్రతిపక్ష నేతను కలిసేందుకు ముస్లిం సోదరులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఏ ఒక్కరినీ నిరుత్సాహానికి గురి చేయకుండా అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. వాహనం వద్దకు భారీగా వచ్చిన ముస్లిం మైనార్టీలు దాదాపు ఫంక్షన్ హాలునుంచి కిలోమీటరు దూరం మేర జగన్ కాన్వాయ్ వెంట నడిచారు. ముస్లింలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కడపలో ప్రతిపక్ష నేత పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ కనిపించిన ప్రతిచోట అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జగన్నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు.