ఇంత నిర్లక్ష్యమా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
కొత్తచెరువు/ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్: గత 16 నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరిగాయని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి విమర్శించారు. ప్రభుత్వాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 26 మంది సజీవ దహనమైన విషయం తెలుసుకున్న జగన్... చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రను వాయిదా వేసుకుని రైలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌లో ఉంచిన కాలిపోయిన బోగీని పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘ 2012 మే 22న ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండలో రైలు ప్రమాదం జరిగింది. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 30 మంది వరకు మృతి చెందారు. 16 నెలల వ్యవధిలో ఇది (నాందేడ్ రైలు) మూడో ప్రమాదం. ఎప్పుడు ప్రమాదం జరిగినా కనీసం 30 నుంచి 40 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ తూతూ మంత్రంగా విచారణకు ఒక కమిషన్ వేయడమే గానీ ఆ కమిషన్ ఏమని నివేదిక ఇచ్చిందన్న విషయం ఎవరికీ తెలీదు. ఈ ప్రమాదానికి కూడా ఒక కమిషన్ వేస్తామంటారు.
ఆ కమిషన్ కూడా ఏమి చెబుతుందో ఎవరికీ తెలీదు. ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వాలకు అసలు మనసుందా? ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందో తెలపాలి. ఈ బోగీలో ఫలానా సమస్య ఉందనాలి. ఆ సమస్యను పరిష్కరించామని, ఇకముందు సమస్య తలెత్తదని ప్రయాణికులకు రైల్వే మంత్రే చెప్పాలి. అప్పుడు వారికి భరోసా వస్తుంది. రైళ్లలో ప్రయాణించేందుకు ముందడుగు వేస్తారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల బోగీలు పాత తరంవి. అవి ఎలా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ బోగీల్లో సమస్యలు పదేపదే తలెత్తుతున్నా వాటినే ఎందుకు వినియోగించడం? కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించిన వారు ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయారు. మొత్తం మీద 26 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి.
వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో నాలుగు ఓల్వో బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నా. ఫలానా సమస్య వల్ల ఈ ప్రమాదం జరిగింది.. ఫలానా వారిపై చర్యలు తీసుకున్నాం అని చెప్పేవారు లేరు. మరోసారి ఇటువంటి సమస్య తలెత్తదని భరోసా ఇచ్చేవారూ లేరు. ప్రయాణికుల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదు. సామాన్యుల ప్రాణాలకు ఈ ప్రభుత్వాలు భద్రత కల్పించలేకపోతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఎంత కోరుతున్నారని మీడియా ప్రశ్నించగా... ఎక్స్‌గ్రేషియా వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నారు.