bengalore nanded express
-
బోగీ లోపలి నుంచే మంటలు
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమా దానికి బోగీ లోపలి నుంచి వచ్చిన మంటలే కారణమని రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఏపీఎఫ్ఎస్ఎల్) పరిశీలనలో నిర్ధారణైంది. అగ్నిప్రమాదంపై ఏపీఎఫ్ఎస్ఎల్ డెరైక్టర్ శారద ఈ మేరకు డీజీపీ, రైల్వే సేఫ్టీ అధికారులకు ప్రాథమిక అధ్యయన నివేదిక అందించారు. మంటల్లో పూర్తిగా చిక్కుకున్న బీ-1 బోగీలోని బే-4, 5 బెర్తుల వరుస వద్ద మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని నివేదికలో పేర్కొన్నారు. ఒక బేలో వరుసగా ఆరు బెర్తులుంటాయి. ఆ బెర్తుల వద్ద నుంచే మంటలు ప్రధానంగా విస్తరించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయని, మంటల సమయంలో కొందరు బయటకు వెళ్లేందుకు అద్దాలు పగలగొట్టడంతో బయట నుంచి వచ్చిన గాలితో మంటలు మరింత పెరిగాయని నిపుణుల పరిశీలనలో తేలింది. రైలు దుర్ఘటనకు పేలుడు పదార్ధాలు కారణం కాదని, విద్రోహచర్య లేదని నిపుణుల పరిశీలనలో ఇప్పటికే నిర్ధారణైంది. మంటలు ప్రారంభమైన పది నిమిషాల వ్యవధిలోనే బోగీమొత్తం దగ్ధం కావడానికి మండే స్వభావం ఉన్న రసాయనాలు కారణమా? అనే కోణంలోనూ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంటల్లో దగ్ధమైన బీ-1 బోగీని బెంగళూరుకు తరలించడంతో దానిని మరోమారు పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఎఫ్ఎస్ఎల్ బృందం బెంగళూరుకు వెళుతోంది. బోగీ పై భాగంలో రూఫ్ మౌంటెడ్ ఏసీ ప్యానెల్ ఉంటుంది.. బెంగళూరు గ్యారేజీలో ఏసీ ప్యానల్‌కు విద్యుత్ సరఫరా ఇవ్వడం ద్వారా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందనేది సరిపోల్చుకోవాల్సి ఉంటుందని ఫొరెన్సిక్ నిపుణులు తెలిపారు. -
రైలు దుర్ఘటన:ఎనిమిది మృతదేహాలు అప్పగింత
బెంగళూరు: ‘బెంగళూరు-నాందేడ్’ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో చనిపోయిన 26 మందిలో ఎనిమిది మృతదేహాలను సంబంధీకులకు రైల్వే శాఖ అధికారులు అప్పగించారు. మిగిలిన వాటిని డీఎన్ఏ పరీక్షల అనంతరం బంధువులు తీసుకువెళ్లవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది. బెంగళూరు నుంచి నాందేడ్‌కు వెళ్తున్న రైలు శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్దకు చేరుకోగానే ఏసీ కోచ్ బీ1 బోగీలో మంటలు చెలరేగడంతో 26 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఘటనాస్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మతదేహాలను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి చేర్చి భద్రపరిచారు. మృతదేహాలను గుర్తుపట్టిన బంధువులకు వాటిని అధికారులు అప్పగించారు. అయితే వీటిని దహనం చేయకూడదని, ఖననం మాత్రమే చేయాలని సూచించారు. భవిష్యత్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే డీఎన్ఏ పరీక్షలకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ భీమయ్య, సుభాష్‌రెడ్డి, రాతి ప్రేమ్‌లత, రాతి చంపాలాల్, బసవరాజ్, సర్వమంగళ, కులకర్ణి, జుహి నాగ్రే మతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. మిగిలిన 18లో 12 మత దేహాలను గర్తించినా సందేహాలు ఉండటం, కొంతమంది తమ ఆచారాల ప్రకారం దహనమే చేయాలని చెబుతుండటంతో వాటిని బంధువులకు అప్పగించలేదు. -
అల్లాడిపోయిన చిన్నారి తనుశ్రీ
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి నరకయాతన అనుభవించింది. ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన నటేష్ కుటుంబం తీవ్రంగా గాయపడింది. నటేష్ కుమార్తె తనుశ్రీ ముఖమంతా కాలిపోవడంతో ఆమెకు అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు చికిత్స చేసే సమయంలో చిన్నారి ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది. నటేష్ (36) స్వస్థలం చెన్నై. అతను చెన్నైలోని ధనలక్ష్మి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబం తో కలసి మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో నటేష్‌తో పాటూ అతని భార్య విజిత (33), కుమార్తె తనుశ్రీ (5) తీవ్రంగా గాయపడ్డారు. కానీ, ప్రమాదంలో వీరి కుటుంబసభ్యులు సుధ (60), లీల(62), రామనాథన్ (65) చనిపోయినట్లు బంధువులు తెలిపారు. రెండున్నరేళ్ల చిన్నారి సహా ముగ్గురు.. సాక్షి, బెంగళూరు: డాక్టర్ అస్రా తన రెండున్నరేళ్ల కుమారుడైన మహ్మద్, బంధువు ఇబ్రహీంతో కలసి రాయ్‌చూర్ వెళ్లాల్సి ఉంది. రైలు దుర్ఘటనలో మహ్మద్ చనిపోగా మిగిలిన వారి వివరాలు తెలియడం లేదు. వారు కూడా మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఏసీ బోగీలో ప్రమాదం జరిగిందని తెలియగానే విజయ రామ్మూర్తి (63) అనే మహిళ రైలులో నుంచి బయటకు దూకేసింది. దీంతో ఆమె తలకు, నడుం వద్ద గాయాలయ్యాయి. వైద్యులు ఆమె తలకు కుట్లు వేసి చికిత్స అందించారు. ్చనాన్నా.. వస్తున్నా.. అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాన్నా.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నా అని చెప్పిన ఆ కొడుకు ఎంతకీ రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఉంటున్న అనంతపురానికి చెందిన శ్రీలత (26), శ్రీనివాస్ (28) శుక్రవారం రాత్రి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో సొంత ఊరికి బయలుదేరారు. ఇంతలో ఘోర ప్రమాదం జరిగింది. వారి ఫోన్లు పనిచేయడం లేదు. బతిమాలి మృత్యుశకటంలోకి.. సాక్షి, బెంగళూరు: రాయచూరుకు చెందిన సుభాష్‌రెడ్డి (45) కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డెరైక్టర్. శుక్రవారం బెంగళూరులో ‘ఫెడరేషన్’ సభ్యులతో సమావేశమై నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుప్రయాణమయ్యాడు. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. దీంతో రైల్వే అధికారిని బతిమాలి బీ1 కోచ్‌లో ఓ బెర్త్‌ను సంపాదించాడు. అదే బీ1 కోచ్‌లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఇతని ఆచూకీ తెలియడం లేదు. అయ్యయ్యో.. శుభలేఖలు అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట సర్క్యూట్ జరిగిన బీ1 బోగీలో అగ్నికీలలు ఎగిసిపడినా అక్కడ ఉన్న శుభలేఖలు చెక్కుచెదరలేదు. అయితే వీటిని పంచేందుకు తీసుకెళుతున్న వారు మరణించారా.. గాయాలతో బయటపడ్డారా ? అన్నది తెలియడం లేదు. బెంగళూరుకు చెందిన శాంతిలాల్, శకుంతలబాయి దంపతుల కుమార్తె స్మితకు, నాందేడ్‌కు చెందిన కన్హేలాల్‌జీ పురోహిత్, మనూదేవి దంపతుల కుమారుడు నిఖిల్‌కి వివాహం జరుగనున్నట్లుగా ఆ శుభలేఖల్లో ఉంది. సెలవులకు వస్తూ.. తాండూరు, న్యూస్‌లైన్: సెలవుల్లో భార్యా పిల్లలతో సరదాగా గడిపేందుకు తాండూర్ వస్తున్న ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. కర్ణాటకకు చెందిన కండోభా కులకర్ణి(32) కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. కులకర్ణి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి ఐదేళ్ల క్రితం తాండూరు మండలం కరన్‌కోట్‌కు చెందిన శ్వేతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఓ కార్యక్రమం కోసం శ్వేత తాండూరు వచ్చారు. సెలవులు రావడంతో భార్యా పిల్లలతో గడిపేందుకు కులకర్ణి తాండూరుకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. బీ-1 బోగిలోని 17వ బెర్తులో కులకర్ణి కూర్చున్నారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బాత్రూమ్కు వెళ్లి.. మంటలు వ్యాపించడంతో సజీవ దహనమయ్యాడు. మరోవైపు తాండూరు మండలం కరన్‌కోట్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో ఎలక్ట్రికల్ విభాగంలో మెకానిక్‌గా పని చేస్తున్న పాట్నాకు చెందిన ప్రతాప్ వినయ్(43) జాడ కూడా తెలియడం లేదు. -
ఇంత నిర్లక్ష్యమా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జగన్మోహన్రెడ్డి ధ్వజం కొత్తచెరువు/ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్: గత 16 నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరిగాయని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. ప్రభుత్వాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 26 మంది సజీవ దహనమైన విషయం తెలుసుకున్న జగన్... చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రను వాయిదా వేసుకుని రైలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్లో ఉంచిన కాలిపోయిన బోగీని పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘ 2012 మే 22న ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండలో రైలు ప్రమాదం జరిగింది. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 30 మంది వరకు మృతి చెందారు. 16 నెలల వ్యవధిలో ఇది (నాందేడ్ రైలు) మూడో ప్రమాదం. ఎప్పుడు ప్రమాదం జరిగినా కనీసం 30 నుంచి 40 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ తూతూ మంత్రంగా విచారణకు ఒక కమిషన్ వేయడమే గానీ ఆ కమిషన్ ఏమని నివేదిక ఇచ్చిందన్న విషయం ఎవరికీ తెలీదు. ఈ ప్రమాదానికి కూడా ఒక కమిషన్ వేస్తామంటారు. ఆ కమిషన్ కూడా ఏమి చెబుతుందో ఎవరికీ తెలీదు. ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వాలకు అసలు మనసుందా? ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందో తెలపాలి. ఈ బోగీలో ఫలానా సమస్య ఉందనాలి. ఆ సమస్యను పరిష్కరించామని, ఇకముందు సమస్య తలెత్తదని ప్రయాణికులకు రైల్వే మంత్రే చెప్పాలి. అప్పుడు వారికి భరోసా వస్తుంది. రైళ్లలో ప్రయాణించేందుకు ముందడుగు వేస్తారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల బోగీలు పాత తరంవి. అవి ఎలా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ బోగీల్లో సమస్యలు పదేపదే తలెత్తుతున్నా వాటినే ఎందుకు వినియోగించడం? కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించిన వారు ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయారు. మొత్తం మీద 26 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో నాలుగు ఓల్వో బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నా. ఫలానా సమస్య వల్ల ఈ ప్రమాదం జరిగింది.. ఫలానా వారిపై చర్యలు తీసుకున్నాం అని చెప్పేవారు లేరు. మరోసారి ఇటువంటి సమస్య తలెత్తదని భరోసా ఇచ్చేవారూ లేరు. ప్రయాణికుల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదు. సామాన్యుల ప్రాణాలకు ఈ ప్రభుత్వాలు భద్రత కల్పించలేకపోతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఎంత కోరుతున్నారని మీడియా ప్రశ్నించగా... ఎక్స్‌గ్రేషియా వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నారు.