సాక్షి, హైదరాబాద్: బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమా దానికి బోగీ లోపలి నుంచి వచ్చిన మంటలే కారణమని రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) పరిశీలనలో నిర్ధారణైంది. అగ్నిప్రమాదంపై ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ డెరైక్టర్ శారద ఈ మేరకు డీజీపీ, రైల్వే సేఫ్టీ అధికారులకు ప్రాథమిక అధ్యయన నివేదిక అందించారు. మంటల్లో పూర్తిగా చిక్కుకున్న బీ-1 బోగీలోని బే-4, 5 బెర్తుల వరుస వద్ద మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని నివేదికలో పేర్కొన్నారు. ఒక బేలో వరుసగా ఆరు బెర్తులుంటాయి. ఆ బెర్తుల వద్ద నుంచే మంటలు ప్రధానంగా విస్తరించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయని, మంటల సమయంలో కొందరు బయటకు వెళ్లేందుకు అద్దాలు పగలగొట్టడంతో బయట నుంచి వచ్చిన గాలితో మంటలు మరింత పెరిగాయని నిపుణుల పరిశీలనలో తేలింది.
రైలు దుర్ఘటనకు పేలుడు పదార్ధాలు కారణం కాదని, విద్రోహచర్య లేదని నిపుణుల పరిశీలనలో ఇప్పటికే నిర్ధారణైంది. మంటలు ప్రారంభమైన పది నిమిషాల వ్యవధిలోనే బోగీమొత్తం దగ్ధం కావడానికి మండే స్వభావం ఉన్న రసాయనాలు కారణమా? అనే కోణంలోనూ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంటల్లో దగ్ధమైన బీ-1 బోగీని బెంగళూరుకు తరలించడంతో దానిని మరోమారు పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం బెంగళూరుకు వెళుతోంది. బోగీ పై భాగంలో రూఫ్ మౌంటెడ్ ఏసీ ప్యానెల్ ఉంటుంది.. బెంగళూరు గ్యారేజీలో ఏసీ ప్యానల్‌కు విద్యుత్ సరఫరా ఇవ్వడం ద్వారా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందనేది సరిపోల్చుకోవాల్సి ఉంటుందని ఫొరెన్సిక్ నిపుణులు తెలిపారు.