అల్లాడిపోయిన చిన్నారి తనుశ్రీ
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి నరకయాతన అనుభవించింది. ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన నటేష్ కుటుంబం తీవ్రంగా గాయపడింది. నటేష్ కుమార్తె తనుశ్రీ ముఖమంతా కాలిపోవడంతో ఆమెకు అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు చికిత్స చేసే సమయంలో చిన్నారి ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది. నటేష్ (36) స్వస్థలం చెన్నై. అతను చెన్నైలోని ధనలక్ష్మి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబం తో కలసి మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో నటేష్‌తో పాటూ అతని భార్య విజిత (33), కుమార్తె తనుశ్రీ (5) తీవ్రంగా గాయపడ్డారు. కానీ, ప్రమాదంలో వీరి కుటుంబసభ్యులు సుధ (60), లీల(62), రామనాథన్ (65) చనిపోయినట్లు బంధువులు తెలిపారు.
రెండున్నరేళ్ల చిన్నారి సహా ముగ్గురు..
సాక్షి, బెంగళూరు: డాక్టర్ అస్రా తన రెండున్నరేళ్ల కుమారుడైన మహ్మద్, బంధువు ఇబ్రహీంతో కలసి రాయ్‌చూర్ వెళ్లాల్సి ఉంది. రైలు దుర్ఘటనలో మహ్మద్ చనిపోగా మిగిలిన వారి వివరాలు తెలియడం లేదు. వారు కూడా మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఏసీ బోగీలో ప్రమాదం జరిగిందని తెలియగానే విజయ రామ్మూర్తి (63) అనే మహిళ రైలులో నుంచి బయటకు దూకేసింది. దీంతో ఆమె తలకు, నడుం వద్ద గాయాలయ్యాయి. వైద్యులు ఆమె తలకు కుట్లు వేసి చికిత్స అందించారు.
్చనాన్నా.. వస్తున్నా..
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాన్నా.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నా అని చెప్పిన ఆ కొడుకు ఎంతకీ రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బెంగళూరులోని జయనగర్‌లో ఉంటున్న అనంతపురానికి చెందిన శ్రీలత (26), శ్రీనివాస్ (28) శుక్రవారం రాత్రి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో సొంత ఊరికి బయలుదేరారు. ఇంతలో ఘోర ప్రమాదం జరిగింది. వారి ఫోన్‌లు పనిచేయడం లేదు.
బతిమాలి మృత్యుశకటంలోకి..
సాక్షి, బెంగళూరు: రాయచూరుకు చెందిన సుభాష్‌రెడ్డి (45) కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ డెరైక్టర్. శుక్రవారం బెంగళూరులో ‘ఫెడరేషన్’ సభ్యులతో సమావేశమై నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగుప్రయాణమయ్యాడు. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. దీంతో రైల్వే అధికారిని బతిమాలి బీ1 కోచ్‌లో ఓ బెర్త్‌ను సంపాదించాడు. అదే బీ1 కోచ్‌లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఇతని ఆచూకీ తెలియడం లేదు.
అయ్యయ్యో.. శుభలేఖలు
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో షార్‌ట సర్క్యూట్ జరిగిన బీ1 బోగీలో అగ్నికీలలు ఎగిసిపడినా అక్కడ ఉన్న శుభలేఖలు చెక్కుచెదరలేదు. అయితే వీటిని పంచేందుకు తీసుకెళుతున్న వారు మరణించారా.. గాయాలతో బయటపడ్డారా ? అన్నది తెలియడం లేదు. బెంగళూరుకు చెందిన శాంతిలాల్, శకుంతలబాయి దంపతుల కుమార్తె స్మితకు, నాందేడ్‌కు చెందిన కన్హేలాల్‌జీ పురోహిత్, మనూదేవి దంపతుల కుమారుడు నిఖిల్‌కి వివాహం జరుగనున్నట్లుగా ఆ శుభలేఖల్లో ఉంది.
సెలవులకు వస్తూ..
తాండూరు, న్యూస్‌లైన్: సెలవుల్లో భార్యా పిల్లలతో సరదాగా గడిపేందుకు తాండూర్ వస్తున్న ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. కర్ణాటకకు చెందిన కండోభా కులకర్ణి(32) కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. కులకర్ణి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతనికి ఐదేళ్ల క్రితం తాండూరు మండలం కరన్‌కోట్‌కు చెందిన శ్వేతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఓ కార్యక్రమం కోసం శ్వేత తాండూరు వచ్చారు. సెలవులు రావడంతో భార్యా పిల్లలతో గడిపేందుకు కులకర్ణి తాండూరుకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. బీ-1 బోగిలోని 17వ బెర్తులో కులకర్ణి కూర్చున్నారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బాత్‌రూమ్‌కు వెళ్లి.. మంటలు వ్యాపించడంతో సజీవ దహనమయ్యాడు. మరోవైపు తాండూరు మండలం కరన్‌కోట్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో ఎలక్ట్రికల్ విభాగంలో మెకానిక్‌గా పని చేస్తున్న పాట్నాకు చెందిన ప్రతాప్ వినయ్(43) జాడ కూడా తెలియడం లేదు.