బెంగళూరు: ‘బెంగళూరు-నాందేడ్’ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో చనిపోయిన 26 మందిలో ఎనిమిది మృతదేహాలను సంబంధీకులకు రైల్వే శాఖ అధికారులు అప్పగించారు. మిగిలిన వాటిని డీఎన్‌ఏ పరీక్షల అనంతరం బంధువులు తీసుకువెళ్లవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది. బెంగళూరు నుంచి నాందేడ్‌కు వెళ్తున్న రైలు శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్దకు చేరుకోగానే ఏసీ కోచ్ బీ1 బోగీలో మంటలు చెలరేగడంతో 26 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఘటనాస్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మతదేహాలను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి చేర్చి భద్రపరిచారు. మృతదేహాలను గుర్తుపట్టిన బంధువులకు వాటిని అధికారులు అప్పగించారు. అయితే వీటిని దహనం చేయకూడదని, ఖననం మాత్రమే చేయాలని సూచించారు.
భవిష్యత్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే డీఎన్‌ఏ పరీక్షలకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ భీమయ్య, సుభాష్‌రెడ్డి, రాతి ప్రేమ్‌లత, రాతి చంపాలాల్, బసవరాజ్, సర్వమంగళ, కులకర్ణి, జుహి నాగ్రే మతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. మిగిలిన 18లో 12 మత దేహాలను గర్తించినా సందేహాలు ఉండటం, కొంతమంది తమ ఆచారాల ప్రకారం దహనమే చేయాలని చెబుతుండటంతో వాటిని బంధువులకు అప్పగించలేదు.