పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలు
♦ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ
♦ ప్రతిపక్షనేత జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘తరతమ భేదం లేకుండా, ప్రాంతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి. అలాంటిది పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలు పరిమితమయ్యాయి. అంగన్‌వాడీ వర్కర్ నియామకమైనా, పక్కా గృహం లబ్ధిదారుని ఎంపికలోనైనా వారి సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటున్నాయి.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఎత్తుగడను ప్రభుత్వం అవలంభిస్తోంది’’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు శుక్రవారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలసి ప్రభుత్వ పక్షపాత తీరును వివరించారు. అధైర్య పడొద్దు, అండగా ఉంటానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
అధికారంలోకి రాగానే అర్హులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు.పర్యటనలో భాగంగా తొలిరోజు జిల్లాలోని పులివెందుల, తొండూరు మండలాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష చర్యలపై ఆరోగ్యమిత్రలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రతిపక్షనేతకు విన్నవించారు.
న్యాయ పోరాటం కొనసాగించండి..
ఎనిమిదేళ్లుగా తక్కువ వేతనంతోనే పని చేస్తున్న తమని అర్హత పేరుతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోగ్యమిత్రలు జగన్‌కు విన్నవించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘పచ్చ చొక్కాల వారిని మీ స్థానాల్లో నింపడానికే మీ కడుపు కొడుతున్నారు. రాత పరీక్ష పాసై, ట్రైనింగ్ తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. డిగ్రీ అర్హత ఉన్నా అన్యాయం చేస్తున్నారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. న్యాయ పోరాటం కొనసాగించం డి.మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యమిత్రలందరినీ తీసుకుంటాం’’అని వారికి భరోసా ఇచ్చారు.
‘‘రెండేళ్లుగా జీతాలు పెంచలేదు. అరకొర వేతనాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నాం. జీవో నంబర్ 3 కూడా పరిగణనలోకి తీసుకోలేదు’’అని జేఎన్‌టీయూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి తరుఫున అసెంబ్లీలో నిలదీస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థలను పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల పరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ అన్నారు. ఆర్టీసీని సైతం ప్రైవేట్‌పరం చేయాలనే తలంపుతో ఉన్నారని తనను కలిసిన ఆర్టీసీ కార్మికులకు ఆయన వివరించారు. ప్రభుత్వ వైఖరిని ఎదుర్కోవాలని కార్మికులకు సూచించారు. కాగా జగన్ శుక్రవారం ఉదయం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులో గల తాత రాజారెడ్డి, నానమ్మ జయమ్మల సమాధుల వద్ద పూలమాలలు ఉంచి వారికి నివాళులర్పించారు.