అంబేడ్కర్ అప్పుడెందుకు గుర్తుకురాలేదు?
చంద్రబాబుపై జగన్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను కూడా వాడుకున్నారని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి జగన్ క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అంబేడ్కర్‌పై చర్చ జరుపుదామనుకున్న ప్రభుత్వ దిక్కుమాలిన ఆలోచనలను నిరసిస్తూ.. ఈ విషయమై అంబేడ్కర్‌కు విన్నవించుకున్నామని చెప్పారు. సెక్స్ రాకెట్‌పై చర్చను దారి మళ్లించేందుకే అంబేడ్కర్ పేరుని చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటోందని ధ్వజమెత్తారు.
పేద మహిళల కోసం తాము పోరాటం చేస్తుంటే దానిపై చర్చ జరగనివ్వకుండా, గురువారం అసెంబ్లీలో చంద్రబాబు హేయంగా ప్రవర్తించారని, మనీ సెక్స్ అంశం బయటకు రాకూడదన్న ఉద్దేశంతో అంబేడ్కర్ అంశం ఎజెండాలో లేకపోయినా ప్రస్తావించారని చెప్పారు. నిజానికి అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14న అని, వర్ధంతి డిసెంబర్ 6న అయితే ఆయన అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగిందని, రాజ్యాంగ రచన పూర్తి చేసింది నవంబర్ 26న అని ప్రతిపక్ష నేత తెలిపారు. చంద్రబాబుకు ఈ తేదీలలో ఎప్పుడూ అంబేడ్కర్ గుర్తుకు రాలేద ని, కనీసం నివాళులు అర్పించాలని కూడా అనుకోలేదని విమర్శించారు.
కానీ డిసెంబర్ 17న ఏమీలేనప్పడు మాత్రం అంబేడ్కర్ గురించి చర్చిస్తామంటారని ఎద్దేవా చేశారు. నిజంగా అంబేడ్కర్ మీద చర్చ జరపాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలను పొడిగించి. చర్చ జరపాలని, అంబేడ్కర్‌ను సైతం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే తీరునే తాము వ్యతిరేకించామని చెప్పారు. విజయవాడ సెక్స్ రాకెట్ నేరంలో సాక్షాత్తూ చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరికీ భాగస్వామ్యం ఉందని.. వాళ్లంతా దోషులుగా నిలబడాలని డిమాండ్ చేశారు. విజయవాడ అంశాన్ని దారి మళ్లించేందుకే రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.