సీఎం వైఎస్‌ జగన్‌: అధిక ధరలకు అమ్మితే జైలుకే | YS Jagan Introduces Special Law to Control Sand Price - Sakshi
Sakshi News home page

అధిక ధరలకు అమ్మితే జైలుకే

Published Thu, Nov 7 2019 4:34 AM | Last Updated on Thu, Nov 7 2019 10:46 AM

YS Jagan Government Special Law on Sand Price Control - Sakshi

రాష్ట్రంలో ఏ సమస్యా లేకపోవడంతో ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నాయి. మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా దేవుడు సహకరిస్తాడు. వరదలన్నవి మన చేతిలో లేవు. ఆగస్టు నుంచి ఇవాల్టి వరకు నదుల్లో వరద కొనసాగుతోంది. మనం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైంది. మంత్రులు జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు ప్రారంభం అయ్యాయి. ఐదు నెలల్లో 3 నెలల పాటు వరద పరిస్థితులు నెలకొన్నాయి. వరదల వల్ల ఇసుక రీచ్‌లు నీటిలో మునిగితే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కొంత సమస్య తప్పదు.
ప్రతిపక్షాలు దీన్ని పట్టుకుని కుట్రలు చేస్తున్నాయి.  
   
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ప్రత్యేక చట్టం తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదలు తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున స్టాక్‌ యార్డులకు తరలించి ఎక్కడా కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు ఖరారు చేసి పక్కాగా అమలు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఇసుక సరఫరా పెంపు, మద్యం నియంత్రణపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో చర్చించి ఇసుక ధరలు ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సరఫరా పెంచాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

నెలలో సాధారణ పరిస్థితులు: అధికారులు రెండు మూడు రోజులుగా వరద కొంత తగ్గినందున రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల సంఖ్య 61 నుంచి 83కు పెరిగిందని అధికారులు తెలిపారు. సరఫరా రోజుకు సగటున 41 వేల టన్నుల నుంచి 69 వేల టన్నులకు పెరిగిందని వివరించారు. వారం రోజుల్లో దీన్ని లక్ష టన్నులకు పెంచుతామన్నారు. వాతావరణం సహకరిస్తే 15 నుంచి 30 రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని, అన్ని రీచ్‌ల్లో ఇసుక వెలికితీత ప్రారంభమై సరఫరా రోజుకు 2 నుంచి 3 లక్షల టన్నుల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ పోలీస్‌ అధికారులు రవిశంకర్‌ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనులశాఖ అధికారులు పాల్గొన్నారు. 

గ్రామాల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు
గ్రామాల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని, ఎవరైనా విక్రయించినట్లు సమాచారం అందితే విచారించి జైలుకు పంపాలని స్పష్టం చేశారు. మద్య నియంత్రణ విధి విధానాలపై మరో సమావేశంలో చర్చించి  చట్టం తెద్దామని సూచించారు.

ఈసారి ‘స్పందన’ ఇసుకపైనే..
‘ఎక్కడా అవినీతికి తావులేకుండా వ్యవహరిస్తున్నప్పటికీ విపక్షాలు మనపై బండలు వేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. వచ్చే వారం ‘స్పందన’ నాటికి ఇసుక ధరలతోపాటు ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రకటించాలి. ఈసారి ‘స్పందన’ కేవలం ఇసుకపైనే నిర్వహిస్తాం. అదే వేదికగా ఇసుక వారోత్సవాలను ప్రకటిస్తాం’ 

సీఎం సమీక్షలో కీలక అంశాలివీ..
- ఇసుక స్మగ్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచి టెక్నాలజీని వినియోగించుకోవాలి. 
ప్రతి రూట్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలి. 
తప్పు చేసిన వారిని జైలుకు పంపితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది.
ప్రతి రీచ్‌లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా చూడగలగాలి. తవ్వకాలు నిలిచిపోతే వెంటనే కారణం తెలియాలి. 
మొత్తం 275 రీచ్‌లలో రాత్రి పూట కూడా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 
రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు సిద్ధం కావాలి. జాప్యాన్ని నివారించేందుకు వేర్వేరు సంస్థల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలి.
వరద తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా కోసం వాహనాలను విస్తృతంగా అందుబాటులో ఉంచాలి. 
- కిలోమీటరుకు టన్ను రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వెంటనే అనుమతి ఇవ్వాలి.
స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వలు సరిపడా చేరేవరకు విరామం లేకుండా పనిచేయాలి. 
అవసరమైతే స్టాక్‌ పాయింట్లు పెంచాలి. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఇసుక సరఫరా చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement