గిరిజనులకు ఆరోగ్య సిరి  | YS Jagan Govt Launching Super Speciality Hospital For Tribes In Srikakulam | Sakshi
Sakshi News home page

గిరిజనులకు ఆరోగ్య సిరి 

Published Mon, Jul 15 2019 8:01 AM | Last Updated on Mon, Jul 15 2019 8:03 AM

YS Jagan Govt Launching Super Speciality Hospital For Tribes In Srikakulam - Sakshi

సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటు వల్ల కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గైనికాలజిస్టు, ఆర్ధోపెడిక్, చిల్డ్రన్‌ స్పెషలిస్టులతోపాటు పలు రకాల వైద్య నిపుణుల నియామకం జరుగుతుంది. అంతే కాకుండా అత్యాధునికమైన సీటీ స్కాన్, ఎక్స్‌రే, డయాలసిస్‌ యంత్రాలతోపాటు పలు రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తారు.

సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పనుంది. ఇందుకోసం కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ఆస్పత్రి స్థాయి పెంచి సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అవగాహన రాహిత్యంతో నాటు వైద్యులను ఆశ్రయిస్తారు. వారిని ఒప్పించి ఆస్పత్రులకు తీసుకువచ్చినా ఉన్నత వైద్యం అందుబాటులో ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు వారు అంగీకరించరు. అందుచేత వారి చెంతనే అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో పాతపట్నం నియోజవర్గం పరిధిలోని కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనుంది. 

కొత్తూరు ఆస్పత్రే ఎందుకంటే..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీడీఏ అధికారులకు ఇటీవల ఆదేశాలు వచ్చాయి. దీంతో ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రంగంలోకి దిగారు. కొత్తూరు సీహెచ్‌సీ ఆస్పత్రి ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం కొత్తూరుకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది. ఇక్కడ ఆస్పత్రి నెలకొల్పితే సీతంపేట భామిని, హిరమండలం, పాతపట్నం, ఎల్‌ఎన్‌ పేట, మెళియాపుట్టి మండలవాసులకు అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయడం వల్ల విజయనగరం జిల్లాలోని గిరిజనులకు సైతం ఉపయోగపడుతుంది.

జిల్లాలో రెండో పెద్దాస్పత్రి
ఇంతవరకు జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం శ్రీకాకుళంలోని రిమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇదే జిల్లాలోని రెండో పెద్దాస్పత్రి అవుతుంది. ఇక మీదట వైద్యం కోసం గిరిజనవాసులు శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లనవసరం ఉండదు. ఈ ఆస్పత్రి జిల్లాలోని గిరిజన ప్రజలతోపాటు మైదాన ప్రాంతవాసులకు సైతం ఉపయోగపడుతుంది. ఐటీడీఏ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో నరేష్‌ కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొత్తూరు సీహెచ్‌సీని పరిశీలించామన్నారు. సీహెచ్‌సీ ఆవరణ ఇందుకు అనువుగా ఉన్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు నివేదిక అందివ్వడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రికి సుమారు రూ. 20 కోట్లు ఖర్చవుతుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement