అన్నదాతకు అండగా..
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తలపెట్టిన రైతుదీక్ష వివిధ వర్గాల్లో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. మహిళలు మరొకడుగు ముందుకేసి ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆడపడుచులను దీక్షను విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నారు. యువకులు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల కోసం చేస్తున్న దీక్షకు జిల్లాను ఎంచుకోవడం వెనుక ఇక్కడి ప్రజలపై ఆయనకున్న అచంచల విశ్వాసం, అవ్యాజమైన ప్రేమే కారణమని వివరిస్తున్నారు.
గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువకుల ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. కాగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీక్షా శిబిరాన్ని పరిశీలించి రైతు దీక్షను విజయవంతం చేయడానికి వచ్చేవారికి అవసరమై సౌకర్యాలు కల్పించే విషయంలో నాయకులకు సూచనలు చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రి నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ముఖ్య నాయకులు కారుమూరి నాగేశ్వరరావు, వంక రవీంద్రనాథ్, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా తణుకు పట్టణంలో ముస్లింలు ఇంటింటికీ తిరిగి రైతు దీక్షపై ప్రచారం నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని నారాయణపురం, ఉప్పాకపాడు, కంసాలికుంట, నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు.
బుట్టాయగూడెంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు పోల్నాటి బాబ్జి, ఆరేటి సత్యనారాయణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. జన సమీకరణపై సమీక్షించారు.పోలవరంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు వందనపు సాయిబాల పద్మ విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యధిక సంఖ్యలో దీక్షకు హాజరై దీక్షను బలపరచాలని పిలుపునిచ్చారు. మొగల్తూరులో పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో సానబోయిన వెంకటరమణ ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి రైతు దీక్షకు ఆహ్వానించారు.
పెరవలి మండలంలో నిడదవోలు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ స్థానిక నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, గంధం చంటి, మారిశెట్టి జగన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోల్నాటి బాబ్జి చింతలపూడి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి జన సమీకరణపై ఆరా తీశారు. కార్యకర్తలకు, నాయకులకు రూట్ మ్యాప్‌ను వివరించారు. ఆకివీడులో పార్టీ నాయకుడు గుండా సుందర రామినాయుడు ఇంటింటా ప్రచారం నిర్వహించగా, పాలకోడేరులో చిగురుపాటి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.