
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొమ్మిదవ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం నుంచి ఆయన బుధవారం ఉదయం పాదయాత్ర మొదలుపెట్టగానే వృద్ధులు, మహిళలు...జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కర్నీ వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ ...ఏడాది ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుందని.....అందరి కష్టాలు తీరుతాయని భరోసా కల్పిస్తున్నారు.
ఇక పెద్దకోట కందుకూరు చేరుకున్న వైఎస్ జగన్‌కు గ్రామస్తులు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. మరోవైపు రహదారులన్నీ బురదమయం అయినా, అదే రోడ్లపై వెళ్లి ఆయన స్థానికుల్ని పలకరించారు. అంతేకాకుండా వయోభారంతో తన వద్దకు రాలేని వారిని ...అక్కడకు వెళ్లి మరీ పలకరించారు. టార్పాలిన్‌నే పైకప్పుగా చేసుకున్న నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. అలాగే వృద్ధులకైతే పింఛన్, రేషన్‌పై హామీ ఇస్తున్నారు. తనను కలిసిన మహిళలకు ....అమ్మ ఒడి పథకంతో చిన్నారులను చదివించే బాధ్యత తనదని హామీ ఇస్తున్నారు. సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా రాబోయే రాజన్నరాజ్యం ఉంటుందని .....ప్రతిఒక్కరికీ చెబుతూ ఆయన ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment