తటస్థులతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
వైవీయూ: ‘మీ పరిధిలో మీరంతా చేతనైన మేర మంచి చేస్తున్నారు.. మీ అందరినీ కలిసి మీ సూచనలు, సలహాలు స్వీకరించేందుకు వచ్చాను. రాష్ట్రంలో ప్రస్తుతం ఎటువంటి పాలన సాగుతోందో మీరంతా చూస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చి మెరుగైన పాలన అందించడంలో భాగస్వాములు కండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తటస్థులను కోరారు. కడప నగరంలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా తటస్థ ప్రభావితులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.. మీ పరిచయాలు.. సాన్నిహిత్యం జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశం ఒక్కసారితో అయిపోదు.. మీరు ఇవ్వదలచిన సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చు’ అని చెప్పారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
స్థానికులకు నైపుణ్యాలు లేవంటున్నారు
మా ప్రాంతంలో పలు ప్రైవేట్ కంపెనీలొస్తున్నా ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఉద్యోగాలిస్తున్నారు. స్థానికులకు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. మీకు నైపుణ్యాలు లేవంటున్నారు.
– వెంకటశివ, రైల్వేకోడూరు, భౌతికశాస్త్ర పరిశోధకుడు, పాండిచ్చేరి యూనివర్సిటీ
వైఎస్ జగన్ : మొదటి శాసనసభ సమావేశాల్లోనే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా చట్టం తెస్తాం. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఇంజినీరింగ్ విద్యా విధానంలో మార్పులు తెస్తాం. చదివిన విద్యకు తగిన ఉద్యోగం లభించేలా, జాబ్ ఓరియంటెడ్‌గా ఉండేలా చూస్తాం.
మాజీ సైనికులకు కనీస గౌరవం లేదు
దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయని మేము.. ప్రస్తుత ప్రభుత్వంలో లంచాలివ్వలేక, మా పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస గౌరవం కూడా లభించడం లేదు. – ప్రసాద్, మాజీ సైనికుడు, యర్రగుంట్ల
వైఎస్ జగన్ : దేశం కోసం పోరాడుతున్న సైనికుల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక గౌరవం కలిగి ఉండాలి. వారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మాజీ సైనికులు ప్రత్యేక గౌరవం పొందేలా చూస్తాం. లంచం ఇవ్వందే మాజీ సైనికులకే పనులు జరగడం లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. అందుకే అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తాం. వలంటీర్లు మీ వద్దకొచ్చి మీ సమస్యలు తెలుసుకుంటారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అమలును ప్రత్యేకంగా సమీక్షిస్తాం. మన ప్రభుత్వం రాగానే పరిస్థితుల్లో వచ్చిన మార్పును మీరే గుర్తించి క్రెడిట్ ఇచ్చేలా చేస్తాం.
రైతులకు మార్కెటింగ్ కల్పించాలి..
పండించిన పంటను తానే మార్కెటింగ్ చేసుకునేలా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురావాలి. ప్రస్తుత ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమవడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. రైతులకు ప్రత్యేకంగా ఐడీలు సృష్టించి.. పంటల సమాచారాన్ని ఆన్‌లైన్ చేసి, గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలి. – లక్ష్మి, చైతన్య మహిళా మండలి
వైఎస్ జగన్ : దళారీ వ్యవస్థకు కెప్టెన్‌గా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే డైరెక్టుగా వ్యాపారం చేస్తున్నాడు. గల్లా ఫ్రూట్స్, శ్రీని ఫుడ్స్, హెరిటేజ్ ఫుడ్స్ వంటి వాటికోసం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టేందుకు, రైతు సమస్యల పరిష్కారానికి ‘నవరత్నాలు’లో మార్గాలు చూపుతాం. అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థుల సేవలను వినియోగించుకుని మార్కెటింగ్‌పై విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. దీనిని రైతులకు అనుసంధానం చేసి మేలు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment