మార్చి 3న వైఎస్ జగన్ రాక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 3వ తేదీన ఏలూరులో పర్యటిం చనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏలూరు నగరంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ ఎక్కడ నిర్వహించేది ఇంకా ఖరారు కాలేదని, త్వరలో నిర్ణయిస్తామని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులో బహిరంగ సభ ముగిసిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోనే బస చేస్తారు. ఆ మరుసటి రోజు కూడా ఆయన జిల్లాలో పర్యటనను కొనసాగించే అవకాశం ఉంది. పర్యటన షెడ్యూల్‌ను రూపొందిం చేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని ఒకటి, రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం వెలువడే అవకాశం ఉంది.
నేడు ఏలూరులో సన్నాహక సమావేశం
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై చర్చిం చేందుకు గురువారం మధ్యాహ్నం నగరంలోని పార్టీ కార్యాల యంలో సమావేశం నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అధినేత పర్యటన, బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి, విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ముఖ్య నేతలతో నాని సమావేశమై చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.