Eluru Tour
-
సీఎం పర్యటన ఖరారు
ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా దేవరపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. అనంతరం దేవరపల్లిలో పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ప్యాకేజీ-2 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు దేవరపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు పెదవేగి మండలం ముండూరు గ్రా మానికి చేరుకుంటారు. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినందుకు గుర్తుగా ముం డూరులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం గుండేరు పనుల తీరును పరి శీలిస్తారు. అక్కడి నుంచి జానంపేట అక్విడెక్ట్ వరకూ కాలువ నిర్మాణ పనులను పరిశీలి స్తారు. మధ్యాహ్నం 2.50 గంటలకు జానంపేట నుంచి బయలుదేరి దొండపాడులోని వంగూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.50 గంటల వరకూ నీరు-చెట్టు పథకం పై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. 4.50 గంట లకు వంగూరు బైపాస్ రోడ్డు నుంచి బయలుదేరి 5 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విజయవాడ వెళతారు. -
విజయసాయిరెడ్డి రేపు రాక
ఏలూరు (ఆర్ఆర్ పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఏడాది పాలనలో టీడీపీ సర్కారు వైఫల్యాలను, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు మంగళవారం జిల్లాలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, ప్రజల తరపున పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా, నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన సమర దీక్షను విజయవంతం చేయడానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు నిర్వహిస్తారు. సమర దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. -
బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ప్రభుత్వాధినేత స్థానంలో ఉండి మూఢ విశ్వాసాలను పెంపొందిం చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వివిధ రాజకీయ, సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం జిల్లాలో పాదయాత్ర చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని చాగల్లులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మొక్కి ప్రజలు తాము అనుకున్న కార్యాలు సాధించుకోవచ్చని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బాబు వ్యాఖ్యలపై పలువర్గాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యత మరచి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తన రెండు నాల్కల ధోరణితో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరమైన చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి అదే రెండునాల్కల ధోరణితో ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేసి పదవిలోకి వచ్చారని వివిధ పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఫైలుపై సంతకం చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన బాబు తనమాటను నిలుపుకోలేక ఎప్పటికప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు గుప్పించి వారిలో అపనమ్మకాన్ని మూటగట్టుకున్నారని అభిప్రాయపడుతున్నారు. తనను నమ్మిన ప్రజలను మోసం చేసిన బాబు ఇప్పుడు విగ్రహాలను తాకితే కోరికలు తీరతాయని వ్యాఖ్యానించి మరోసారి దుమారం రేపారన్నారు. ప్రజల్లోని మూఢ నమ్మకాలను పారదోలాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాధినేతగా బాబుపై ఉండగా ఆయనే మూఢ విశ్వాసాలను పురిగొల్పడం సిగ్గుచేటన్నారు. వాస్తవాలను వక్రీకరించడానికే బాబు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే వివిధ అంశాల్లో ప్రజలను మోసగించిన బాబును నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేని కారణంగా ఇటువంటి వ్యాఖ్యలతో బాబు వారిని మరోసారి మోసం చేయడానికి మూఢనమ్మకాల దారిని ఎంచుకోవడం తగదని హితవు పలికారు. అభివృద్ధి చేయలేక పిచ్చి పేలాపనలు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక సీఎం చంద్రబాబునాయుడు పిచ్చి పేలాపనలకు దిగారు. దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కించపరిచేలా ఎన్టీఆర్‌ను మొక్కితే వేంకటేశ్వరస్వామిని మొక్కినట్టేనని ప్రజలను కోరడం మంచి పద్ధతి కాదు. ప్రజల మనస్సులు తెలుసుకుని వారి అభివృద్ధికి తగ్గట్టుగా పనిచేస్తే బాగుంటుంది. -బీవీ రాఘవయ్య చౌదరి, కాంగ్రెస్ నాయకులు. ప్రజా సమస్యలను పరిష్కరించండి .. ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిని ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించడానికే కాని దేవుణ్ణి, చనిపోయిన నాయకులను నమ్ముకోమని చెప్పడానికి కాదు. ఎన్టీఆర్‌ను నమ్ముకుంటే వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నట్టేనని చెప్పడం ఆయన బాధ్యతలను దాట వేయడమే. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వేంకటేశ్వరస్వామిని నమ్మినట్టే ఎన్టీఆర్‌ను నమ్మమనడం హాస్యాస్పదం. ప్రజలు ఎన్నుకున్నది చంద్రబాబును కాని దేవుడిని, చనిపోయిన నాయకులను కాదనే సత్యన్ని ఆయన గ్రహించి, ముందు తనను నమ్ముకున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలి. - బి. బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి బాబుకు మతి భ్రమించింది చంద్రబాబునాయుడుకు మతి భ్రమించినట్టు ఉంది. ఎనికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేసిన బాబు ఎన్టీఆర్‌ను దేవుడిగా చిత్రించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రజలను తప్పుదారి పట్టించడంలో మాస్టర్ డిగ్రీ సాధించిన బాబు, ఈ వ్యాఖ్యలతో మోసగించడంలో పీహెచ్‌డీని కూడా సాధించాలని కంకణం కట్టుకున్నట్టుంది. వెన్నుపోటు రాజకీయాలను రాష్ట్రానికి పరిచయం చేసిన బాబును నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. - వేగి చిన్న ప్రసాద్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 29వ డివిజన్ నాయకుడు ఎన్టీఆర్‌ను నమ్మమనటం వెనుక అర్థమేంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ను నమ్ముకుంటే వేంకటేశ్వరస్వామిని నమ్ముకునట్టే అనడంలో అర్థమేమిటని ప్రజలు ఆలోచించాలి. సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చనిపోయిన ఎన్టీఆర్‌ను నమ్మమంటున్నారంటే ఆయన బాధ్యతలు నెరవేర్చలేరని అర్థం వస్తుంది. ఇటువంటి బూటకపు కబుర్లు మానుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి కృషిచేయాలి. - డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
మార్చి 3న వైఎస్ జగన్ రాక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 3వ తేదీన ఏలూరులో పర్యటిం చనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏలూరు నగరంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ ఎక్కడ నిర్వహించేది ఇంకా ఖరారు కాలేదని, త్వరలో నిర్ణయిస్తామని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులో బహిరంగ సభ ముగిసిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోనే బస చేస్తారు. ఆ మరుసటి రోజు కూడా ఆయన జిల్లాలో పర్యటనను కొనసాగించే అవకాశం ఉంది. పర్యటన షెడ్యూల్‌ను రూపొందిం చేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని ఒకటి, రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం వెలువడే అవకాశం ఉంది. నేడు ఏలూరులో సన్నాహక సమావేశం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై చర్చిం చేందుకు గురువారం మధ్యాహ్నం నగరంలోని పార్టీ కార్యాల యంలో సమావేశం నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అధినేత పర్యటన, బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి, విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ముఖ్య నేతలతో నాని సమావేశమై చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.