బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం | unpermitted Comments CM Chandrababu Naidu in Eluru tour | Sakshi
Sakshi News home page

బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం

Published Wed, Jan 21 2015 3:58 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం - Sakshi

బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం

 ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :  ప్రభుత్వాధినేత స్థానంలో ఉండి మూఢ విశ్వాసాలను పెంపొందిం చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వివిధ రాజకీయ, సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం జిల్లాలో పాదయాత్ర చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని చాగల్లులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మొక్కి ప్రజలు తాము అనుకున్న కార్యాలు సాధించుకోవచ్చని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
 
 బాబు వ్యాఖ్యలపై పలువర్గాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యత మరచి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తన రెండు నాల్కల ధోరణితో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరమైన చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి అదే రెండునాల్కల ధోరణితో ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు చేసి పదవిలోకి వచ్చారని వివిధ పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఫైలుపై సంతకం చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన బాబు తనమాటను
 
 నిలుపుకోలేక ఎప్పటికప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు గుప్పించి వారిలో అపనమ్మకాన్ని మూటగట్టుకున్నారని అభిప్రాయపడుతున్నారు. తనను నమ్మిన ప్రజలను మోసం చేసిన బాబు ఇప్పుడు విగ్రహాలను తాకితే కోరికలు తీరతాయని వ్యాఖ్యానించి మరోసారి దుమారం రేపారన్నారు. ప్రజల్లోని మూఢ నమ్మకాలను పారదోలాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాధినేతగా బాబుపై ఉండగా ఆయనే మూఢ విశ్వాసాలను పురిగొల్పడం సిగ్గుచేటన్నారు. వాస్తవాలను వక్రీకరించడానికే బాబు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే వివిధ అంశాల్లో ప్రజలను మోసగించిన బాబును నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేని కారణంగా ఇటువంటి వ్యాఖ్యలతో బాబు వారిని మరోసారి మోసం చేయడానికి మూఢనమ్మకాల దారిని ఎంచుకోవడం తగదని హితవు పలికారు.
 
 అభివృద్ధి చేయలేక పిచ్చి పేలాపనలు
 ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక సీఎం చంద్రబాబునాయుడు పిచ్చి పేలాపనలకు దిగారు. దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కించపరిచేలా ఎన్‌టీఆర్‌ను మొక్కితే వేంకటేశ్వరస్వామిని మొక్కినట్టేనని ప్రజలను కోరడం మంచి పద్ధతి కాదు. ప్రజల మనస్సులు తెలుసుకుని వారి అభివృద్ధికి తగ్గట్టుగా పనిచేస్తే బాగుంటుంది.
 -బీవీ రాఘవయ్య చౌదరి, కాంగ్రెస్ నాయకులు.
 
 ప్రజా సమస్యలను పరిష్కరించండి ..
 ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిని ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించడానికే కాని దేవుణ్ణి, చనిపోయిన నాయకులను నమ్ముకోమని చెప్పడానికి కాదు. ఎన్‌టీఆర్‌ను నమ్ముకుంటే వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నట్టేనని చెప్పడం ఆయన బాధ్యతలను దాట వేయడమే. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వేంకటేశ్వరస్వామిని నమ్మినట్టే ఎన్‌టీఆర్‌ను నమ్మమనడం హాస్యాస్పదం. ప్రజలు ఎన్నుకున్నది చంద్రబాబును కాని దేవుడిని, చనిపోయిన నాయకులను కాదనే సత్యన్ని ఆయన గ్రహించి, ముందు తనను నమ్ముకున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలి.          - బి. బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
 బాబుకు మతి భ్రమించింది
 చంద్రబాబునాయుడుకు మతి భ్రమించినట్టు ఉంది. ఎనికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేసిన బాబు ఎన్టీఆర్‌ను దేవుడిగా చిత్రించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రజలను తప్పుదారి పట్టించడంలో మాస్టర్ డిగ్రీ సాధించిన బాబు, ఈ వ్యాఖ్యలతో మోసగించడంలో పీహెచ్‌డీని కూడా సాధించాలని కంకణం కట్టుకున్నట్టుంది. వెన్నుపోటు రాజకీయాలను రాష్ట్రానికి పరిచయం చేసిన బాబును నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు.
  - వేగి చిన్న ప్రసాద్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 29వ డివిజన్ నాయకుడు
 
 ఎన్టీఆర్‌ను నమ్మమనటం వెనుక అర్థమేంటి
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్‌టీఆర్‌ను నమ్ముకుంటే వేంకటేశ్వరస్వామిని నమ్ముకునట్టే అనడంలో అర్థమేమిటని ప్రజలు ఆలోచించాలి. సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చనిపోయిన ఎన్‌టీఆర్‌ను నమ్మమంటున్నారంటే ఆయన బాధ్యతలు నెరవేర్చలేరని అర్థం వస్తుంది. ఇటువంటి బూటకపు కబుర్లు మానుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి కృషిచేయాలి.
 - డేగా ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement