నంద్యాల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన నంద్యాల మండలం రైతునగర్‌లో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్ రాకతో రైతునగర్ జనసంద్రంగా మారింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ మీ అందరి దీవెనలు, ఆశీస్సులు వైఎస్‌ఆర్ సీపీకి ఉండాలి. పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలి. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నది నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల ఉప ఎన్నిక జరగకపోయి ఉంటే మంత్రులు నంద్యాలలో తిష్ట వేసేవారా?. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.
అబద్ధాలతో చంద్రబాబు అందరినీ మోసం చేశారు. చంద్రబాబులా మోసం చేయడం నాకు చేతకాదు. ఆయనలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే ఆ స్థానంలో నేనే ఉండేవాడిని. ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లా చేస్తూ 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తాం. ఏడాదిన్నరలో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది. నంద్యాల ఉప ఎన్నికలో వేసే ఓటు ఆ మహా సంగ్రామానికి నాంది పలకాలి. అందరికి ఉపయోగపడేలా నవరత్నాలను మనం ప్రకటించుకున్నాం. నవరత్నాలను ప్రతి ఇంటికి చేరాలి.
కేసీ కెనాల్‌లో నీరు లేక సతమతమవుతున్నారు. చంద్రబాబుకు చూపించి అడగండి. ఆయన నోట్లో నుంచి ఒక్క నిజం కూడా రాదు. చంద్రబాబుకు ఒక ముని శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట. నంద్యాలలో ధర్మానికి ఓటు వేస్తారనే సంకేతం అందరికీ వెళ్లాలి.’ అని కోరారు. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కాగా వైఎస్ జగన్ ను చూసేందుకు వచ్చిన మహిళలను ఆయన వాహనం దిగి పలకరించారు.