ప్రజలతోనే మమేకం... సమస్యలపై సమరోత్సాహం | ys jagan mohan reddy comes to district | Sakshi
Sakshi News home page

ప్రజలతోనే మమేకం... సమస్యలపై సమరోత్సాహం

Published Mon, Nov 24 2014 1:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ప్రజలతోనే మమేకం... సమస్యలపై సమరోత్సాహం - Sakshi

ప్రజలతోనే మమేకం... సమస్యలపై సమరోత్సాహం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఓ వైపు ప్రజా సమస్యలనే ఎజెండాగా చేసుకొని గళం వినిపిస్తూ ... ఇంకో వైపు పచ్చచొక్కాల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు. అధికారమే అండగా ... పోలీసులు తోడుగా చెలరేగిపోతున్న టీడీపీ గూండాల మధ్య జిల్లా పార్టీ ఎదురొడ్డి కార్యకర్తలకు స్థైర్యాన్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత మొదటిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తుండటంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం సంతరించుకుంటోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ఎలుగెత్తేందుకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఈ సమీక్ష సమావేశాలు ఎంతగానో దోహదపడనున్నాయి.
 
ఆగని అరాచకాలు...
ఎన్నికలు జరిగి ఐదు నెలలు దాటినా ఇంకా అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ఆగడం లేదు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని లక్ష్యంగా చేసి దాడులకు దిగుతూనే ఉన్నారు. జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన అధికార పక్షం చేసిన దాడుల్లో ఇద్దరు, ఆ పార్టీకి కొమ్ము కాస్తూ పోలీసులు చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మొత్తం వందమందికి పైగా గాయపడ్డారు. హత్యకు గురైన గోగాడి సింగయ్య, తేలుకుంట్ల వెంకయ్య కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు ఇప్పటికీ బెదిరింపులకు గురిచేస్తూనే ఉన్నారు. గిద్దలూరులోని ఒక అపార్టుమెంటులో రెండు ప్లాట్ల ఓనర్ల మధ్య జరిగిన వివాదాన్ని ఎస్సై వై.శ్రీనివాసరావు పెద్దది చేసి, దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన  వైస్సార్‌సీపీ నాయకుడు, సొసైటీ అధ్యక్షుడు వైజా భాస్కర్‌రెడ్డిని దూషించి, తోయడం వల్లనే గుండెపోటుకు గురై స్టేషన్‌లోనే చనిపోయారు.

పోలీస్ స్టేషన్‌లో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే, అందుకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలపై లేనిపోని కేసులు పెట్టి ఇరికించారు. జెడ్పీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా తమకు బలం లేకపోయినా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా, మాట వినని ఒక జెడ్పీటీసీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి ఓటు వేయడానికి వెళ్లే ముందు బలవంతంగా అరెస్టు చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గెలిచిన చోట పింఛన్ల  అర్హతల పరిశీలన పేరుతో వేసిన ప్రత్యేక కమిటీలు పసుపు మయంగా మారాయి. ప్రతి కమిటీలోనూ తమ పార్టీ సభ్యులను నియమించుకున్నారు.

ప్రభుత్వ జీవోలో స్థానిక ప్రజాప్రతినిధులకు చోటు కల్పించాలని స్పష్టంగా ఉన్నా మంత్రిగారి నిర్ణయం పేరుతో పలుచోట్ల ప్రజాప్రతినిధులకు ఆ కమిటీల్లో స్థానం కల్పించకపోవడం వివాదాస్పదంగా మారింది.  అధికారులు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రొటోకాల్ కూడా పాటించకుండా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట తెలుగుదేశం మాజీ ప్రజాప్రతినిధులు, ఇన్‌ఛార్జులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇన్ని ఒత్తిళ్లున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రైతురుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇతర అంశాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ఆందోళనలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలిచింది.
 
పార్లమెంట్‌లోనూ రైతువాణి
పార్లమెంట్‌లో కూడా రైతుల తరపున తమ వాణి వినిపించింది. జిల్లాలో శనగరైతు కుదేలయ్యాడు. జిల్లాలోని ప్రధాన పంటల్లో ఒకటైన శనగ పండించిన రైతు చేతికి వచ్చిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాడు. గత రెండేళ్లుగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో శనగలు గోడౌన్లలో మగ్గుతున్నాయి. రెండు సంవత్సరాలుగా రైతులు పండించిన పంటలో సగం పంట శీతల గిడ్డంగుల్లోనే మూలుగుతుంది.  దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ స్పందించలేదు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లోనూ, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఒత్తిడి చేయడంతో కేంద్రం నుంచి కదలిక ప్రారంభమయింది.  

ఆ తర్వాత వరుసగా  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామాధవ్‌సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు.  తర్వాత కూడా పలు అంశాలపై జిల్లా రైతులను వెంటపెట్టుకుని వెళ్లి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారు. జిల్లాకు మరో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడంతోపాటు రైల్వే సమస్యలపై పలుమార్లు స్పందించారు. డీఆర్‌ఎంతోనూ సంప్రదింపులు జరిపారు. దద్దవాడ గ్రామాన్ని దత్తత తీసుకున్న మొదటి ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి నిలిచారు.

ప్రజా సమస్యలపై ముందంజ
నాగార్జునసాగర్ కుడికాల్వ జోన్ -2 పరిధిలో జ్రిల్లాకు సాగునీరు  సక్రమంగా అందని అంశంపై కూడా ప్రజాప్రతినిధులు  స్పందించారు. జిల్లాలో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రతిచోటా ప్రజా సమస్యలపై తమ వాణి వినిపిస్తూ వస్తున్నారు.  జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు ఎన్‌ఎస్‌పీ అధికారులను నిలదీశారు. ఆ తర్వాత కూడా నీరు సక్రమంగా వచ్చే వరకూ, రైతులకు ఎరువులు అందేవరకూ ఆయా శాఖల మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు.  

14వ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తొలి ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి ప్రశ్న వైఎస్సార్ సీపీకి దక్కగా అది కూడా ప్రకాశం జిల్లాకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు దక్కింది. విత్తనాలను సరఫరా చేయడంలో  ప్రభుత్వ సన్నద్దత ఎంతని వ్యవసాయ శాఖ మంత్రిని నిలదీశారు.  ఆ తర్వాత వివిధ అంశాలపై శాసనసభ్యులు పోతుల రామారావు, జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులు అసెంబ్లీలో తమ వాణి వినిపించారు.

సమీక్షా సమావేశాన్ని విజయవంతం చేయూలి
గిద్దలూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నేడు, రేపు నిర్వహించనున్న సమీక్ష సమావేశాల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో పార్టీ పరిస్థితిని చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement