వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి లేళ్ల అప్పిరెడ్డి
తణుకు : రైతుల కోసం వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే దీక్ష టీడీపీ పతనానికి నాంది అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తణుకులో దీక్షాస్థలి వద్ద ఆయన మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఇలా దగాపడ్డ వారి తరఫున పోరాడటానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారన్నారు. రైతులు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలలో వారికి బాసటగా ఉండేందుకే తణుకును దీక్షాస్థలిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.
‘జగనన్నా.. మేమంతా మోసపోయాం.. మాకు నీ అండ కావాలన్నా’ అని రాష్ట్రంలో ఏప్రాంతానికెళ్లినా జగన్‌మోహన్‌రెడ్డి వెంట ప్రజలు నడచి వస్తున్నారన్నారు. చదువుకోండి ఉన్నతోద్యోగాలు అన్న చంద్రబాబు ఆ విషయాన్నే మర్చారన్నారు. చదువుకుంటే ఉద్యోగం మాట అలా ఉంచితే, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న బాబు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కూడా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రైతు దీక్షను విజయవంతం చేయాలనే సంకల్పంతో ప్రజలు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. దీక్షా ప్రాంగణం వద్ద కొబ్బరి కాయ కొట్టి శాస్త్రోక్తంగా పనులు ప్రారంభించారు. దీక్షను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్న నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి వంక రవీంద్ర, నియోజకవర్గ సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, కారుమూరి వెంకటనాగేశ్వరరావు శ్రేణులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.
రుణమాఫీ పూర్తిగా చేస్తానని కాణిపాకంలో ప్రమాణం చేస్తావా
చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నేత తలశిల సవాల్ తాడేపల్లిగూడెం : రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని కాణిపాకం వినాయకుని ఎదుట ప్రమాణం చేస్తావా బాబూ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో ప్రజలను బురిడి కొట్టించిన చంద్రబబాబు ఇటీవల చెబుతున్న కబుర్లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పవర్ ఉందని, తాకితే చాలు పుణ్యం వస్తుందన్నట్టుగా మాట్లాడుతున్న చంద్రబాబు అదే ఎన్టీఆర్ విగ్ర హాన్ని తాకితే పది కిలోమీటర్ల అవతల పడతారన్నారు. మామను వెన్నుపోటు పొడిచి ఆయనకు మానసిక ప్రశాంతత లేకుండా క్షోభకు గురిచేసిన చంద్రబాబు గురువింద మాదిరిగా ఎన్టీఆర్ బొమ్మను అడ్డంపెట్టుకుని నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి రైతుల పక్షాన, డ్వాక్రా మహిళల పక్షాన దీక్షలు చేసే అర్హత లేదన్న విధంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. రైతుకు ఏకష్టం వచ్చినా.. ముందుండే జగన్‌మోహన్‌రెడ్డికి కాకుండా దీక్షలు చేసే అర్హత, వారి బాధల గురించి మాట్లాడే అర్హత మరెవ్వరికుంటాయని ప్రశ్నించారు. పాలనను కార్పొరేటీకరణ చేసి, అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలి వ్యాపారం కోణంలో పాలన చేస్తున్న, ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మేలని ఆయన హితవు పలికారు.
నేడు తణుకులో బైక్ ర్యాలీ
తణుకు టౌన్ : తణుకులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని పెరవలి వైజంక్షన్ వద్దగల ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల నుంచి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గోవాలని కోరారు.
జగన్ దీక్ష.. టీడీపీ పతనానికి నాంది
Published Wed, Jan 28 2015 4:13 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement