సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణం గురించి ఆడిగిన విద్యార్థుల మీద రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పోలీసు బలగాన్ని ప్రయోగించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సీఎం చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. విద్యార్థుల ఒంటి మీద పడిన ప్రతి ఒక్క దెబ్బా రాష్ట్ర ప్రజల గుండెల మీద మీరు చేస్తున్న గాయమేనని దుయ్యబట్టారు.
విద్యార్థి నాయకుడు నాయక్ పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని, ఆయనకు వెంటనే ప్రభుత్వం మంచి వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మీరు.. మీ కేసుల కోసం, లంచాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి వేయడం వల్లే ఈ రోజు విద్యార్థులు, విపక్షాలు రోడ్డుకెక్కాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘గతంలో.. విద్యుత్ చార్జీలు తగ్గించండన్నందుకు బషీర్‌బాగ్‌లో ప్రజల గుండెల మీద కాల్పించారు.
ఇప్పుడు గ్రామగ్రామానా, ప్రతి జిల్లాలో మీరు, మీ పార్టనర్లూ చేసిన వందల వంచనల మీద ప్రజలు గర్జిస్తున్నారు. చేతలతో సమాధానమివ్వలేని మీరు వారందరికీ లాఠీలతో, తుపాకులతో సమాధానం ఇస్తారా? బాబు గారు ఇది దుర్మార్గం’ అని తూర్పారపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment