పూర్తిస్థాయి మంత్రి మండలే! | YS Jagan Mohan Reddy has been working hard to form his ministry | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయి మంత్రి మండలే!

Published Fri, Jun 7 2019 2:54 AM | Last Updated on Fri, Jun 7 2019 2:54 AM

YS Jagan Mohan Reddy has been working hard to form his ministry - Sakshi

సాక్షి, అమరావతి: సుపరిపాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గం ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో అఖండ విజయంతో రాజకీయ విప్లవం సృష్టించిన ఆయన పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఉద్యుక్తులయ్యారు. రాష్ట్రంలో నవయుగానికి నాంది పలుకుతూ పరిపాలన ప్రారంభించిన జగన్‌ తన మంత్రివర్గ ఏర్పాటులోనూ అదే పంథా అనుసరిస్తున్నారు.

‘మా ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయిస్తాం’’ అని ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ గర్జనలో జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తన మంత్రివర్గం ఏర్పాటు నుంచే శ్రీకారం చుట్టాలని ఆయన  నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు ఇవ్వాలని జగన్‌ సంకల్పించడం ద్వారా రాష్ట్రంలో సామాజిక విప్లవానికి పునాది పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

సుపరిపాలన... స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం
రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా ఒకేసారి పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని శనివారం ఏర్పాటు చేయనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. నూతన మంత్రివర్గం ఎలా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఓవైపు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన అందించేలా మంత్రివర్గం ఏర్పాటు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం, పార్టీ పటిష్టం దిశగా ప్రణాళికలు.. ఇలా ద్విముఖ వ్యూహంతో వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నారు.

రెండున్నరేళ్ల తరువాత కొందరు మంత్రులు పార్టీ సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైఎస్‌ జగన్‌ శుక్రవారం నిర్వహించనున్న వైఎస్సార్‌సీఎల్పీ సమావేశంలో పిలుపునిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తద్వారా పార్టీ పటిష్టతకు ప్రణాళికాబద్ధ విధానాన్ని అమలు చేస్తూ మరోవైపు మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నది జగన్‌ ఉద్దేశమని తెలుస్తోంది. సామాజికవర్గం, ప్రాంతీయ సమీకరణలకు సముచిత ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గ కూర్పు ఉండేలా ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పరిపాలనలో వేగాన్ని కొనసాగించేలా మంత్రివర్గం
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం తరువాత జగన్‌ మాట్లాడుతూ ఆరు నెలల నుంచి ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రజలకు మాటిచ్చారు. అందుకే అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. తొలి సంతకంతోనే పింఛన్ల పెంపు, అనంతరం ఆశా వర్కర్లకు జీతాల పెంపు తదితర సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ పరిపాలనను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చేసి, సమర్థులైన అధికారులతో తన జట్టును ఏర్పరచుకున్నారు. రైతు భరోసా పథకం అమలును ప్రకటించారు. పరిపాలనలో ఆయన వేగం, నిబద్ధత ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. అదే తీరును కొనసాగించే విధంగా తన మంత్రి మండలి ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు.

రాష్ట్రంలో ఇదే తొలిసారి..
రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన ముద్ర వేయనున్నారు. ఒకేసారి పూర్తిస్థాయి మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 25 మంది మంత్రులతో శనివారం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కానుండటం విశేషం. గత ముఖ్యమంత్రులు పలు దశల్లో తమ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇందుకు భిన్నంగా ఒకేసారి పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్‌ నిర్ణయానికొచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపులోనూ వైఎస్‌ జగన్‌ అదే రీతిలో వ్యవహరించారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి పార్టీ శ్రేణులు, ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి మండలి ఏర్పాటులోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తున్నారు. తద్వారా ఎలాంటి శషభిషలకు తావులేకుండా మంత్రి మండలి, యావత్‌ అధికార యంత్రాంగం సుపరిపాలన అందించడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి అక్ష్యంగా ఉంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన ప్రభుత్వ మంత్రి మండలి ఏర్పాటుతో రాష్ట్రంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులో మహిళలకూ పెద్దపీట వేయనున్నారు. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ మట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వాటా కేటాయిస్తామని ప్రకటించారు.

ఆ ప్రకటన కేవలం ఎన్నికల గిమ్మిక్కు కాదని, తాను త్రికరణశుద్ధితో అమలు చేస్తానని పార్టీ టిక్కెట్ల కేటాయింపు ద్వారా నిరూపించారు. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు కేటాయించడం అందరినీ ఆకట్టుకుంది. జగన్‌ చిత్తశుద్ధిని గుర్తించిన అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఎన్నికల్లో ఘన విజయాన్ని చేకూర్చారు. అదే స్ఫూర్తిని తమ పరిపానలలోనూ కొనసాగించాలని జగన్‌ సంకల్పించారు. మంత్రి మండలి ఏర్పాటులోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీటు వేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వనే లేదు.

ఎస్సీ, బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదు.కానీ, తన మంత్రి మండలిలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 12 మంది వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తదనంతరం  కూడా ప్రభుత్వ పరంగా వివిధ పదవుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి పైగా కేటాయించాలని జగన్‌ విధాన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం
మంత్రి మండలి ఏర్పాటులో సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం కచ్చితంగా పాటించాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. ఎస్సీ మాల, మాదిక సామాజిక వర్గాలు, బీసీ ఎమ్మెల్యేల నుంచి వివిధ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇతర సామాజిక వర్గాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రి మండలి కూర్పు ఉండేలా జగన్‌ కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాలూ వైఎస్సార్‌సీపీకి అఖండ మెజార్టీతో పట్టం కట్టాయి. అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా తన మంత్రి మండలి ఉండాలని జగన్‌ యోచిస్తున్నారు.

మంత్రి పదవుల కేటాయింపులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అక్కడి సామాజిక వర్గ సమీకరణలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు, ప్రకాశం–నెల్లూరు, రాయలసీమ జిల్లాలు యూనిట్‌గా మంత్రి మండలి కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజక వర్గాలను జిల్లాలుగా చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్లుగానే మంత్రివర్గం  ఏర్పాటులోనూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నది జగన్‌ ఉద్దేశమని తెలుస్తోంది.

సీనియర్లు, కొత్త నేతల మేలు కలయిక
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. పార్టీకి 7 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో గతంలో మంత్రులుగా పని చేసిన సీనియర్లు... రెండు నుంచి నాలుగు సార్లు గెలిచినవారు... మొదటి నుంచీ వైఎస్‌ జగన్‌ వెన్నంటి నిలిచినవారు... కొత్తగా పార్టీలో చేరి గుర్తింపు పొందిన వారు ... పార్టీ కోసం పనిచేసిన వారు... ఇలా అందరూ ఉన్నారు. ప్రజలు తన పరిపాలనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నందున మంత్రుల ఎంపికపై వైఎస్‌ జగన్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు, కొత్త నేతల మేలు కలయికగా మంత్రివర్గం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడం, అన్ని ప్రాంతాలకు తగిన గుర్తింపునివ్వడం ప్రాతిపదికగా మంత్రి మండలి ఏర్పాటు చేయాలన్నది జగన్‌ ఉద్దేశంగా ఉంది.

రెండున్నరేళ్ల తరువాత పునర్వ్యవస్థీకరణ
రాజ్యాంగ నిబంధన ప్రకారం అవకాశం ఉన్న మంత్రి పదవుల సంఖ్య కంటే వైఎస్సార్‌సీపీలో మంత్రి పదవులకు అర్హులు చాలా ఎక్కువ మంది ఉండటంతో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. సుపాలనను అందిస్తూ సుదీర్ఘకాలం రాష్ట్రంలో అధికారంలో కొనసాగాలని ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీని విజయపథంలో నడిపించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయన భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేస్తున్నట్లు సమాచారం.శుక్రవారం నిర్వహించనున్న పార్టీ శాసనసభా పక్ష సమావేశంలోనే ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా నియమితులయ్యేవారు పార్టీ సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని జగన్‌ పిలుపు ఇవ్వనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం 25 మందితో పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.

మంత్రులుగా అవకాశం రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించేలా వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెండున్నరేళ్ల తరువాత తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని జగన్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి పదవులు రాని వారికి అప్పుడు అవకాశం కల్పిస్తారు. అంతవరకు మంత్రులుగా చేసిన పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు.  

నేడు విజయవాడకు గవర్నర్‌
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శుక్రవారం సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు. శనివారం సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన అప్పలనాయుడుతో కూడా ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement