
అల్లిపురం (విశాఖ దక్షిణం) : ‘చిట్టి తల్లికి ఎంత కష్టమో’.. శీర్షికతో సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ఆదివారం వెలువడిన వార్తకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోను ఆదేశించారు. విశాఖ నగరం అల్లిపురంలోని గౌరీవీధిలో ఉంటున్న హేమలత (11) బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. తల్లిదండ్రులు అప్పలరాజు, అమ్మాజీ కూలీలు కావటంతో ఆమెకు అంతంతమాత్రం వైద్యం చేయించగలుగుతున్నారు. కాగా, ‘సాక్షి’ కథనంతో పలువురు దాతలు కూడా స్పందిస్తున్నారు. తమ అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నామని ఫోన్‌చేసి చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చర్యలు
మరోవైపు.. సీఎం ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో బాలికను తీసుకుని తక్షణమే ఆస్పత్రికి రావాలని ఆస్పత్రి యాజమాన్యం సమాచారమిచ్చింది. బాలికకు అవసరమైన వైద్యం, మందులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేస్తామని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు సీఎం జగన్‌కు, ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.