allipuram
-
తల్లిని వేధించిన వ్యక్తిని చంపిన తనయుడు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తన తల్లిని వ్యంగ్యంగా మాట్లాడి వేధించడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు. మృతదేహాన్ని తీసుకొచ్చి తన తల్లి కాళ్ల ముందు పడేశాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని అల్లిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం ప్రాంతానికి చెందిన గొంతిన శ్రీను(45) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. పనులకు ఎవరు పిలిస్తే వారితో వెళ్తాడు. ఇందుకోసం రోజూ అల్లిపురం మెయిన్ రోడ్డులో గల ఎలైట్ ఇన్ లాడ్జీ జంక్షన్ వద్ద కూర్చుంటాడు. యథావిధిగా ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీను ఎలైట్ ఇన్ లాడ్జీ జంక్షన్‌కు చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన గౌరీ అనే మహిళ పాచిపనుల కోసం అటుగా వెళ్తోంది. ఆమెతో శ్రీను వ్యంగ్యంగా మాట్లాడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. గౌరీ ఈ విషయాన్ని తన కుమారుడు ప్రసాద్‌కు ఫోన్ చేసి చెప్పింది. ప్రసాద్ వెంటనే అక్కడకు చేరుకుని ‘నా తల్లిని అవమానిస్తావా..’ అంటూ శ్రీనును ఇటుకతో కొట్టాడు. పరుగులు తీస్తున్న శ్రీనుని వెంటాడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. శ్రీను చనిపోయిన తర్వాత నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. ఆవేశంతో కాళ్లతో కసిగా తన్ని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తల్లీకొడుకులు పరారయ్యారు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దాని ఆధారంగా సీతంపేట గుడి వద్ద సాయంత్రం తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. -
ద్రాక్ష గుత్తులే ఆ షాపుకు అలంకరణ
-
మద్యం మత్తులో రియల్ ఎస్టేట్ ఉద్యోగి దారుణ హత్య
సాక్షి,అల్లిపురం (విశాఖ దక్షిణ): రియల్ ఎస్టేట్ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య స్వల్వ వాగ్వాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రెడ్డి గోపాలకృష్ణ (26) తిరుమల రియల్ ఎస్టేట్ సంస్థలో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బీచ్‌రోడ్డులో గోకుల్‌పార్కు ఎదురుగా గల ప్రతిమ ప్యారడైజ్ అపార్టుమెంట్లో మరో ఇంజినీర్‌తో కలిసి ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం భవాని హోటల్ యజమాని బ్రహ్మయ్య చౌదరి, మరో ఇద్దరితో కలిసి అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఐదుగురు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో తన ప్లాట్‌కు మద్యం తాగి రావొద్దని గతంలో బ్రహ్మయ్య చౌదరితో గోపాలకృష్ణ అన్న మాటలు ప్రస్తావనకు వచ్చి వాగ్వాదం చోటుచేసుకుంది. స్నేహితులు వారించే ప్రయత్నం చేసినా వారు వినుకోలేదు. మద్యం మత్తులో ఉన్న బ్రహ్మయ్య చౌదరి వంటగదిలో ఉన్న చాకు తీసుకువచ్చి గోపాలకృష్ణ కడుపు భాగంలో పొడిచేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బ్రహ్మయ్యచౌదరి అక్కడ నుంచి పరారయ్యాడు. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రాత్రి 7.30 గంటలకు మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, ఎస్ఐ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకుని పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటున్న అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. బ్రహ్మయ్యచౌదరితో వచ్చిన ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అల్లిపురం అష్టదిగ్బంధం
నాలుగు వార్డులు.. వేలాది ఇళ్లు.. వాటిని కవర్ చేసేందుకు 141 సర్వే బృందాలు.. వందలాది పారిశుధ్య సిబ్బంది.. తోడుగా పోలీసులు, ఇతర అధికారులు.. వారంతా తెల్లవారుజామునే ఆ ప్రాంతాన్ని ముట్టడించారు.. దిగ్బంధించారు.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఆ ప్రాంతం.. నగరంలోని అల్లిపురం.. దాన్ని చుట్టుముట్టడానికి, జల్లెడ పట్టడానికి కారణం.. ఒకే ఒక్క కేసు.. అదే కరోనా పాజిటివ్.. అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గురువారం రాత్రి తేలడంతో.. అల్లిపురంతోపాటు మొత్తం విశాఖ నగరం ఉలిక్కిపడింది. కలవరపాటుకు గురైంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.. శుక్రవారం తెల్లవారుజామునే అల్లిపురం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో రహదారులను దిగ్బంధించింది. వార్డు వాలంటీర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో కూడిన 141 బృందాలను 28, 32, 33, 34 వార్డుల పరిధిలోని ప్రతి ఇంటినీ జల్లెడ పట్టించింది. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించింది. బాధిత రోగి కుటుంబానికి చెందిన 11 మందిని విమ్స్, ఛాతీ ఆస్పత్రుల్లోని క్వారంటైన్ వార్డులకు తరలించారు. అన్ని వీధుల్లోనూ ముమ్మర శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు నగరానికి కరోనా గ్రహణం పట్టింది. సాధారణంగా గ్రహణ సమయాల్లో అన్నీ మూసివేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. నగరంలో కరోనా కాలం నడుస్తోంది. మహమ్మారి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు చేపడుతున్న ముందస్తు చర్యలతో సమస్తం బంద్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింహాచలం సహా ప్రముఖ ఆలయాలన్నింటినీ మూసివేశారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మ్యూజియాలు, జూపార్క్.. ఇలా జనసమ్మర్థం ఉండే సంస్థలన్నింటినీ మూసివేయించారు. విదేశాల నుంచి నగరానికి వచ్చిన 1100 మంది ఆరోగ్యంపై నిఘా పెట్టి.. సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. విమ్స్‌లో ఒక్క కార్వంటైన్ విభాగం మినహా మిగిలిన అన్ని వైద్య విభాగాలను మూసివేశారు. అల్లిపురం(విశాఖ దక్షిణ): కరోనా పాజిటివ్ కేసు బయటపడిన అల్లిపురం పరిసరాలు అష్ట దిగ్బంధమయ్యాయి. అధికారగణం అప్రమత్తమైంది. శుక్రవారం ఉదయం 5 గంటలకే అల్లిపురం వివేకానంద కాలనీలో పరిశుభ్రతా చర్యలు ప్రారంభించారు. రసాయనాలు స్ప్రే చేశారు. బ్లీచింగ్ చల్లారు. బాధితుడు నివాసం ఉంటున్న ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, వలంటీర్లు ఈ చర్యల్లో పాల్గొన్నారు. జీవీఎంసీ ప్రధాన వైద్యా«ధికారి శాస్త్రి దగ్గరుండి రక్షణ చర్యలను పర్యవేక్షించారు. రాకపోకలు సాగించే దారులన్నీ దిగ్బంధం చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. రాకపోకలు బంద్... ►కరోనా కలకలంతో అల్లిపురంలో రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ►డాబాగార్డెన్స్ ఆర్ఆర్ గ్రాండ్ హోటల్ వద్ద స్టాపర్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. ►చావులమదుం హరితాలాడ్జి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ►లీలామహల్ రోడ్డులో ఎంజీఎం హైసూ్కల్, నీలమ్మవేపచెట్టుకు రహదారి మూసివేశారు. ►కొబ్బరితోట సమీపంలోని రామకృష్ణ మార్కెట్ జంక్షన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ►32,33,34 వార్డులలోప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లు కదలలేదు. ►వీధులన్నీ కర్ఫ్యూని తలపించాయి. ►చాలా మంది తాజా సమాచారం కోసం ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయారు. భయం వద్దు... పరిశుభ్రతే మందు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచే అధికారులు 32,33,34 వార్డుల్లో అవగాహన చర్యలు ప్రారంభించారు. ప్రజలు భయపడొద్దని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. మైకుల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జాగ్రత్తలివే... ►ప్రతి ఐదు నిమిషాలకు సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి. ►బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు శుభ్రం చేసుకోవాలి. ►వీలైతే బట్టలు మార్చుకోవాలి. ►మాస్క్‌లు ధరించాలి. ►టిష్యూ పేపర్‌ను వినియోగించిన తరువాత మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి. ►గుంపులుగా సంచరిచొద్దు. ►మనిషికి మనిషికీ మధ్య మీటరు దూరం పాటించాలి. ►అవసరమైతే తప్ప ఇళ్లు కదలొద్దు. మదీనా టు విశాఖ వయా హైదరాబాద్ మార్చి 10: మదీనా నుంచి హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంటికి చేరుకున్న బాధితుడు మార్చి 11: రైలులో హైదరాబాద్ నుంచి నగరానికి ప్రయాణం మార్చి 12: మధ్యాహ్నం 1.30కు నగరంలోని రైల్వే స్టేషన్‌కు చేరిక.. అక్కడ్నుంచి నేరుగా అల్లిపురం వివేకానందకాలనీలోని నివాసానికి వెళ్లారు. మార్చి 14: అనారోగ్యం, దగ్గు, జ్వరం రావడంతో ఆటోలో ఎన్ఏడీ జంక్షన్‌లోని సురక్ష ఆస్పత్రికి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ఆస్పత్రి నుంచి ఆటోలో ఇంటికి వెళ్లారు. మార్చి 17: ఉదయం 11 గంటలకు ఎన్ఏడీలోని సురక్ష ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉండడంతో టీబీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి నమూనాలు తిరుపతి ల్యాబ్‌కు పంపారు. మార్చి 19: రాత్రి 9 గంటల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులకు సమాచారం అందింది. మార్చి 20: అధికారగణం అప్రమత్తమైంది. ఉదయం 5 గంటల నుంచి బాధితుడి నివాస పరిసరాల్లో స్క్రీనింగ్ చర్యలకు ఉపక్రమించింది. 147 కేసుల్లో ఒకటే పాజిటివ్ విశాఖపట్నం: జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన కరోనా అనుమానిత కేసుల్లో ఒక్కటే పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో 147 మందిని పరిశీలనలో ఉంచారు. వారిలో 84 మందికి 28 రోజుల క్వారంటైన్ సమయం ముగిసిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు. మిగిలిన వారిలో 53 మంది వారి ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. 10 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు మొత్తంగా 31 మంది నమూనాలు తీసి పరీక్షలకు పంపించగా.. ఒకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 26 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. మిగిలిన నలుగురి రిపోర్టులు రావాల్సి ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు. -
ఆ చిట్టితల్లికి వైద్యం అందించండి
అల్లిపురం (విశాఖ దక్షిణం) : ‘చిట్టి తల్లికి ఎంత కష్టమో’.. శీర్షికతో సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ఆదివారం వెలువడిన వార్తకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోను ఆదేశించారు. విశాఖ నగరం అల్లిపురంలోని గౌరీవీధిలో ఉంటున్న హేమలత (11) బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. తల్లిదండ్రులు అప్పలరాజు, అమ్మాజీ కూలీలు కావటంతో ఆమెకు అంతంతమాత్రం వైద్యం చేయించగలుగుతున్నారు. కాగా, ‘సాక్షి’ కథనంతో పలువురు దాతలు కూడా స్పందిస్తున్నారు. తమ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని ఫోన్‌చేసి చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చర్యలు మరోవైపు.. సీఎం ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో బాలికను తీసుకుని తక్షణమే ఆస్పత్రికి రావాలని ఆస్పత్రి యాజమాన్యం సమాచారమిచ్చింది. బాలికకు అవసరమైన వైద్యం, మందులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేస్తామని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు సీఎం జగన్‌కు, ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
పుస్తకాలు, పెన్సిల్స్ దొంగిలిస్తున్నాడని..
అల్లిపురం (విశాఖ దక్షిణం): పిల్లలు తప్పు చేస్తే నయానో, భయానో దారికి తెచ్చుకోవాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించి వాతలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి విషయం తెలియటంతో తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి, ప్లిలలకు వైద్యం అందజేస్తున్నారు. వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం చినముషిడివాడ హైస్కూలులో గాయత్రి 4వ తరగతి, వరుణ్‌కుమార్ 3వ తరగతి చదువుతున్నారు. వరుణ్‌కుమార్ తోటి పిల్లల పుస్తకాలు, పెన్సిల్స్ దొంగిలిస్తున్నాడని పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో అతని తల్లి అట్లకాడతో వాతలు పెట్టింది. తమ్ముడు తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావని గాయత్రికి కూడా కాళ్లపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పిల్లలను పరామర్శించేందుకు బుధవారం స్కూల్‌కు వెళ్లారు. వారు స్కూలుకు రాలేదని టీచర్ చెప్పడంతో ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి తల్లిని, పిల్లలను కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలిద్దరికీ పారా మెడికల్ వార్డులో వైద్యం అందించారు. స్కిన్ డాక్టర్ సూచన మేరకు పిల్లల వార్డులో చేర్పించి వైద్యం అందజేస్తున్నారు. -
'కౌన్ బనేగా కరోడ్‌పతి' పేరిట మోసం
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ) : కౌన్ బనేగా కరోడ్‌పతి పేరిట రూ.2.26లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేసిన ఘటనపై బుధవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సీఐ వి.గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలో రామలక్ష్మీ కాలనీకి చెందిన జె.దేవి అనే యువతికి జూన్ 5వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆమెతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను కౌన్ బనేగా కరోడ్‌పతి, ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను.మీరు కౌన్ బనేగా కరోడ్‌పతిలో లక్కీ లాటరీ ద్వారా రూ.25లక్షలు గెలుపొందారని, మీ లాటరీ నంబరు 8991 అని, మీ డిటెయిల్స్ వాట్సప్ చేయమని కోరాడు. ఈ మేరకు బాధితురాలు తన వివరాలను వాట్సప్ చేసింది. దీంతో ఈ లక్కీడ్రాలో మీతో పాటు 44 మంది ఉన్నారని, మీకు బహుమతిగా వచ్చిన మొత్తం క్లెయిమ్ చేసుకోవడానికి జీఎస్టీ కట్టాలని, టాక్స్ క్లెయిమ్ చేయాలని, ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి విడతల వారీగా రూ.2.26లక్షలు అతని అకౌంట్లో బాధితురాలితో వేయించుకున్నాడు. తరువాత కూడా మరికొంత సొమ్ము కావాలని డిమాండ్ చేయడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె బుధవారం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వి.గోపినాథ్ తెలిపారు. -
ఖమ్మంలో కారం బస్తాల కలకలం
ఖమ్మం: ఖమ్మంలోని అల్లిపురం కాలువ కట్టపై కారం బస్తాల కలకలం రేగింది. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సుమారు వెయ్యి కారం బస్తాలు కాలువ కట్టపై పడేసి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారం బస్తాలు కల్తీ కారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
భౌపెడుతున్నాయి
అల్లిపురం: కుక్కలు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సౌత్జైలురోడ్డులో విధులకు వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేశాయి. స్థానికులు స్పందించి అతనిని కేజీహెచ్‌కు తరలించారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను కాలువల్లో పడేయటంతో వాటి కోసం కుక్కలు ఎగబడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీద నడవలేకున్నాం.. ఎక్కడ పడితే ఆక్కడ కుక్కలు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాయి. చాలా భయంగా ఉంది. జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. –పిల్లా జగదీశ్వరరావు, బాధితుడు, అమ్మవారివీధి -
'కౌన్ బనేగా..' పేరుతో మోసం
అల్లీపురం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎమ్మెస్సీ విద్యార్థినిని 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం పేరుతో మోసగించిన నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ చక్రవర్తి కొన్ని రోజుల క్రితం ఆంధ్రా వర్సిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని ఇంద్రజకు ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నామని.. ప్రైజ్ మనీ వచ్చిందని, దాన్ని పంపేందుకు అవసరమైన డీడీ, రవాణా చార్జీలు చెల్లించాలని కోరాడు. అయితే అది నమ్మి ఇంద్రజ కొంత మొత్తంలో నగదును అతడికి పంపింది. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కోల్‌కతాలో దాగున్న ప్రదీప్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. -
లాటరీ పేరిట రూ.12 లక్షల దోపిడీ
అల్లీపురం (విశాఖపట్నం) : లాటరీ పేరిట ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి నుంచి రూ.12 లక్షల మేర దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోస్ట్‌గార్డ్‌లోని స్లీప్ మెయిల్లో పనిచేసే బుద్ధా వెంకట శివ సంతోష్‌కు రూ.40 లక్షల లాటరీ వచ్చిందని కోల్‌కతాకు చెందిన ఉదయ్‌కుమర్ గుప్తా అనే వ్యక్తి నమ్మించాడు. అయితే ఆ మొత్తం పంపించేందుకు పన్నులు, అదీ, ఇదీ అంటూ రూ.12 లక్షలు రాబట్టడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కోల్‌కతాకు వెళ్లి ఉదయ్‌కుమార్ గుప్తాను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. -
హత్య కేసులో నలుగురి అరెస్ట్
అల్లిపురం (విశాఖ) : గతంలో నమోదైన అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం విశాఖ నగరంలోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 9వ తేదీన మద్దివానిపాలెం గ్రామం సమీపంలో ఒక యువకుడు మృతి చెందగా, పోలీసులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. యువకుడి హత్య జరిగినట్లుగా గుర్తించారు. ఈ హత్య కేసులో బబ్లూకుమార్, ఉమేష్, కిషోర్‌కుమార్, అమిత్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బబ్లూకుమార్ అనే వ్యక్తికి ఒడిశాకు చెందిన క్రిమెంట్ ఎక్క రూ. 30వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వాలని క్రిమెంట్ ఎక్క బబ్లూకుమార్ను నిలదీశాడు. దీంతో మిగిలిన ముగ్గురు స్నేహితుల సహాయంతో క్రిమెంట్ ఎక్క అడ్డు తొలగించుకున్నానని పోలీసులు విచారణలో బబ్లూకుమార్ ఒప్పుకున్నాడు. -
కుటుంబం అదృశ్యంపై దర్యాప్తు
⇒ చనిపోయేందుకు వెళ్తున్నట్టు లేఖ ⇒ పెళ్లికి వచ్చి కనిపించని అక్కాచెల్లెళ్లు ⇒ తల్లిదండ్రులు, బిడ్డలతో కలిసి అదృశ్యం ⇒ కన్నీరు మున్నీరవుతున్న భర్తలు ⇒ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అల్లిపురం: అప్పుల బాధ భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ లేఖ రాసిన ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గుత్తు కృష్ణమూర్తి, వెంకటలక్ష్మి దంపతులు టౌన్ కొత్తరోడ్డులోని తుమ్మలపల్లి వారి వీధిలో నివసిస్తున్నారు.వీరికి సంతోష్‌లక్ష్మి, రాజ్యలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దమ్మాయి సంతోష్లక్ష్మిని విశాఖ జిల్లా ఎస్.రాయవరానికి చెందిన పడమట వెంకట్రావుతో వివాహం చేశారు. ఈమెకు మోనిక (6), దక్షిత అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. రెండో అమ్మాయిని ఎన్‌ఏడీకి చెందిన ఆటో డ్రయివర్ బండారు నాగరాజుతో వివాహం జరిపించారు. వీరికి 8 నెలల కుమారుడు చరణ్మూర్తి ఉన్నాడు. పుట్టింటికి వెళ్లి మాయం ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్ కన్యకాపరమేశ్వరి కల్యాణమండపంలో బంధువుల పెళ్ళికని ఇద్దరు ఆడపిల్లలు తమ భర్తలతో సహా వచ్చారు. పెళ్లి భోజనాల తరువాత ఇద్దరు అల్లుళ్లు వారి ఇళ్ళకు వెళ్లిపోయారు. అక్కాచెల్లెళ్లు సంతోష్‌లక్ష్మి, రాజ్యలక్ష్మి ఇద్దరు కలసి కన్నవారింటికి పిల్లలను తీసుకెళ్లారు. 7వ తేదీన ఇద్దరు అల్లుళ్లు భార్యలకు ఫోన్లు చేయగా అవి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దీంతో వారిద్దరు కొత్తరోడ్డులో అత్తింటివారు నివసిస్తున్న ఇంటికి వచ్చి చూడగా తలుపులకు తాళాలు వేసి ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా వారి ఆచూకి తెలియలేదు. తిరిగి అనుమానం వచ్చిన వారు 10వ తేదీ ఉదయం వచ్చి వీధిలో అందరినీ వాకబు చే సారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించటంతో కిటికీ వద్ద ఒక లేఖ దొరికింది. ‘అప్పులు ఎక్కువగా ఉండటంతో అంతా కలసి ఇల్లు వదిలి చనిపోయేందుకు వెళ్లిపోతున్నాం’ అని రాసి ఉంది. దీంతో అల్లుళ్లు వెంకట్రావు, నాగరాజులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు బృందాల గాలింపు కేసు నమోదు చేసిన పోలీసులు పరవాడ, వాడ చీపురుపల్లితో పాటు నగరంలో పలు ప్రాంతాలకు బృందాలను పంపించారు. వారితో పాటు వెంకటరావు, నాగ రాజులు కూడా తమ కుటుంబ సభ్యులకోసం తీవ్రంగా వెదుకుతున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లు ఫోన్ నంబర్లు 9440796019, 0891-2563632, 8121013250కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
పురందేశ్వరి ఫిరాయింపు సిగ్గుచేటు
అల్లిపురం : కేంద్రంలో మంత్రి పదవి అనుభవించిన పురందేశ్వరి పార్టీకి రాజీనామా చేసి మతతత్వ పార్టీలోకి మారడం సిగ్గుచేటని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పురందేశ్వరి పార్టీ ఫిరాయించడంతో మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గంటా శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ పదవుల కోసం ఎన్ని పార్టీలైనా ఫిరాయిస్తారని విమర్శించారు. ఇలాంటి ఫిరాయింపుదారులను ప్రజలు, పార్టీల కార్యకర్తలు తరిమికొట్టే రోజు వస్తుందని చెప్పారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించినపుడే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. మహిళల ప్రగతికి దోహదం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు విజయారెడ్డి, ప్రభాగౌడ్, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పార్కింగ్ స్థలంలో నిర్మాణాలపై ఆందోళన
అల్లిపురం, న్యూస్‌లైన్ : జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్లో పార్కింగ్ స్థలాన్ని యథాతధంగా ఉంచాలని హోల్‌సేల్ విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, కొణతాల వీర్రాజు డిమాండ్ చేశారు. కమిషనర్ శివధర్‌రెడ్డికి సమస్యను విన్నవించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వర్తకులు శనివారం పోలీసు కమిషనరేట్‌కు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కొంతసేపు గేటు ముందు ఆందోళన చేశారు. మహారాణిపేట జోన్ సీఐ ఆర్.మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యాపారులను కమిషనర్ వద్దకు తీసుకువెళ్లారు. షాపుల నిర్మాణంపై హై కోర్టులో స్టే ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతున్నారని వారు కమిషనర్‌కు తెలిపారు. పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలకటమే కాకుండా దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హోల్‌సేల్ మార్కెట్ బంద్ చేశామని, తమకు న్యాయం జరిగే వరకు మార్కెట్ తెరిచేది లేదని స్పష్టం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి, న్యాయవాది కొనతాల ప్రతాప్, పొలమర శెట్టి వెంకట సత్యనారాయణ, కోరిబిల్లి ప్రసాద్, పి.సత్తిబాబు, ఎం.రామకృష్ణ, ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు ఉన్నారు.