తల్లిని వేధించిన వ్యక్తిని చంపిన తనయుడు | Son who killed man who harassed his mother At Visakhapatnam | Sakshi
Sakshi News home page

తల్లిని వేధించిన వ్యక్తిని చంపిన తనయుడు

Aug 29 2022 5:00 AM | Updated on Aug 29 2022 5:01 AM

Son who killed man who harassed his mother At Visakhapatnam - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): తన తల్లిని వ్యంగ్యంగా మాట్లాడి వేధించడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు. మృతదేహాన్ని తీసుకొచ్చి తన తల్లి కాళ్ల ముందు పడేశాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని అల్లిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం ప్రాంతానికి చెందిన గొంతిన శ్రీను(45) పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది.

పనులకు ఎవరు పిలిస్తే వారితో వెళ్తాడు. ఇందుకోసం రోజూ అల్లిపురం మెయిన్‌ రోడ్డులో గల ఎలైట్‌ ఇన్‌ లాడ్జీ జంక్షన్‌ వద్ద కూర్చుంటాడు. యథావిధిగా ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీను ఎలైట్‌ ఇన్‌ లాడ్జీ జంక్షన్‌కు చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన గౌరీ అనే మహిళ పాచిపనుల కోసం అటుగా వెళ్తోంది. ఆమెతో శ్రీను వ్యంగ్యంగా మాట్లాడి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. గౌరీ ఈ విషయాన్ని తన కుమారుడు ప్రసాద్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. ప్రసాద్‌ వెంటనే అక్కడకు చేరుకుని ‘నా తల్లిని అవమానిస్తావా..’ అంటూ శ్రీనును ఇటుకతో కొట్టాడు. పరుగులు తీస్తున్న శ్రీనుని వెంటాడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. శ్రీను చనిపోయిన తర్వాత నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు.

ఆవేశంతో కాళ్లతో కసిగా తన్ని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తల్లీకొడుకులు పరారయ్యారు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దాని ఆధారంగా సీతంపేట గుడి వద్ద సాయంత్రం  తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement