వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో నిర్మానుష్యంగా మారిన అల్లిపురం ప్రధాన రోడ్డు(ఇన్‌సెట్)లో బాధితుడి నివాసం సమీపంలో బ్లీచింగ్ చల్లుతున్న దృశ్యం
నాలుగు వార్డులు.. వేలాది ఇళ్లు.. వాటిని కవర్ చేసేందుకు 141 సర్వే బృందాలు.. వందలాది పారిశుధ్య సిబ్బంది.. తోడుగా పోలీసులు, ఇతర అధికారులు.. వారంతా తెల్లవారుజామునే ఆ ప్రాంతాన్ని ముట్టడించారు.. దిగ్బంధించారు.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఆ ప్రాంతం.. నగరంలోని అల్లిపురం.. దాన్ని చుట్టుముట్టడానికి, జల్లెడ పట్టడానికి కారణం.. ఒకే ఒక్క కేసు.. అదే కరోనా పాజిటివ్.. అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గురువారం రాత్రి తేలడంతో.. అల్లిపురంతోపాటు మొత్తం విశాఖ నగరం ఉలిక్కిపడింది. కలవరపాటుకు గురైంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది.. శుక్రవారం తెల్లవారుజామునే అల్లిపురం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో రహదారులను దిగ్బంధించింది. వార్డు వాలంటీర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో కూడిన 141 బృందాలను 28, 32, 33, 34 వార్డుల పరిధిలోని ప్రతి ఇంటినీ జల్లెడ పట్టించింది. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించింది. బాధిత రోగి కుటుంబానికి చెందిన 11 మందిని విమ్స్, ఛాతీ ఆస్పత్రుల్లోని క్వారంటైన్ వార్డులకు తరలించారు.
అన్ని వీధుల్లోనూ ముమ్మర శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు నగరానికి కరోనా గ్రహణం పట్టింది. సాధారణంగా గ్రహణ సమయాల్లో అన్నీ మూసివేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. నగరంలో కరోనా కాలం నడుస్తోంది. మహమ్మారి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు చేపడుతున్న ముందస్తు చర్యలతో సమస్తం బంద్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింహాచలం సహా ప్రముఖ ఆలయాలన్నింటినీ మూసివేశారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మ్యూజియాలు, జూపార్క్.. ఇలా జనసమ్మర్థం ఉండే సంస్థలన్నింటినీ మూసివేయించారు. విదేశాల నుంచి నగరానికి వచ్చిన 1100 మంది ఆరోగ్యంపై నిఘా పెట్టి.. సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. విమ్స్‌లో ఒక్క కార్వంటైన్ విభాగం మినహా మిగిలిన అన్ని వైద్య విభాగాలను మూసివేశారు.
అల్లిపురం(విశాఖ దక్షిణ): కరోనా పాజిటివ్ కేసు బయటపడిన అల్లిపురం పరిసరాలు అష్ట దిగ్బంధమయ్యాయి. అధికారగణం అప్రమత్తమైంది. శుక్రవారం ఉదయం 5 గంటలకే అల్లిపురం వివేకానంద కాలనీలో పరిశుభ్రతా చర్యలు ప్రారంభించారు. రసాయనాలు స్ప్రే చేశారు. బ్లీచింగ్ చల్లారు. బాధితుడు నివాసం ఉంటున్న ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, వలంటీర్లు ఈ చర్యల్లో పాల్గొన్నారు. జీవీఎంసీ ప్రధాన వైద్యా«ధికారి శాస్త్రి దగ్గరుండి రక్షణ చర్యలను పర్యవేక్షించారు. రాకపోకలు సాగించే దారులన్నీ దిగ్బంధం చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.
రాకపోకలు బంద్...
►కరోనా కలకలంతో అల్లిపురంలో రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.
►డాబాగార్డెన్స్ ఆర్‌ఆర్ గ్రాండ్ హోటల్ వద్ద స్టాపర్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు.
►చావులమదుం హరితాలాడ్జి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
►లీలామహల్ రోడ్డులో ఎంజీఎం హైసూ్కల్, నీలమ్మవేపచెట్టుకు రహదారి మూసివేశారు.
►కొబ్బరితోట సమీపంలోని రామకృష్ణ మార్కెట్ జంక్షన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.
►32,33,34 వార్డులలోప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లు కదలలేదు.
►వీధులన్నీ కర్ఫ్యూని తలపించాయి.
►చాలా మంది తాజా సమాచారం కోసం ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయారు.
భయం వద్దు... పరిశుభ్రతే మందు
శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచే అధికారులు 32,33,34 వార్డుల్లో అవగాహన చర్యలు ప్రారంభించారు. ప్రజలు భయపడొద్దని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. మైకుల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
జాగ్రత్తలివే...
►ప్రతి ఐదు నిమిషాలకు సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి.
►బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు శుభ్రం చేసుకోవాలి.
►వీలైతే బట్టలు మార్చుకోవాలి.
►మాస్క్‌లు ధరించాలి.
►టిష్యూ పేపర్‌ను వినియోగించిన తరువాత మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి.
►గుంపులుగా సంచరిచొద్దు.
►మనిషికి మనిషికీ మధ్య మీటరు దూరం పాటించాలి.
►అవసరమైతే తప్ప ఇళ్లు కదలొద్దు.
మదీనా టు విశాఖ వయా హైదరాబాద్
మార్చి 10: మదీనా నుంచి హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంటికి చేరుకున్న బాధితుడు
మార్చి 11: రైలులో హైదరాబాద్ నుంచి నగరానికి ప్రయాణం
మార్చి 12: మధ్యాహ్నం 1.30కు నగరంలోని రైల్వే స్టేషన్‌కు చేరిక.. అక్కడ్నుంచి నేరుగా అల్లిపురం వివేకానందకాలనీలోని నివాసానికి వెళ్లారు.
మార్చి 14: అనారోగ్యం, దగ్గు, జ్వరం రావడంతో ఆటోలో ఎన్‌ఏడీ జంక్షన్‌లోని సురక్ష ఆస్పత్రికి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ఆస్పత్రి నుంచి ఆటోలో ఇంటికి వెళ్లారు.
మార్చి 17: ఉదయం 11 గంటలకు ఎన్‌ఏడీలోని సురక్ష ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉండడంతో టీబీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ్నుంచి నమూనాలు తిరుపతి ల్యాబ్‌కు పంపారు.
మార్చి 19: రాత్రి 9 గంటల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులకు సమాచారం అందింది.
మార్చి 20: అధికారగణం అప్రమత్తమైంది. ఉదయం 5 గంటల నుంచి బాధితుడి నివాస పరిసరాల్లో స్క్రీనింగ్ చర్యలకు ఉపక్రమించింది.
147 కేసుల్లో ఒకటే పాజిటివ్
విశాఖపట్నం: జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన కరోనా అనుమానిత కేసుల్లో ఒక్కటే పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో 147 మందిని పరిశీలనలో ఉంచారు. వారిలో 84 మందికి 28 రోజుల క్వారంటైన్ సమయం ముగిసిందని వైద్యాధికారులు స్పష్టం చేశారు. మిగిలిన వారిలో 53 మంది వారి ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. 10 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు మొత్తంగా 31 మంది నమూనాలు తీసి పరీక్షలకు పంపించగా.. ఒకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 26 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. మిగిలిన నలుగురి రిపోర్టులు రావాల్సి ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment