‘మోడల్‌’కు మహర్దశ | YS Jagan Mohan Reddy Makeover Decision on Model Schools | Sakshi
Sakshi News home page

‘మోడల్‌’కు మహర్దశ

Published Thu, Sep 12 2019 12:00 PM | Last Updated on Thu, Sep 12 2019 12:00 PM

YS Jagan Mohan Reddy Makeover Decision on Model Schools - Sakshi

వెల్దుర్తి మండలంలోని ఏపీ మోడల్‌ మోడల్‌ స్కూల్‌ (ఫైల్‌)

గుంటూరు ఎడ్యుకేషన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రవేశపెట్టిన మోడల్‌ స్కూళ్లకు మహర్దశ పట్టనుంది. పాఠశాల విద్యతో సంబంధం లేకుండా ప్రత్యేక సొసైటీ ద్వారా నిర్వహిస్తూ వచ్చిన మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిచాలనే ఆశయంతో మహానేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కార్యాచరణకు రూపాంతరంగా వీటిని 2013లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ విద్యాబోధన అందించేందుకు ఉద్దేశించిన మోడల్‌ స్కూళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన లభించడంతో పాటు ప్రతి ఏటా సీట్లను భర్తీ చేయడంలో డిమాండ్‌ నెలకొంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా 165 మోడల్‌ స్కూళ్లు ఉండగా, జిల్లాలో 14 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు 13 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీ), ఆరుగురు ట్రైనీ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ) పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 2,113 రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, అదనంగా మంజూరు చేసిన 990 పోస్టుల్ని ప్రభుత్వం డీఎస్సీ–2018 ద్వారా భర్తీ చేయనుంది.  జిల్లావ్యాప్తంగా ఉన్న 14 మోడల్‌ స్కూళ్లకు గానూ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ విధంగా ఒక్కో పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ 700 మంది చొప్పున విద్యార్థులు చదువుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులకు హాస్టల్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

వివక్ష చూపిన టీడీపీ ప్రభుత్వం
మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులపై టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించిన ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ ఉద్యోగోన్నతులు, సాధారణ బదిలీలు వర్తింప చేయలేదు. కారుణ్య నియామకాలు, హెల్త్‌కార్డులతో పాటు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వంటి సదుపాయాలు వీరికి లేవు. దీంతో పాటు ఐఆర్‌ సైతం అమలుకు నోచుకోలేదు. విద్యాశాఖలో ఉద్యోగులుగా ఉన్నప్పటికీ వేతనం మినహా ఇతర ఎటువంటి ప్రయోజనాలు లేకుండా కాలం వెళ్లదీస్తున్న మోడల్‌ స్కూళ్ల టీచర్లు, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత టీడీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న పరిస్థితులు లేవు. రాష్ట్రస్థాయిలో ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోయింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రారంభించిన మోడల్‌ స్కూళ్లకు తొలి రెండేళ్లు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లభించగా, తరువాత కేంద్రం వీటి నిర్వహణ నుంచి పక్కకు తప్పుకుంది. మోడల్‌ స్కూళ్లను మూసి వేసే ఆలోచన చేసిన టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుందని భావించి మిన్నకుంది.

పాదయాత్ర హామీతో విలీనానికి నాంది
వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో మోడల్‌ స్కూళ్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలసి సమస్యల్ని చెప్పుకున్నారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా’మని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  విద్యాశాఖలో విలీనం చేసేందుకు నిర్ణయించారు.

సర్వీసు సమస్యలు లేకుండా కసరత్తు
మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న మూడు వేల మంది ఉద్యోగులను పాఠశాల విద్యాశాఖలోకి విలీనం చేయడం ద్వారా సర్వీసు పరమైన సమస్యలు తలెత్తకుండా ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విద్యాశాఖ గొడుగు కింద ఉన్న జెడ్పీ, మున్సిపల్‌ యాజమాన్యాల మాదిరిగానే మోడల్‌ స్కూళ్లను తీసుకువచ్చి, ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌కు అనుగుణంగా ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలో విధి, విధానాల రూపకల్పన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

సీఎం నిర్ణయం ఆనందదాయకం
మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసింది. గతంలో నాలుగు నెలలు పాటు వేతనాలు లేక ఉపాధ్యాయుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు గురైన సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మా సమస్యపై స్పందించి, ప్రభుతాన్ని నిలదీశారు. అధికారంలోకి రాగానే అన్ని సదుపాయాలు కల్పిస్తామని, పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టడం ఆనందదాయకం.–కె. హేమలత, జిల్లా అధ్యక్షురాలు,ఏపీ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement