
తండ్రికి నివాళులు అర్పించిన జగన్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం ఇడుపులపాయలో నివాళులు అర్పించారు.
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. వైఎస్ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి ఆయన మౌనంగా ప్రార్థనలు జరిపారు.
పదహారు నెలల తరువాత జగన్ ఇడుపులపాయలో అడుగు పెట్టారు. నిర్బంధంలో ఉండగా రెండు వర్ధంతులు, రెండు జయంతులు కూడా ఆయన దూరమయ్యాయి. నిర్బంధంలో ఉన్నంతకాలం తండ్రి జ్ఞాపకాల్లో గడిపిన జగన్ కోర్టు అనుమతితో నేడు ఆయనకు నివాళి అర్పించేందుకు ఇడుపులపాయ వెళ్లారు.
ఇక జగన్తో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్కు అంజలి ఘటించారు. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి జగన్ ప్రార్థనలు చేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, అభిమానులు, కార్యకర్తలతో వైఎస్ఆర్ ఘాట్ కిక్కిరిసింది. తమ అభిమాన నేత ఇన్ని రోజుల తర్వాత కనిపించేసరికి అభిమానులు ఉద్వేగంతో స్పందించారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికారు.