ఉపాధి ఊసేది చంద్రబాబూ? | YS jagan mohan reddy raithu barosa yatra | Sakshi
Sakshi News home page

ఉపాధి ఊసేది చంద్రబాబూ?

Published Thu, Feb 26 2015 3:15 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

అనంతపురం జిల్లా పామిడి మండలం పాళ్యంలో వైఎస్ జగన్ కోసం వచ్చిన జనసందోహం. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న జగన్ - Sakshi

అనంతపురం జిల్లా పామిడి మండలం పాళ్యంలో వైఎస్ జగన్ కోసం వచ్చిన జనసందోహం. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న జగన్

- అనంతపురం జిల్లాలో 4 లక్షల మంది వలస వెళ్లారు
- ఖరీఫ్, రబీల్లో రైతులకు రుణాలు ఇవ్వలేకపోయారు
- బతికేందుకు ఉపాధి లేక.. అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు
- అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు
- నాలుగోరోజు రైతు భరోసా యాత్రలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
 ‘‘వర్షాలు లేవు.. పంటలు లేవు.. చేసేందుకు ఉపాధి హామీ పథకం పనులు లేవు. చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన మోసపూరిత వైఖరితో రైతులు, డ్వాక్రా మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆత్మాభిమానం చంపుకోలేక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఇంకొందరు బతికేందుకు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

ఒక్క అనంతపురం జిల్లా నుంచి మాత్రమే నాలుగు లక్షలమంది రైతులు వలసెళ్లారు. అయినా ప్రభుత్వం మాత్రం రైతులు, రైతు కూలీలకు దన్నుగా నిలవలేదు’’ అని విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగోరోజు బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలంలోని పాళ్యంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
 ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోల్పోయారు
 ‘‘ఎన్నికలకు ముందు టీవీ ఆన్‌చేస్తే.. బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి. రుణాలు మాఫీ కావాలన్నా బాబు రావాలి. జాబు కావాలంటే బాబు రావాలి. లేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలైం ది. అయినా ఎందుకు హామీలు అమలు చేయలేదని అసెంబ్లీలో నిలదీశా. ‘అయ్యో నేనెప్పుడు చెప్పాను ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని’ అని చంద్రబాబు అంటున్నారు.

ప్రజలతో పనైపోయినాక చెబుతున్న మాటలు ఇవి. సీఎం కాకముందు 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. డిసెంబర్‌లో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ మీటిం గ్‌లో రూ.99 వేల కోట్ల  వ్యవసాయ రుణ  బకాయిలు ఉన్నాయని బ్యాంకర్లు తేల్చారు. అంటే చంద్రబాబు చేసిన మోసానికి రైతులు రూ.12 వేల కోట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 4,600 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామంటోంది. ఇది కనీసం వడ్డీకి కూడా సరిపోదు’’ అన్నారు.
 
పొదుపు సొమ్ము బకాయిలకు జమ
‘‘డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు అందేవి. కానీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో 6-7 నెలలుగా బకాయిలు చెల్లించలేదు. అప్పు చెల్లించాలని, లేదంటే ఇంట్లో ఆస్తులు వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని మహిళలు చెబుతున్నారు. మహిళలకు తెలీకుండా పొదుపు డబ్బులను పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారు.’’ అని తెలిపారు. హంద్రీ-నీవా, ఘనత వైఎస్‌దైతే చంద్రబాబు తనదని చెప్పుకోవడం అబద్ధాలు కావా అని ప్రశ్నించారు.
 
ఢిల్లీ ఫలితాలు ఏపీలో పునరావృతం
‘‘ప్రజలు నమ్మి ఓట్లేశారు. దాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని వమ్ము చేస్తే బంగాళాఖాతంలో కలుపుతారు. ప్రజలను బాబు ఒకసారి మోసం చేశారు. మరోసారి వారు మోసపోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఢిల్లీలో ఆప్‌కు 70 సీట్లకు 67 వచ్చినట్లుగా ఏపీలో మనకూ అవే ఫలితాలు వస్తాయి.’’ అన్నారు.
 
ఆత్మహత్యలు చేసుకోవద్దు
‘‘ప్రభుత్వ వైఖరితో కష్టాలున్నాయి. నష్టాలున్నాయి. అయితే ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. రాత్రిపోయాక పగలు వస్తుంది. మనకూ మంచి రోజులు వస్తాయి. అందరం చేయిచేయి కలిపి కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడదాం’’ అన్నారు.
 
నాలుగో రోజు రెండు కుటుంబాలకు పరామర్శ
 నాలుగోరోజు భరోసా యాత్రలో పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నూరప్ప (38) కుటుంబాన్ని, అదే మండలంలోని అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఓబన్న (30) కుటుంబాన్ని  జగన్ పరామర్శించారు. యాత్రలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, కార్యదర్శులు బోయ తిప్పేస్వామి, ఎల్.ఎం.మోహన్‌రెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
రైతు భరోసా యాత్ర  ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే..
‘‘అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నేను గట్టిగా నిలదీశా. ప్రజల ఓట్లతో అవసరం ఉన్నపుడు ఏం చేస్తామని చెప్పారు.. ప్రజలు ఓట్లేసి అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని గట్టిగా అడిగాను. మీ అబద్ధాలు న మ్మి ప్రజలు మీ కు ఓట్లేసి గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెట్టా రు. కానీ ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. రైతులు, చేనేతలు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. మీరాడిన పచ్చి అబద్ధాలతో మోసపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రు.

దీనంతటికీ మీరు కారణం కాదా.. అని అడి గా. 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా వివరాలను చూపించా. కానీ చంద్రబాబు రైతు ఆత్మహత్యలను అవహేళన చేశారు. రైతులు సుఖ సంతోషాలతో, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎవరూ చనిపోలేదన్నారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే ఎక్కడ రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని ఒప్పుకోలేదు.

అయ్యా.. నేను ప్రతీ ఇంటికీ వెళ్లి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చూపిస్తా.. అని చెప్పా. ప్రభుత్వం నుంచి ఆదరణ లభించని క్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరో సా కల్పించి వారికి అండగా నిలిచేందుకే రైతు భరోసా యాత్ర చేపట్టాను’’ అని జగన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement