అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షడు శంకర్నారాయణ వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో శంకర్నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రైతు సమస్యలపట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు ఉండేవి కావని ఆయన అన్నారు. చంద్రబాబు రైతు సమస్యలను పక్కనపెట్టి... ఇసుక, రియల్ ఎస్టేట్ మాఫీయాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రతో అయిన చంద్రబాబు సర్కార్కు కనువిప్పు కలగాలని ఆ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. ఇప్పటికైనా కరువు రైతులను ఆదుకోవాలని చంద్రబాబు సర్కార్కు ఆయన హితవు పలికారు.