రాష్ట్ర సమైక్యత కోసం 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన: జగన్ | YS Jagan mohan reddy says he will tour all over the country for keeping state united | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సమైక్యత కోసం 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన: జగన్

Published Fri, Nov 8 2013 6:04 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రాష్ట్ర సమైక్యత కోసం 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన: జగన్ - Sakshi

రాష్ట్ర సమైక్యత కోసం 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన: జగన్

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఈనెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 26వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు. అత్యంత బాధ్యతారహితంగా రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కేవలం వారం రోజుల్లోనే పరిష్కారాలు కూడా చూపించేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం ఉన్నవాళ్లు, తమకు భవిష్యత్తులో అధికారం రాదనుకున్న రాష్ట్రాలన్నింటినీ అడ్డగోలుగా విభజించడానికి శ్రీకారం చుడుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర జిల్లాల్లోని 9,368 గ్రామ పంచాయతీలలో గ్రామసభల ద్వారా సమైక్య తీర్మానాలు చేసి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపామని, అలా తీర్మానాలు చేసిన పంచాయతీ సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి...

'' రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వేలమంది కార్యకర్తలు అరెస్టవుతున్నా, పోలీసు జులుంను తట్టుకుని రోడ్డెక్కి 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేసిన ప్రతి సోదరుడికీ చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. దీనికి సహకరించిన అన్ని వర్గాలు, ప్రజలకు కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈవాళ రకరకాలుగా పేపర్లలో చూశాం. జైరాం రమేష్ నివేదికలట, ఆ నివేదికలట, ఈ నివేదికలట. రోజుకో నివేదిక, రోజుకో లీకు చూస్తూ ఉన్నాం. వీళ్లు చేస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. వారానికి అటూ ఇటూ తిరగకముందే ఏకంగా పరిష్కారాలు చూపిస్తున్నారు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఓట్లు, సీట్లు మాకు కావాలి. వాటికోసం మీ నెత్తిన వేసేస్తాం, తర్వాత మీ చావు మీరు చావండి అంటున్నారు. వాళ్లు చూపించే పరిష్కారాలు చూడండి..
జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఓ మండలి పెడతారట. వాటిలో ఇద్దరు ముఖ్యమంత్రులు, సెక్రటరీలు ఉంటారట. ఆ మండలి కింద బోర్డులు వేస్తారట. మన రాష్ట్రానికి మాత్రమే ఇది ఉంటుందట. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనప్పుడు ఇక్కడే ఎందుకలా చేస్తున్నారు? మండలి అని మీరు చెబుతున్న ఈ కార్యక్రం చేయాలనుకుంటున్నారు? పైన ఉన్నమహారాష్ట్ర, కర్ణాటకకు కూడా ఇలాంటి మండళ్లు పెట్టి మన రాష్ట్రానికి ఎందుకు నీళ్లు సరిగా ఇవ్వట్లేదు? అక్కడ ఏమీ పెట్టరు. పైన మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక దయదలిస్తే మనకు నీళ్లొస్తాయి. అదంతా చాలనట్లు మన రాష్ట్రానికే ఎక్కడా లేనట్లుగా మండలి, బోర్డులు అంటున్నారు. దాంతో మన రాష్ట్రం పూర్తిగా ఎడారి అయిపోయి, రైతన్న పరిస్థితి దారుణంగా మారుతుంది. పై రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వాళ్లు అన్నిరకాలుగా నీళ్లు వాడుకోవచ్చు. మన రాష్ట్రంలో మాత్రం ఈ మండలి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి, ప్రాజెక్టులు కట్టకూడదు, రాష్ట్రం ఎడారి అవుతున్నా చూస్తూ ఊరుకోవాలి.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రాన్ని విడగొట్టే ప్రపయత్నం చేస్తున్నారు. 274 స్థానాలతో ఎవరైనా ఢిల్లీలో అధికారంలో ఉంటే, ఏ రాష్ట్రంలో అధికారం రాదనుకుంటే ఆయా రాష్ట్రాలను వాళ్లు విడగొట్టాలనుకుంటున్నారు. ఈ విభజన ఆంధ్ర రాష్ట్రంతోనే ఆగదు. అధికారంలో ఉన్నవాళ్లు ఏ రాష్ట్రంలోనైనా విభజన చేస్తారు. బలహీనంగా ఉన్నచోటల్లా అధికారంలో ఉన్నవాళ్లు విడగొడుతూనే పోతారు.

చంద్రబాబు విభజన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు. కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. మోసం చేయద్దు. నష్టపోయే పరిస్థితి ఉంది. దారుణంగా ఉన్నాం. మంత్రుల బృందం (జీవోఎం) సమావేశానికి వస్తారా అని ఈరోజే ఓ లేఖ వచ్చింది. కచ్చితంగా ఆ సమావేశానికి పార్టీ ప్రతినిధిగా మైసూరా రెడ్డి గారినే పంపిస్తాను. సమైక్యంగా ఉంచాలని గట్టిగా చెప్పడమే కాదు, వాళ్లను నాలుగు తిట్లు తిట్టి, బుద్ధి వచ్చేలా చెప్పమంటాను.

16వ తేదీ నుంచి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా వెళ్లే కార్యక్రమం కూడా మొదలుపెడతా. ప్రతి ముఖ్యమైన రాష్ట్రానికీ వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తా. బీజేపీ నుంచి కమ్యూనిస్టు పార్టీల వరకు ప్రతి ముఖ్యమైన పార్టీకి కూడా సమైక్యత కోసం సహకరించాలని కోరతా. 16 నుంచి 26వ తేదీ వరకు ఆయా రాష్ట్రాలు, ఢిల్లీకి వెళ్లి అందరినీ కలుస్తా. ఆంధ్ర రాష్ట్ర విభజనను చూస్తూ ఊరుకుంటే రేపు మీ రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది, ఈరోజు మీరు వ్యతిరేకించకపోతే రేపు మీదాకా వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరని వాళ్లకు నచ్చజెబుతా.

దేశంలో హిందీ తర్వాత రెండో అతి పెద్ద భాష తెలుగే. మనంతట మనం విచ్ఛిన్నం అయిపోతే ఆ తర్వాత పట్టించుకునేవాడు కూడా ఎవరూ ఉండడు. 28 రాష్ట్రాల్లో మనది మూడో స్థానం. బడ్జెట్ రీత్యా చూసినా కూడా దేశంలో మనది మూడోస్థానం. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తే, రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతే భవిష్యత్తు అంధకారమేనని పేరుపేరునా చెబుతున్నా. సమైక్యయాత్ర చేస్తూ, ఓదార్పు కోసం కుటుంబాలను కూడా పలకరిస్తా. సీబీఐ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు ఒకటే అయినా, న్యాయ స్థానాలు మాత్రం వీళ్ల చేతులో లేవు కాబట్టి అనుమతి వస్తుందని భావిస్తున్నా'' అని వైఎస్ జగన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement